దేవుడా.. ఎంత పని చేశావయ్యా!

Mother And Son Died in Bike Accident Prakasam - Sakshi

ఇరవై రెండేళ్ల ఓ యువకుడు తన కాళ్లపై తాను నిలబడాలనుకున్నాడు. తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఉపాధి కోసం సౌదీకి వెళ్లాడు. పదేళ్ల పాటు అక్కడే ఉండి కుటుంబపోషణకు సరిపడా నాలుగు రాళ్లు సంపాదించుకున్నాడు. తిరిగొచ్చి వివాహం చేసుకున్నాడు. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఏడాదిన్నర దాటినా పిల్లలు కలగలేదని దేవుడికి మొక్కుకుందామనుకున్నాడు.  తల్లి, భార్యను బైక్‌పై ఎక్కించుకుని గుడికి వెళ్తుండగా వారిని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తల్లీ కుమారుడు మృతి చెందగా భార్య తీవ్రంగా గాయపడింది. ఈ విషాద ఘటన
కొమరోలు మండలం కత్తులవానిపల్లెవద్ద  మంగళవారం జరిగింది.

కొమరోలు (గిద్దలూరు): ఆర్టీసీ బస్సు–మోటారు సైకిల్‌ ఢీకొన్న ఘటనలో తల్లి, కుమారుడు మృతి చెందారు. ఈ సంఘటన కొమరోలు మండలం కత్తులవానిపల్లె వద్ద మంగళవారం జరిగింది. ప్రమాదంలో అదే మండలం అయ్యవారిపల్లె గ్రామానికి చెందిన తల్లి, కుమారుడు సిద్ధమ్మ (55), నడిపి భూపాల్‌ (35) మృతి చెందగా భూపాల్‌ భార్య చంద్రకళకు తీవ్ర గాయాలయ్యాయి. అందిన సమాచారం ప్రకారం.. భూపాల్‌ తన భార్య చంద్రకళ, తల్లి సిద్ధమ్మతో కలిసి మోటారు సైకిల్‌పై గుడికి వెళ్తున్నారు. కడప–గుంటూరు రహదారిపైకి వస్తుండగా అదే సమయంలో కడప నుంచి విశాఖపట్టణం వెళ్తున్న ఆర్టీసీ గరుడ బస్సు ఢీకొంది. మోటారు సైకిల్‌పై ఉన్న భూపాల్‌తో పాటు అతని తల్లి సిద్ధమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. భార్య చంద్రకళకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది గిద్దలూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భూపాల్‌తో సిద్ధమ్మ మృతి చెందారు. చంద్రకళ చికిత్స పొందుతోంది. కళ్లెదుటే కన్న కుమారుడు, భార్య మృతి చెందడంతో పాటు కోడలు గాయాలతో చికిత్స పొందుతుండటాన్ని చూసిన భూపాల్‌ తండ్రి చిన్న నరసింహులు గుండెలవిసేలా విలపిస్తున్నాడు.

పిల్లలు లేరని గుడికి వెళ్తుండగా ప్రమాదం..  
ఉరియా నడిపి భూపాల్‌ సౌదీఅరేబియాకు వెళ్లి పదేళ్ల పాటు పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించేంత వరకు సంపాదించుకుని రెండేళ్ల క్రితం స్వగ్రామం అయ్యవారిపల్లె వచ్చాడు. ఏడాదిన్నర క్రితం వైఎస్సార్‌ జిల్లా బాకరాపేటకు చెందిన చంద్రకళను వివాహం చేసుకుని ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పెళ్లయి ఏడాదిన్నర కావస్తున్నా పిల్లలు లేకపోవడంతో వైఎస్సార్‌ జిల్లాలోని ఓ గ్రామంలోని ఆలయంలో పూజలు చేసేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు బంధువులు తెలిపారు. పూజలు రాత్రి వేళ చేయాల్సి రావడంతో సాయంత్రమే మోటారు సైకిల్‌పై బయల్దేరారని, లేని పిల్లల కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఉన్న కొడుకు దూరమయ్యాడని కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. మృతుడికి అన్న, తమ్ముడు ఉన్నారు. అన్న ఆర్మీలో, తమ్ముడు రైల్వే డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఒకే కుటుంబంలో తల్లి, కుమారుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ మళ్లికార్జున కేసు నమోదు చేసి దర్మాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పరిశీలించిన ఆయన పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top