సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ పెట్టబోయి..

Man Died By Electric Current Shock In Mahabubnagar - Sakshi

ధరూరు (గద్వాల) : సెల్‌ఫోన్‌కు చార్జంగ్‌ పెట్టబోయిన ఓ యువకుడు విద్యుదాఘాతానికి గురై దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన మండలంలోని భీంపురంలో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని జాంపల్లి గ్రామానికి చెందిన ఒద్దిగడ్డ రాములు(28) తన మేనత్త గారి ఊరైన భీంపురంలో మంగళవారం జరిగిన ఊర దేవర ఉత్సవాలకు వచ్చాడు. బుధవారం ఉదయం తన సెల్‌ఫోన్‌కు చార్జింగ్‌ పెట్టబోయి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో భీంపురం, జాంపల్లి గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. రాములు భార్య పావని ప్రస్తుతం గర్భిణి. సమాచారం అందుకున్న రేవులపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించి శవాన్ని గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. గద్వాల ఏరియా ఆస్పత్రిలో రాములు బంధువుల రోదనలు మిన్నంటాయి. రాములు భార్య పావని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మురళీగౌడ్‌ తెలిపారు.

 కర్వెనలో మరో బాలిక..

భూత్పూర్‌ (దేవరకద్ర) : మండలంలోని కర్వెనలో సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ పెడుతూ ఓ బాలిక మృత్యువాత పడగా.. మరో ఘటనలో బాలిక త్రుటిలో తప్పిం చుకుంది. గ్రామానికి చెందిన భీముడు, వసంత దంపతులకు ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. కుటుంబ సభ్యులు పని నిమిత్తం బయటకు వెళ్లి వచ్చారు. సెల్‌ఫోన్‌లో చార్జింగ్‌ అయిపోయిందని గమనించిన రవళి(12) కరెంట్‌ బోర్డుకు చార్జింగ్‌ పెడుతుండగా షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందింది. రవళి స్థానిక ప్రైవేట్‌ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతుంది. బుధవారం ఉదయమే ఇదే గ్రామంలో జానంపేట రాములు కుమార్తె శివలీల సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ పెడుతుండగా షాక్‌కు గురవడంతో గమనించిన కుటుంబ సభ్యులు స్విచ్‌ను ఆఫ్‌ చేయడంతో గాయపడింది. వెంటనే ఆమెను జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top