అదృశ్యమైన యువతి మృతదేహం లభ్యం

Missing Woman Dead Body Found - Sakshi

హత్య చేసి నిందితులు పరారీ వీడిన మిస్టరీ

పశ్చిమగోదావరి,గణపవరం: గణపవరం మండలం కేశవరం గ్రామంలో శనివారం అదృశ్యమైన యువతి యనమదుర్రు మురుగు కాలువలో గుర్రపు డెక్కకింద శవమై తేలడంతో ఈ ఘటన ఆ ప్రాంతంలో  తీవ్ర సంచలనమైంది. ఈ హత్య కేసును గణపవరం పోలీసులు ఛేదించారు. ఆదివారం యువతి మృత దేహాన్ని కాలువలోంచి వెలికితీసి పోస్ట్‌మార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో మంచినీటి చెరువు సమీపంలో ఒక మహిళకు చెందిన చున్నీ, చెప్పులు, చెవి రింగుతో పాటు రక్తపు మరకలు కూడా కనిపించడంతో ఎవరో మహిళ హత్యకు గురైందనే ప్రచారం జోరుగా సాగింది. ఈ విషయం గ్రామంలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా తీవ్ర సంచలనం కల్గించింది. గణపవరం పోలీసులు గ్రామానికి వచ్చి సంఘటన స్థలంతో పాటు చుట్టూ గాలించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు. డాగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు చేసినా, సమీపంలోని చెరువులో వలలతో వెతికించినా మహిళ ఆచూకీ లభించలేదు.

దీంతో పాటు ఆ యువతితో సహజీవనం చేస్తున్న వ్యక్తి కూడా అదృశ్యమవడంతో కేసు మిస్టరీ వీడలేదు. అసలు ఆమె హత్యకు గురైందా? లేక మరే కారణం వల్లైనా రక్తపు మరకలు వచ్చాయా అనేకోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరకు ఆదివారం యువతి మృత దేహం లభ్యమవడంతో హత్యకేసు మిస్టరీ వీడింది. గణపవరం సీఐ శ్రీనివాసయాదవ్‌ సమాచారం ప్రకారం .., చాగల్లు మండలం మార్కొండపాడుకు చెందిన గుబ్బల శ్రీను అనే యువకుడు లక్ష్మీ అనే యువతితో కలిసి గణపవరం మండలం కేశవరం గ్రామంలోని బంధువు మునసా రాజయ్య ఇంట్లో కొద్ది రోజులుగా వారితో పాటే ఉంటున్నాడు. రాజయ్య, అతడికుమారుడు వీరబాబు, గుబ్బల శ్రీను మధ్య ఈ నెల 11న రాత్రి ఘర్షణ జరిగింది. అదే రోజు రాత్రి వీరు ముగ్గురు కలిసి లక్ష్మిని హత్య చేశారు. వీరందరి మధ్య పెనుగులాట వలన ఆ స్థలంలో యువతి చున్నీ, చెప్పులు, గాయమవడంతో రక్తపు మరకలు కనిపించాయి. 

ఎటువంటి ఆధారాలూ దొరక్కుండా చేయాలని ముగ్గురూ కలసి మృతదేహాన్ని సమీపంలోని యనమదుర్రు మురుగు కాలువలో గుర్రపుడెక్క కింద పూడ్చిపెట్టారు. ఆదివారం ఉదయం గుర్రపుడెక్కలో నుంచి మహిళ కాళ్లు కనిపించడంతో స్థానికులు వీఆర్వో చంద్రశేఖర్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన గణపవరం పోలీసులకు తెలిపారు.  ఏలూరు డీఎస్పీ ఈశ్వరరావు,  గణపవరం సీఐ శ్రీనివాసయాదవ్, ఇన్‌చార్జి ఎస్సై వీరబాబు సంఘటనా స్థలికి వచ్చి మృతదేహం వెలికి తీయించి పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితులు ముగ్గురూ పరారీలో ఉన్నారని వీరి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయని సీఐ శ్రీనివాస యాదవ్‌ తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top