డ్రగ్‌ మాఫియాపై దాడి... షాక్‌లో పోలీసులు!

 Mexico Police rided On Den Of Suspected Drug Traffickers and Found Over 40 skulls  - Sakshi

మెక్సికో సిటీ:  డ్రగ్స్‌ మాఫియా అడ్డాపై దాడి చేసిన మెక్సికో నగర పోలీసులకు విస్తుపోయే దృశ్యాలు దర్శనమిచ్చాయి. మెక్సికోలోని టెపితో అక్రమ వ్యాపారాలకు అడ్డాగా పేరుగాంచింది. గతవారం పోలీసులు ఈ ప్రాంతంలో జరిపిన రైడ్‌లో ఒళ్లు గగుర్పొడిచే అనేక విషయాలు బయటపడ్డాయి. దాడిచేసిన ప్రాంతంలో 40కి పైగా పుర్రెలు, డజన్ల కొద్ది ఎముకలు, వీటితో పాటు ఒకగాజు సీసాలో ఉంచిన పిండంను పోలీసులు కనుగొన్నారు. అదే విధంగా నాలుగు పుర్రెలతో నిర్మించన బలిపీఠాన్ని పోలీసులు అక్కడ గుర్తించారు. వీటికి సంబంధించిన కొన్ని ఫోటోలను మెక్సికో పోలీసులు విడుదలచేశారు.

కాగా ఈ కేసుకు సంబంధించిన 31 మందిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ కేసులో అనుమానితులుగా భావిస్తున్న 27 మందిని విడుదల చేయమని కోర్టు ఆదేశించగా వారిని విడిచిపెట్టారు. దీనికి సంబంధించి పూర్తి విచారణ చేపడుతున్నట్లు అటర్నీజర్నల్‌ ఆఫీసు అధికారిణి తెలిపారు. గాజు జార్‌లో లభ్యమైన పిండం మనిషిదా లేదా జంతువులదా అన్నది ఇంకా తెలియదు అని పేర్కొన్నారు. బలిపీఠంపై ఉన్న గుర్తులు, రంగు రంగుల ముద్రల ఆధారంగా క్షుద్రపూజల నేపథ్యంలో కేసును విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే డ్రగ్‌ నేరగాళ్ల అడ్డాగా మారిన మెక్సికో సిటీలో ఇటువంటి సంచలన విషయాలు బయటపడటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top