నా దేవుడిక లేడయ్యా? | Mepma Accounts Officer Died In Road Accident Ananthapur | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం

May 17 2018 9:11 AM | Updated on Aug 30 2018 4:20 PM

Mepma Accounts Officer Died In Road Accident Ananthapur - Sakshi

సుంకు కృష్ణమూర్తి మృతదేహంపై పడి రోదిస్తున్న భార్య , సుంకు కృష్ణమూర్తి (ఫైల్‌)

అనంతపురం న్యూసిటీ: నగర శివారులోని శిల్పారామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మెప్మా అకౌంట్స్‌ అధికారి సుంకు కృష్ణమూర్తి (56) దుర్మరణం చెందారు. అడిషనల్‌ కమిషనర్‌ పగడాల కృష్ణమూర్తి తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. అర్బన్‌ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి తన పదవీ కాలంలో జరిగిన నాలుగేళ్ల అభివృద్ధిపై ‘అనంత ప్రగతి– ఆత్మీయ సభ’ పేరిట బుధవారం శిల్పారామంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరపాలక సంస్థ అడిషనల్‌ కమిషనర్‌ పగడాల కృష్ణమూర్తి, మెప్మా అకౌంట్స్‌ ఆఫీసర్‌ సుంకు కృష్ణమూర్తి ద్విచక్రవాహనంలో సాయంత్రం 4.30 గంటల సమయంలో ఇస్కాన్‌ మందిరం మీదుగా శిల్పారామం బయల్దేరారు. ఫ్లై ఓవర్‌పై యూటర్న్‌ తీసుకుంటుండగా బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు కొబ్బరి నూనె లోడుతో వెళుతున్న లారీ వేగంగా ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుంకు కృష్ణమూర్తి అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక కూర్చున్న పగడాల కృష్ణమూర్తి తీవ్రంగా గాయపడ్డారు. లారీ డ్రైవర్‌ మునిస్వామికి కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌ ద్వారా సర్వజనాస్పత్రికి తరలించారు. అటు నుంచి పగడాల కృష్ణమూర్తిని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

పలువురి పరామర్శ
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నేత అనంత చంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైవీ శివారెడ్డి మార్చురీలో సుంకు కృష్ణమూర్తి మృతదేహానికి నివాళులర్పించారు. అనంత చంద్రారెడ్డి మాట్లాడు తూ కృష్ణమూర్తి తన క్లాస్‌మేట్‌ అని, మంచి మిత్రున్ని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. పరామర్శించిన వారిలో వైఎస్సార్‌ సీపీ జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, కార్పొరేటర్‌ జానకి పాల్గొన్నారు.

మంచి వ్యక్తిని కోల్పోయాం
మెప్మా అకౌంట్స్‌ ఆఫీసర్‌ ఎస్‌.కృష్ణమూర్తి మృతి బాధాకరమని, మంచి వ్యక్తిని కోల్పోయామని మేయర్‌ స్వరూప, కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి, మెప్మా పీడీ సావిత్రి పేర్కొన్నారు. ఆస్పత్రిలో మృతదేహాన్ని వారు సందర్శించి, నివాళులర్పించారు.

నా దేవుడిక లేడయ్యా?
‘అయ్యో భగవంతుడా ఎంత పని చేశావయ్యా. నా ఇంటి దేవున్ని తీసుకొని వెళ్తివే. ఏం పాపం  చేశామయ్యా..అయ్యో ఎంత ఘోరం జరిగిందే. నా దేవుడిక లేడు’ అంటూ సుంకు కృష్ణమూర్తి మృతదేహంపై పడి సతీమణి పద్మావతి బోరున విలపించింది. మెప్మా పీడీ సావిత్రి, తోటి ఉద్యోగులు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. సుంకు కృష్ణమూర్తి దంపతులకు సాయి మనోజ్, సాయి చరణ్‌ ఇద్దరు కుమారులు ఉన్నారు.

ప్రాణాలు పోయినా లెక్కలేదా?
‘అనంత ప్రగతి – ఆత్మీయ సభ’కు నగరంతోపాటు రూరల్‌ ప్రాంతం నుంచి వేలాదిమందిని తీసుకొచ్చేందుకు నిర్వాహకులు చర్యలు చేపట్టారు. అయితే ఫ్లై ఓవర్‌పై వాహనాలకు మార్గదర్శనం చేసేందుకు పోలీసులను ఏర్పాటు చేయలేదు. ట్రాఫిక్‌ విషయంలో నిర్లక్ష్యం చేయడం వల్లే మెప్మా అధికారి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడని పలువురు చర్చించుకుంటున్నారు. నగరంలోనే కార్యక్రమం ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని మరికొంతమంది గుసగుసలాడారు. ప్రమాదంలో మెప్మా అధికారి మృతి చెందినా, నగరపాలక సంస్థ అడిషనల్‌ కమిషనర్‌ గాయపడినా ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి ‘అనంత ప్రగతి – ఆత్మీయ సభ’ను కొనసాగించడం విమర్శలకు దారి తీసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement