పెళ్లి సరదా తీరకుండానే.. | Man Died In Road Accident | Sakshi
Sakshi News home page

పెళ్లి సరదా తీరకుండానే..

Jun 1 2018 12:48 PM | Updated on Sep 2 2018 4:52 PM

Man Died In Road Accident - Sakshi

సాయిరాం(ఫైల్‌) 

కొత్తూరు : వివాహం జరిగిన 40 రోజులకే ఆ నవ వరుడును మృత్యువు కబళించింది. పెళ్లి సరదా తీరకుండానే నూరేళ్లు నింపేసింది. నవ వధువును వితంతువుగా మార్చేసింది. ఎన్నో ఆశలతో మెట్టినింటిలో కొత్త జీవితం ప్రారంభించిన ఆమెకు కాళ్ల పారాణి ఆరకముందే విషాదం మిగిల్చింది.

ట్రాక్టర్‌ ప్రమాదంలో నవ వరుడు దుర్మరణం చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలావున్నాయి. మండలంలోని మదనాపురం పంచాయతీ పరిధి వెంకటాపురం కాలనీకి చెందిన సన్నిబోయిన సాయిరాం(26) తన సొంత ట్రాక్టర్‌తో గురువారం మట్టి పెరుగుతున్నాడు.

అయితే మట్టి లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ కలిగాం వద్ద ఎత్తు మీదకు వస్తున్న తరుణంలో ఇంజిన్‌మీదకు లేచింది. ఈ తరుణంలో తొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో సాయిరాంకు తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.

అక్కడ వైద్యం పొందుతూ మృతి చెందాడు. దీంతో సాయిరాం కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుడు సాయిరాంకు అదే కాలనీకి చెందిన నర్సమ్మతో గత నెల 18వ తేదీన వివాహం జరిగింది. ఇంకా పెళ్లి సరదా తీరక ముందే ట్రాక్టర్‌ రూపంలో సాయిరాంకు మృత్యువు కబళించింది.

సాయిరాం మృతి చెందిన వార్త విన్నవెంటనే భార్య నర్సమ్మ, తల్లిదండ్రులు భాస్కరరావు, చెల్లమ్మ రోదనలు మిన్నంటాయి. వివాహం జరిగి 40 రోజులకే ఈ దారుణ సంఘటన జరగడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

కాళ్ల పారాణి ఆరక ముందే భర్తను పోగొట్టుకున్న నర్సమ్మను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. సాయిరాం అందరితో మంచిగా ఉన్నందున ఈయన మృతిని కాలనీ వాసులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ సంఘటనపై రిమ్స్‌ వైద్యులు చేసిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ కేసు నమోదు చేసినట్టు హెచ్‌సీ శ్రీనివాసరావు తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement