ఖాకీల ముందే బావను కడతేర్చాడు.. | Man Stabs Brother In Law Inside Police Station | Sakshi
Sakshi News home page

ఖాకీల ముందే బావను కడతేర్చాడు..

Oct 15 2019 8:51 AM | Updated on Oct 15 2019 9:03 AM

Man Stabs Brother In Law Inside Police Station - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తన సోదరి మృతికి బావే కారణమనే ఆగ్రహంతో ఖాకీల ఎదుటే బావను కత్తితో దారుణంగా హతమార్చిన యువకుడి ఉదంతం వెలుగుచూసింది.

ముంబై : సోదరి ఆత్మహత్యకు పాల్పడిందనే ఆగ్రహంతో ఖాకీల సమక్షంలోనే పోలీస్‌ స్టేషన్‌లో ఓ యువకుడు తన బావను కత్తితో పొడిచి చంపిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. నల్లసపొర పోలీస్‌ స్టేషన్‌లో తన భార్య ఆత్మహత్యపై సోమవారం సాయంత్రం ఆకాష్‌ కొలేకర్‌ తన స్టేట్‌మెంట్‌ను నమోదు చేస్తున్న సమయంలో ఆయన బావమరిది రవీంద్ర కాలెద్‌ (25) ఒక్కసారిగా బావపైకి ఉరికి కత్తితో పొడిచిచంపాడు. శనివారం రాత్రి కొలేకర్‌ భార్య, రవీంద్ర సోదరి కోమల్‌ (20) సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భార్యాభర్తల మధ్య విభేదాలే కోమల్‌ ఆత్మహత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు. సూసైడ్‌ నోట్‌ లభించకపోవడంతో​ కోమల్‌ మృతిని ప్రమాద ఘటనగా పోలీసులు కేసు నమోదు చేశారు.

కాగా మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన కోమల్‌ కుటుంబ సభ్యులు మాత్రం ఆమె మృతిపై సందేహాలు వ్యక్తం చేశారు. కోలేకర్‌ స్టేట్‌మెంట్‌ నమోదు చేసే సమయంలో కోమల్‌ తల్లితండ్రులు, సోదరుడు రవీంద్ర పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. రవీంద్ర తనతోపాటు తెచ్చుకున్న కత్తితో కొలేకర్‌పై దాడి చేసి విచక్షణారహితంగా పొడవడంతో విస్తుపోయిన పోలీసులు బాధితుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. రవీంద్రపై హత్య కేసు నమోదు చేశామని ఆయనను కోర్టు ఎదుట హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. తన సోదరి మరణానికి బావ కొలేకర్‌ కారణమని, ఆయన వల్లే తమ సోదరి ఈ కఠిన నిర్ణయం తీసుకుందని రవీంద్ర ఆరోపించారని పోలీసులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement