సీరియల్‌ కిల్లర్‌ శ్రీనివాసరెడ్డికి కర్నూలులోనూ నేరచరిత్ర

Marri Srinivas Reddy Crime Story in Kurnool - Sakshi

మహిళను హత్యచేసిన కేసులో తెలంగాణ పోలీసుల విచారణ

కేసు రికార్డులు, సీడీ ఫైళ్లు తీసుకెళ్లిన దర్యాప్తు అధికారులు

కర్నూలు: తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామాపురం మండలం హాజీపూర్‌ గ్రామంలో వరుస హత్యలకు పాల్పడిన మర్రి శ్రీనివాసరెడ్డికి కర్నూలులో కూడా నేరచరిత్ర ఉంది. నల్గొండ జిల్లాకు చెందిన ఇతను మూడేళ్ల క్రితం కర్నూలుకు వచ్చాడు. కొంత కాలం టీచర్స్‌ కాలనీలోని బల్వరీ అపార్టుమెంటులో నివాసముండేవాడు. ఈ సమయంలో లిఫ్ట్‌ మెకానిక్‌గా పనిచేసేవాడు. కర్నూలు భగత్‌సింగ్‌ నగర్‌లో నివాసముంటున్న కాశెపోగు మార్క్‌ అలియాస్‌ రాజు, గౌండా పని చేసే కాశెపోగు కళ్యాణ్, అపార్టు యజమాని కుమారుడు బల్వరీ అబ్దుల్‌ హఫీజ్‌ (గడ్డవీధి), ఎలై శ్యాం, మెకానిక్‌ అసిస్టెంట్‌ మండ్ల సురేష్‌ (భగత్‌సింగ్‌ కాలనీ) తదితరులతో కలిసి ఓ మహిళను హత్య చేసిన కేసులో కర్నూలులో జైలు జీవితం కూడా గడిపారు. 

హత్య ఎందుకు చేశారంటే..: 2016 డిసెంబర్‌ 27న కర్నూలు కొత్త బస్టాండు వద్ద విటుల కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళను శ్రీనివాసరెడ్డి మాట్లాడుకొని బల్వరీ అపార్టుమెంటు పెంట్‌ హౌస్‌కు తీసుకెళ్లాడు. మరో నలుగురితో కలిసి శారీరకంగా అనుభవించారు. డబ్బు విషయంలో శ్రీనివాసరెడ్డితో మహిళ గొడవ పడింది. దీంతో సమీపంలో ఉన్న ఐరన్‌రాడ్‌తో ఆమె తలపై బాదగా.. అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని పెంట్‌ హౌస్‌పై ఉన్న వాడుకలో లేని నీటి ట్యాంకులో పడేసి మూతపెట్టి పరారయ్యారు. 2017 ఏప్రిల్‌ 12న అపార్టుమెంటు వాచ్‌మన్‌ బావమరిది అయిన చాకలి రాజు ట్యాంకును శుభ్రం చేసేందుకు మూత తెరిచి చూడగా అందులో మృతదేహం బయటపడింది. ఈ కేసులో మర్రి శ్రీనివాసరెడ్డితో పాటు మిగిలిన వారు కూడా జైలుజీవితం గడిపారు. తాజాగా హాజీపూర్‌లో వరుస హత్యల నేపథ్యంలో శ్రీనివాసరెడ్డిని తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. కర్నూలులో మహిళ హత్య సంఘటనలో కూడా పాల్గొన్నట్లు అంగీకరించడంతో అందుకు సంబంధించి కేసు వివరాలను కనుగొనేందుకు తెలంగాణ నుంచి ఒక సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు సోమవారం రాత్రి కర్నూలుకు వచ్చారు. రెండవ పట్టణ పోలీసుస్టేషన్‌లో కేసుకు సంబంధించిన రికార్డులు, సీడీ ఫైళ్లు తీసుకెళ్లారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top