అసలేమైనట్టు..!

Married Women Commit To Suicide - Sakshi

దేవుడు పిలుస్తున్నాడంటూ దారుణం

ఉరి వేసుకుని నవవధువు విషాదం

పెళ్లైన 11 రోజులకే తనువు చాలించిన వైనం

ఏసులో ఐక్యమవుతానని మృతురాలు చెప్పిందంటున్న కుటుంబ సభ్యులు

ఇదే తరహాలో ఈ ఏడాది కరపలోనూ ముగ్గురు మహిళల ఆత్మహత్య

మంచి జీవితాన్నివ్వు... ఒడిదొడుకులను అధిగమించే అందమైన బతుకునివ్వు... నిండా నూరేళ్ల ఆయుష్షును ప్రసాదించు... ఏ భక్తుడైనా ఆదిదేవుడి ముందు మోకరిల్లి ప్రార్థిస్తారు. ఏ దైవం కూడా తనువును చాలించి తనలో ఐక్యం కావాలని కోరదు... అలా కోరితే అది సైతానవుతుంది గానీ దైవమెలా అవుతుంది...? ఆ విషయాన్ని గ్రహించని  ఓ యువతి ‘తనను దేవుడు పిలుస్తున్నా’డంటూ ఆత్మహత్యకు పాల్ప డింది. వివాహమై పట్టుమని పది రోజులే దాటింది ... అంతలోనే ఈ విషాదం. ఈ ఏడాది జూలై నెలలో కాకినాడ సమీపంలోని కరప మండలంలో ముగ్గురు మహిళలు ఇదే మాదిరిగా బలవన్మరణానికి పాల్పడిన ఘటన మరువకముందే తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామానికి చెందిన యాళ్ల గాయత్రీదేవి (20) మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

తాళ్లరేవు(ముమ్మిడివరం): తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామానికి చెందిన యాళ్ల గాయత్రీదేవి(20) మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పెళ్లైన 11 రోజులకే తనువు చాలించింది. కోరంగి ఎస్సై వి.సుమంత్, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..మండల పరిధిలోని జార్జిపేట గ్రామానికి చెందిన అద్దెంకి వెంకట రమణ సెంట్రింగ్‌ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడికి ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె జ్యోతికి పెళ్లై అత్తారింటికి వెళ్లిపోగా, రెండో కుమార్తె గాయత్రీదేవికి గత నెల 25న కాకినాడ సూర్యనారాయణపురం గ్రామానికి చెందిన యాళ్ల సత్యమూర్తితో వివాహమైంది. అయితే మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్ప డింది. ఇది గమనించిన గాయత్రీదేవి చిన్నమ్మ మంగాదేవి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి తలుపులు పగులగొట్టారు. కొన ఊపిరితో ఉన్న ఆమెను స్థానికులు హుటాహుటిన యానాం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.  పెళ్లయ్యి రెండు వారాలు కూడా కాకముందే గాయత్రీదేవి మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

వధూవరులుగా సత్యమూర్తి, గాయత్రీదేవి(ఫైల్‌ ఫొటో)
ఏసులో ఐక్యమవుతానని..
యానాం యూకేవీ నగర్‌లో నివాసం ఉండే వెంకటరమణ అక్కడ అద్దెలు ఎక్కువగా ఉండడంతో ఏడాది క్రితం జార్జిపేటలోని తన బంధువుల పక్క పోర్షన్‌ను అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. గాయత్రీదేవి యానాంలోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తుండేది. ఆమె తల్లి సత్యవేణి 18 ఏళ్ల క్రితం క్రైస్తవమతాన్ని స్వీకరించగా, గాయత్రీదేవి కూడా నాలుగేళ్ల క్రితం క్రైస్తవ మతాన్ని స్వీకరించింది. వీరు తరచూ యూకేవీ నగర్‌లోని చర్చికి వెళ్లి ప్రార్థనలు చేసుకుని వస్తుంటారు. నిరంతరం ఏసుప్రభువును తలచుకుంటూ ప్రార్థనలు చేస్తుండేవారు. కొన్ని రోజులుగా గాయత్రీ దేవి వైఖరిలో తీవ్ర మార్పులు సంభవించాయి. తన జీవితం ఏసుకు అంకితమని చెబుతూ, తాను చనిపోయి ఏసులో ఐక్యమవుతాననేది. దీంతో ఆమె మాటలకు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందేవారు. ఆమెకు పెండ్లి చేస్తే మామూలుగా తయారవుతుందని భావించి క్రైస్తవ కుటుంబానికి చెందిన సత్యమూర్తితో అక్టోబర్‌ 30న నిశ్చితార్థం చేశారు. అయితే గాయత్రీదేవి తానెక్కడ ఏసుకు దూరమవుతానో అన్న ఆందోళనతో దిగులుగా ఉండేది. గత నెల 25 పాస్టర్ల సమక్షంలో సత్యమూర్తితో  క్రైస్తవ వివాహం జరిపించారు. ఈనెల 3న సత్యమూర్తి జార్జిపేట వచ్చాడు. భార్యతో కలిసి యూకేవీ నగర్‌ చర్చికి వెళ్లడంతో పాటు యానాంలోని పలు పర్యాటక ప్రదేశాలను ఆసక్తిగా తిలకించారు. సోమవారం సత్యమూర్తిని గాయత్రీదేవి బాగానే సాగనంపిందని తల్లిదండ్రులు తెలిపారు. మంగళవారం ఇంట్లో ప్రార్థన చేసుకుంటుందనుకున్నామని, ఇంతలో ఈ అఘాయిత్యానికి పాల్పడిందని తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. తాళ్లరేవు తహసీల్దార్‌ లోడా జోసెఫ్, కోరంగి ఎస్సై సుమంత్‌లు మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.  

2017 డిసెంబర్‌ 05..
‘‘నా జీవితం ఏసుకే అంకితం.. నేను చనిపోయి ఆయనలో ఐక్యమవుతా’’ అంటూ ఆమె నిరంతరం కుటుంబ సభ్యులతో చెబుతుండేది. ఆమె మాటలకు ఆమె ఎక్కడ దూరమవుతుందోననే బాధలో కుటుంబ సభ్యులు ఉండేవారు. పెళ్లి చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో క్రైస్తవ కుటుంబానికి చెందిన వ్యక్తితో క్రైస్తవ సంప్రదాయంలోనే 11 రోజుల క్రితం వివాహం జరిపించారు. అయినా ఆమె వైఖరిలో ఏ మాత్రం మార్పు రాలేదు. దిగులుగానే ఉండేది. ఏమైందో తెలియదు.. ఇంట్లో ప్రార్థన చేసుకుంటుందనుకుంటున్న ఆమె.. చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనతో ఆమె కుటుంబసభ్యులు నిర్ఘాంతపోయారు. మంగళవారం తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామంలో జరిగిన ఈ సంఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.

2017 జూలై తొమ్మిదో తేదీ..
ఆ మహిళలు ముగ్గురూ క్రైస్తవ మతం తీసుకున్నారు. వారిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు కాగా ఒకరు చెల్లెలి కుమార్తె. నాలుగేళ్లుగా చర్చికి వెళుతున్నారు. ఎవ్వరితోనూ పెద్దగా మాట్లాడేవారు కాదు. వెళితే చర్చికి.. లేకపోతే ఇంటికి వెళ్లి ప్రార్థనలు చేసుకోవడమే వారి పని. మరోవైపు వారికి ఆర్థిక ఇబ్బందులు కూడా ఏమీ లేవు. జీవితం సజావుగానే సాగుతోంది. 2017 జూలై తొమ్మిదో తేదీన తమ కుమారుడి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. వాళ్ల ఇంటి వద్దే అందరికీ భోజనాలుపెట్టి, పాస్టర్‌తో ప్రార్థనలు చేయించారు. ‘‘దేవుడు వచ్చేస్తున్నాడు.. దేవుడి దగ్గరకు వెళ్లిపోవాలి’’ అంటూ మాట్లాడుకున్నారు. ఆదివారం రాత్రి ముగ్గురు మహిళలు చర్చికి వెళ్లి అక్కడే ఉండిపోయారు. ఉదయం పాస్టర్‌ లేచిన తర్వాత ప్రార్థన చేసి, పండ్లు పెట్టగా ఆ ముగ్గురూ ఇంటికి వచ్చేశారు. సోమవారం ‘‘ఇంటిలో దుష్టశక్తులు తిరుగుతున్నాయని అవి పోయేందుకు ప్రార్థనలు చేస్తాం’ అంటూ ఓ గదిలోకి వెళ్లి గడియపెడ్డారు. ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో కుటుంబసభ్యులు ఇంటి వెనుక వైపు తలుపు పైకెత్తి చూడగా ఆ ముగ్గురు ఉరి వేసుకుని చనిపోయారు. కరపలోని నీలయ్యతోటవీధిలో జరిగిన ఈ సంఘటనలో కరెడ్ల చంద్రం కుమార్తెలు రాసంశెట్టి సత్యవేణి(48), సత్తి ధనలక్ష్మి(40), ధనలక్ష్మి కుమార్తె సత్తి వైష్ణవి(18) ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినా.. ఇంత వరకూ ఆ మరణాల మిస్టరీ వీడలేదు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top