సెల్‌లో 'సెల్లు'కు చెల్లు

Mobile Locater Systems in Proisons Odisha Soon - Sakshi

మొబైల్‌ లొకేటర్ల ఏర్పాటుకు నిర్ణయం

జైళ్ల శాఖ డీజీ సంతోష్‌ ఉపాధ్యాయ

భువనేశ్వర్‌: రాష్ట్ర వ్యాప్తంగా జైళ్లలో (సెల్‌) మొబైల్‌ (సెల్‌ఫోన్‌) వినియోగానికి శాశ్వతంగా తెరదించేలా జైళ్ల శాఖ యంత్రాంగం కృషి చేస్తోంది. కారాగారంలో ఉంటూ నేర సంబంధిత లావాదేవీల్ని ఖైదీలు యథేచ్ఛగా కొనసాగిస్తున్న సంఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ఈ వ్యవహారాలు మొబైల్‌ ఫోన్లలో నిర్వహిస్తున్నట్లు తేలింది. జైళ్లలో మొబైల్‌ ఫోన్ల అక్రమ వినియోగానికి తెరదించడం పరిష్కారంగా రాష్ట్ర కారాగార శాఖ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ముందుకు సాగుతున్నట్లు కారాగారాల శాఖ డైరెక్టర్‌ జనరల్‌ సంతోష్‌ ఉపాధ్యాయ తెలిపారు. మొబైల్‌ ఫోన్లను కారాగారాల్లో నివారించేందుకు లొకేటర్లు ఏర్పాటు చేస్తారు. ఈ వ్యవస్థ ఆధ్వర్యంలో జైళ్లలో మొబైల్‌ ఫోన్ల  చొరబాటు నివారణ సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 91 జైళ్లలో మొబైల్‌ లొకేటర్ల వ్యవస్థను ప్రవేశ పెడతామని తెలిపారు. 2019›– 20 ఆర్థిక సంవత్సరంలో 300 మొబైల్‌ ఫోన్‌ లొకేటర్లు కొనుగోలు చేస్తారు. తొలి విడత కింద రూ. 75 లక్షలు వెచ్చించి మొబైల్‌ లొకేటర్లు ఏర్పాటు చేస్తారు.

నేరాల నియంత్రణలో భారీ సంస్కరణ
రాష్ట్రంలో నేరాల నియంత్రణలో మొబైల్‌ లొకేటర్ల ఏర్పాటు భారీ సంస్కరణగా జైళ్ల శాఖ డీజీ పేర్కొన్నారు. యావజ్జీవ కారాగారవాసం చేస్తున్న ఖైదీలు తమ అనుచరులతో బయటి ప్రపంచంలో నేర కార్యకలాపాల్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్న నేర చరిత లావాదేవీలకు ఈ వ్యవస్థ తెర దించుతుందని అభిప్రాయ పడ్డారు. ఈ వ్యవస్థ అమలును పురస్కరించుకుని జైలు సిబ్బంది, అధికారుల మొబైల్‌ ఫోన్లను కూడా జైళ్ల ప్రాంగణాలకు అనుమతించరు. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని  కారాగారాల శాఖ డైరెక్టర్‌ జనరల్‌ సంతోష్‌ ఉపాధ్యాయ్‌ హెచ్చరించారు. అధికారులు, సిబ్బంది మొబైల్‌ ఫోన్లను ప్రధాన ప్రవేశ ద్వారం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొబైల్‌ ఫోన్‌ కౌంటర్‌లో జమ చేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top