ఆలకించదు.. ఆశ్రయమూ ఇవ్వదు

Man Held For Rape Attempt On Minor  Medchal - Sakshi

లైంగికదాడికి గురైన బాలికకు ఆశ్రయమివ్వని ‘సఖి’

రంగారెడ్డి జిల్లా సఖి కేంద్రంలో మరో ఘటన

పరువు సాకుతో ముఖం చాటేసిన తల్లిదండ్రులు

సాక్షి, హైదరాబాద్‌ : పేరుకే సఖి.. దుఖితురాలి గోడు పట్టదు. అడ్డగోలు నిబంధనల సాకుతో చూపి ఆశ్రయం ఇవ్వలేమన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చినవారిని ఆదరించకుండా తిప్పిపంపారు. ఇదీ ఓ విధి వంచితురాలి దీనగాధ. కామాంధుడు కాటేశాడు. పరువు సాకుతో తల్లిదండ్రులు ముఖం చాటేశారు. మేడ్చల్‌ జిల్లా కుషాయిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గర్భం దాల్చిన బాలికను తిప్పి పంపిన సఖి అధికారులు తాజాగా మరో ఘటనలోనూ బాధితురాలికి ఆశ్రయం ఇవ్వలేదు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇటీవల ఓ బాలిక అత్యాచారానికి గురైంది. పరువు పోయిందని భావించిన తల్లిదండ్రులు బాలికను సాకడానికి నిరాకరించారు. దీంతో ఆ బాలిక స్థానిక పోలీసులను ఆశ్రయించింది. బాలికకు ఆశ్రయం కల్పించాలని పోలీసులు గురువారం రంగారెడ్డి జిల్లా ‘సఖి’కేంద్రాన్ని సంప్రదించారు. కానీ, గర్భిణిగా ఉండటంతో ఆ అమ్మాయికి వసతి ఇవ్వలేమని అధికారులు తేల్చి చెప్పారు.

దీంతో రంగారెడ్డి జిల్లా సీడబ్ల్యూసీ చైర్మన్‌ను సంప్రదించి పరిస్థితిని వివరించారు. చైర్మన్‌ స్పందిస్తూ రాజేంద్రనగర్‌ మండలం బండ్లగూడ సమీపంలో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న కస్తూర్బా షెల్టర్‌ హోంలో ఆశ్రయం కల్పించారు. ఆపదలో ఉన్న బాలిక లేదా మహిళను అక్కున చేర్చుకోవాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సఖి కేంద్రాలను ఏర్పాటు చేసింది. నిర్భయ, పొక్సో, పనిచేసే చోట లైంగిక వేధింపుల చట్టం లాంటి కీలకమైన చట్టాల అమలు బాధ్యత ఈ కేంద్రాలకు ఉంది. కానీ, సఖి కేంద్రాలకు వచ్చే ఎమర్జెన్సీ కేసులపట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలను సాకుగా చూపుతూ వెనక్కు పంపుతున్నారని విచారం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సఖి కేంద్రాల లక్ష్యం గాడితప్పుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 
గర్భం దాల్చిన బాలిక ఇబ్బంది పడొద్దని... 
కుషాయిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గర్భం దాల్చిన బాలికకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే స్టేట్‌ హోమ్‌కు తరలించాలని పోలీసులకు సూచించినట్లు రంగారెడ్డి జిల్లా సఖి కేంద్రం నిర్వహకురాలు సుమిత్ర తెలిపారు. గర్భం దాల్చిన బాలిక గురువారం సఖి కేంద్రాన్ని ఆశ్రయించగా వెనక్కి పంపిన విషయం తెలిసింది. ఏడు నెలల గర్భిణిని వాహనంలో సఖి కేంద్రానికి, స్టేట్‌ హోమ్‌కు ప్రయాణం చేయించడం ఆమె ఆరోగ్యానికి మంచిది కాదన్నారు.

స్టేట్‌ హోమ్‌కు పక్కనే శిశువిహార్‌ ఉందని, అనుకోని క్షణంలో ఆ బాలిక ప్రసవిస్తే శిశువును పక్కనున్న శిశువిహార్‌కు తరలించవచ్చన్నారు. దీంతో మాతా, శిశువును రక్షించడం సులవవుతుందనే స్టేట్‌హోమ్‌కు పంపించాలని సూచించినట్లు చెప్పారు. కానీ, ఆ బాలికను స్టేట్‌హోమ్‌కు తరలించకుండా నాచారంలోని ప్రైవేటు హోమ్‌కు తరలించడం ఉద్దేశపూర్వకంగా జరిగిందని, బాలికకు ఆరోగ్య సమస్యలు, ప్రమాదం జరిగితే అందుకు చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

లిఖిత పూర్వక ఆదేశాలుండాలి 
అత్యవసర కేసుల స్వీకరణ విషయంలో లిఖితపూర్వక ఆదేశాలు ఉండాలనే నిబంధన పెట్టాం. మౌఖిక ఆదేశాలతో కేసులు స్వీకరించొద్దని కేంద్ర ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు. అప్పట్నుంచి లిఖిత పూర్వక సూచనలుండాలని సఖి కేంద్రాల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశాం. ఈ ఆదేశాలు సీడబ్ల్యూసీ నుంచి ఇవ్వాలి. వారు స్పందించి లేఖ ఇస్తే వెంటనే వారికి సహాయ కార్యక్రమాలు మొదలుపెడతాం.     
   –గిరిజ, ప్రాజెక్టు కోఆర్డినేటర్‌

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top