విమానాశ్రయంలో రివాల్వర్‌ కలకలం?

man caught with revolver gun in airport - Sakshi

గన్నవరం: విమానాశ్రయంలో బుధవారం రివాల్వర్‌ కలకలం సృష్టించింది. ఓ ప్రయాణికుడి బ్యాగ్‌లో రివాల్వర్‌ ఉండడం చెక్‌ఇన్‌ కౌంటర్‌లో తనిఖీ సిబ్బంది గమనించారు. దీంతో సదరు ప్రయాణికుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని సదరు రివాల్వర్‌ అకారంలో ఉన్న వస్తువును స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన ఓ యువకుడు మహారాష్ట్రలోని పుణేలో ఎంబీఏ చదువుతున్నాడు. విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి ఎయిరిండియా విమానంలో హైదరాబాద్‌ మీదుగా పుణే వెళ్లేందుకు ఇక్కడికి వచ్చారు. డిపార్చర్‌లో బోర్డింగ్‌ పాస్‌ తీసుకున్న యువకుడు చైక్‌ ఇన్‌ విభాగంలోకి వెళ్తుండగా భద్రత విభాగం బ్యాగ్‌ను తనిఖీ చేశారు. స్కానింగ్‌లో బ్యాగ్‌లో రివాల్వర్‌ ఆకారంలో వస్తువు ఉండడంతో అతడిని అక్కడే నిలుపుదల చేశారు. సదరు వస్తువును స్వా«స్వాధీనం చేసుకున్న పోలీస్‌ నిర్ధారణ నిమిత్తం అధికారులు విజయవాడ కమిషనరేట్‌లోని ప్రత్యేక విభాగానికి పంపించారు.

సదరు యువకుడిని అదుపులోకి తీసుకుని ఎయిర్‌పోర్టులోని లాంజ్‌లో ఎయిర్‌పోర్టు ఏసీపీ ఆర్‌. శ్రీనివాస్, ఈస్ట్‌జోన్‌ ఏసీపీ విజయభాస్కర్, గన్నవరం సీఐ శ్రీధర్‌కుమార్, ఎస్పీఎఫ్‌కు చెందిన అధికారులు విచారణ చేపట్టారు. అయితే చిన్నపిల్లలు ఆడుకునే టాయ్‌ రివాల్వర్‌గా సదరు యువకుడు తెలిపారు. నాలుగో తరగతి చదువుకునేటప్పుడే రాజస్థాన్‌లో రూ.600లకు కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నాడు. ప్రయాణ హడావుడిలో ఆ వస్తువును తనకు తెలియకుండా బ్యాగ్‌లో పెట్టుకువచ్చినట్లు వివరించాడు. పోలీసులు మాత్రం ఐరన్‌తో తయారు చేసిన రివాల్వర్‌గా ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఆ రివాల్వర్‌ను నిర్ధారించే వరకు సదరు యువకుడిని తమ అదుపులోనే ఉంచనున్నట్లు పోలీస్‌ అధికారులు చెబుతున్నారు.

మద్యం తాగిన ప్రయాణికుడు..
 ఎయిరిండియా విమానంలో న్యూఢిల్లీ వెళ్లేందుకు మరో వ్యక్తి ఫూటుగా  మద్యం తాగి ఎయిర్‌పోర్టుకు రావడంతో భద్రత అధికారులు అడ్డుకున్నారు. తాగిన మైకంలో ఉన్న ఆ యువకుడి వలన ప్రయాణికులకు ఇబ్బంది కలగవచ్చనే అనుమానంతో ఆతడికి బోర్డింగ్‌ పాస్‌ ఇచ్చేందుకు ఎయిరిండియా అధికారులు నిరాకరించారు. దీంతో అతడు వెనుదిరిగాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top