భార్యను గొడ్డలితో నరికి.. ఊరేసుకున్న భర్త | Man Killed His Wife In Vijayawada | Sakshi
Sakshi News home page

భార్యను గొడ్డలితో నరికి.. ఊరేసుకున్న భర్త

May 5 2019 5:44 AM | Updated on May 5 2019 5:44 AM

Man Killed His Wife In Vijayawada - Sakshi

నరసింహారావు కుటుంబం

చిట్టినగర్‌ (విజయవాడపశ్చిమ): అనుమానంతో భార్యను గొడ్డలితో నరికిన భర్త.. ఆపై ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విజయవాడలోని జక్కంపూడి కాలనీలో శనివారం చోటు చేసుకుంది. ఘటనపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. జక్కంపూడి కాలనీకి చెందిన  అవనిగడ్డ నరసింహారావు, కృష్ణకుమారి భార్యభర్తలు. వీరికి 30 ఏళ్ల కిందట వివాహమైంది. వెల్డింగ్‌ పనులు చేసే నరసింహారావుకు తొలి నుంచి భార్యపై అనుమానం ఉండేది. పుట్టిన ఇద్దరు పిల్లలకు పెళ్లిళ్లు చేసినా ఆ అనుమానం వీడలేదు. మూడు రోజుల కిందట కృష్ణకుమారి ఇబ్రహీంపట్నం సమీపంలోని జూపూడిలో ఉంటున్న అక్క దగ్గరకు వెళ్లింది. శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చిన కృష్ణకుమారి భోజనం చేసి నిద్రపోయింది. బయటినుంచి ఇంటికి వచ్చిన  నరసింహారావు ఇంట్లో ఉన్న భార్యను చూసి కోపంతో రగిలిపోయాడు. ఆవేశంతో గొడ్డలితో తలపై వేటు వేయడంతో నుదిటిపై తీవ్ర గాయమైంది. తీవ్ర రక్తస్రావంతో కృష్ణకుమారి మంచంపైనే ప్రాణాలు విడిచింది.  

కృష్ణకుమారిని హత్య చేసిన తర్వాత గొడ్డలిని బాత్‌రూమ్‌లో శుభ్రం చేసేందుకు ప్రయత్నించాడు. తెల్లవారితే విషయం అందరికీ తెలిసిపోతుందనే భయంతో ఇంటిలోనే ఫ్యాన్‌ హుక్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం కాలనీలోని అదే బ్లాక్‌లో ఉంటున్న కుమారుడు వచ్చి చూసే సరికి తలుపులు మూసి ఉండటం, లోపల నుంచి ఎటువంటి అలికిడి లేకపోవడంతో తలుపులు బద్దలు కొట్టారు. లోపల తండ్రి ఉరి వేసుకుని ఉండటం, మంచంపై తల్లి గాయాలతో చనిపోయి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులు, బంధువుల నుంచి వివరాలను అడిగి తెలుసుకుని కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement