శక్తిపీఠం-సిద్ధ పీఠం వ్యత్యాసాలు..? | Devotion: Shakti Peeth vs Siddha Peeth: Origins Rituals, and the Power | Sakshi
Sakshi News home page

శక్తిపీఠం-సిద్ధ పీఠం వ్యత్యాసాలు..?

Apr 9 2026 4:30 PM | Updated on Apr 9 2026 4:54 PM

Devotion: Shakti Peeth vs Siddha Peeth: Origins Rituals, and the Power

హిందూ ధర్మంలో దేవతా ఆరాధనకు, క్షేత్ర సందర్శనకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. భక్తులు పుణ్యక్షేత్రాలను సందర్శించినప్పుడు ‘శక్తిపీఠం’, ‘సిద్ధపీఠం’ అనే పదాలను తరచుగా వింటుంటారు. సామాన్య భక్తులకు ఇవి రెండూ ఒకేలా అనిపించినప్పటికీ, వీటి వెనుక ఉన్న పౌరాణిక నేపథ్యం, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం వేర్వేరు. శక్తిపీఠాలు మాతా సతీదేవి త్యాగానికి చిహ్నాలైతే, సిద్ధపీఠాలు ఋషులు, మునులు సాధించిన తపఃఫలానికి నిదర్శనాలు. శరీర భాగాలు పడినచోట శక్తి ఆవిర్భవిస్తే.. తపస్సు పండిన చోట సిద్ధి చేకూరుతుంది. ఈ రెండింటి మధ్య ఉన్న పౌరాణిక, ఆధ్యాత్మిక వ్యత్యాసాలేమిటో తెలుసుకుందాం..!

భారతీయ ఆధ్యాత్మిక భూమికలో శక్తిపీఠాలు, సిద్ధపీఠాలు రెండూ అత్యంత మహిమాన్వితమైనవిగా పరిగణించినప్పటికీ, వాటి ఆవిర్భావం వెనుక భిన్నమైన పౌరాణిక నేపథ్యాలు ఉన్నాయి. శక్తిపీఠాలు ప్రధానంగా మాతా సతీదేవి దేహ త్యాగానికి చిహ్నాలు; శివుడు ఆమె భౌతిక కాయాన్ని మోసుకెళ్తున్న తరుణంలో విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఖండించగా, భూమిపై ఆ శరీర భాగాలు పడిన 51 ప్రదేశాలు కొన్ని పురాణాల ప్రకారం..108 శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. 

ఇవి దేవి భౌతిక అవశేషాల శక్తిని కలిగి ఉండి, భక్తులకు పాప ప్రక్షాళనను, దేవి సాక్షాత్కారాన్ని కలిగిస్తాయి. ఈ శక్తిపీఠాలలో ఆ దేవి ప్రత్యక్షంగా, తన నిజ స్వరూపంలో కొలువై ఉంటుందని భక్తుల నమ్మకం. ఇక్కడ శక్తితోపాటు భైరవుడు అంటే శివుడు కూడా ఉంటాడని భావిస్తారు.

తపఃఫల సిద్ధి క్షేత్రాలు..
సిద్ధపీఠం అంటే ఒక ఋషి, సాధువు, సిద్ధుడు లేదా సాక్షాత్తు ఒక దేవత సుదీర్ఘకాలం పాటు కఠోరమైన తపస్సు ఆచరించి, పరమాత్మ అనుగ్రహాన్ని ΄÷ందిన ప్రదేశం. ఇక్కడ దేవత ఆవిర్భావం దైహికమైన భాగాల వల్ల జరగదు. కేవలం సాధన, ధ్యానం, మంత్రబలం ద్వారా జరుగుతుంది. సిద్ధపీఠాలలో ఆధ్యాత్మిక తరంగాలు అత్యంత బలంగా ఉంటాయి. 

సాధకులు ఇక్కడ సాధన చేయడం వల్ల త్వరగా ’సిద్ధి’ అంటే జ్ఞానం లేదా శక్తులు పొందుతారు. భక్తుల కోరికలు త్వరగా నెరవేరే ప్రదేశాలుగా వీటిని భావిస్తారు. ఉదాహరణకు, మార్కండేయ మహర్షి తపస్సు చేసిన చోటో లేదా మాతా వైష్ణోదేవి లాంటి క్షేత్రాలను సిద్ధపీఠాలుగా పరిగణించవచ్చు.సిద్ధపీఠాలు దైహికమైన అవశేషాలతో సంబంధం లేకుండా, కఠోరమైన తపస్సు, సాధన ద్వారా ప్రాశస్త్యం పొందిన పుణ్యక్షేత్రాలు. 

ఒక ఋషి, ముని లేదా దేవత ఏ ప్రదేశంలోనైతే సంవత్సరాల తరబడి ధ్యానం చేసి దైవత్వాన్ని సిద్ధింపజేసుకుంటారో, ఆ ప్రదేశమే సిద్ధపీఠంగా విరాజిల్లుతుంది. వీటికి నిర్ణీత సంఖ్య అంటూ ఉండదు. తపస్సు పండిన ఏ చోటైనా ఇది సాధ్యమే. ఇక్కడ కేంద్రీకృతమై ఉండే తపఃశక్తి, సంకల్ప బలం భక్తులకు అపారమైన మనశ్శాంతిని ఇవ్వడమే కాకుండా, వారు తలపెట్టిన కార్యాలు త్వరితగతిన సిద్ధించేలా అనుగ్రహిస్తాయి. క్లుప్తంగా చె΄్పాలంటే, శక్తిపీఠం దైవస్వరూపాన్ని దర్శింపజేస్తే, సిద్ధపీఠం ఆ దైవత్వాన్ని పొందే మార్గాన్ని సాధనను గుర్తుచేస్తుంది.

శక్తిపీఠమైనా, సిద్ధపీఠమైనా అంతిమంగా లభించేది ఆ జగన్మాత అనుగ్రహమే. శక్తిపీఠాలు మనకు ‘త్యాగాన్ని’, ‘భక్తిని’ గుర్తుచేస్తాయి. ఒక దేహాన్ని త్యజించినా ఆ శక్తి అక్షయంగా ఉంటుందని చాటిచెబుతాయి. సిద్ధపీఠాలు మనకు ’క్రమశిక్షణను’, ‘సాధనను’ బోధిస్తాయి. మనం కూడా ఏకాగ్రతతో తపస్సు  చేస్తే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని ఈ క్షేత్రాలు నిరూపిస్తాయి. ఈ క్షేత్రాలను సందర్శించేటప్పుడు భౌతికమైన ఆడంబరాల కంటే, ఆధ్యాత్మిక చింతనతో వెళ్లడం ముఖ్యం. అప్పుడే ఆ పీఠాల నుంచి వెలువడే దివ్యశక్తి మనలోని అజ్ఞానాన్ని తొలగించి, జ్ఞాన దీపాన్ని వెలిగిస్తుంది.
– పసుపులేటి వెంకటేశ్వరరావు, జర్నలిస్ట్‌ 

(చదవండి: కృష్ణకాళి ఆలయాన్ని దర్శించుకున్న అనంత్‌-రాధిక)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement