క్షణికావేశం ప్రాణాన్ని బలిగొంది 

Man Attacked On Wife And Husband In Krishna District - Sakshi

కట్టపల్లిలో భార్యాభర్తలపై కత్తితో దాడి 

భర్త మృతి, భార్యకు గాయాలు

క్షణికావేశం ఒకరి ప్రాణాలను బలితీసుకుంది.. చిన్నారులు సరదాగా టపాసులు కాలుస్తున్నారు.. సమీపంలో ఒకరు  పావురాలు పెంచుతున్నాడు.. టపాసుల వలన పావురాలకు ఇబ్బంది అని వాదనకు దిగాడు.. పిల్లలతో వాగ్వాదంపై మేనత్త కల్పించుకుంది. ఇరువురు వాదులాడుకున్నారు.. పక్కన ఉంటున్న వ్యక్తి వివాదంలో కల్పించుకుని.. చెబితే వినరా అంటూ క్షణికావేశంతో కత్తితో భార్యాభర్తలపై దాడి చేశాడు. భర్త మృతి చెందగా భార్య గాయపడిన ఘటన పెడనలో బుధవారం చోటుచేసుకుంది.

పెడన: పట్టణంలోని 9వ వార్డు కట్లపల్లిలో సంచలనం సృష్టించిన ఘటనకు సంబంధించిన వివరాలను బందరు రూరల్‌ సీఐ ఎన్‌.కొండయ్య అందించారు. స్థానిక కట్లపల్లిలో అబ్దుల్‌ ఇర్ఫాన్‌(45) దంపతులు ఉంటున్నారు. ఐస్, జ్యూస్‌ వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇర్ఫాన్‌ ఇంటి పరిసరాల్లో సరదగా మేనల్లుళ్లు టపాకాయలు కాలుస్తున్నారు. టపాకాయలు కాల్చడం వల్ల సమీపంలోని పెంచుతున్న పావురాలు బెదిరి ఎగిరిపోతాయని పక్కింటి వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీరి మధ్య వాదులాట జరిగింది. పక్కింట్లో ఉంటున్న పాలపర్తి ప్రభాకరరావు అనే వ్యక్తి సంబంధం లేకుండానే కల్పించుకుని ఇర్ఫాన్‌ మేనల్లుళ్లను తిట్టాడు. అదే సమయంలో వ్యాపారం ముగించుకుని ఇంటికి వచ్చిన ఇర్ఫాన్‌ నీకు సంబంధం ఏమిటంటూ ప్రభాకరరావును నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఇద్దరూ కర్రలతో కొట్టుకునే వరకు వచ్చింది. అనంతరం ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. 

కొద్ది సేపటి తరువాత.. 
ఇరువురికి వాగ్వాదం చోటుచేసుకోగా సర్దుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. తరువాత మద్యం తాగి కత్తితో వచ్చిన ప్రభాకరరావు, ఇర్ఫాన్‌ను రెచ్చగొట్టి ఇంటి నుంచి బయటకు రప్పించాడు. తొలుత ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఇర్ఫాన్‌ భార్య అబ్దుల్‌ ఖాజాని(38) చేతిపై దాడి చేశాడు. తీవ్ర గాయమైన ఖాజాని అపస్మారక స్థితిలో పడిపోయింది. వెనుక వచ్చిన ఇర్ఫాన్‌ డొక్క భాగంలో మూడు కత్తిపోట్లు పొడిచాడు. ఇర్ఫాన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న బందరు డీఎస్పీ మహబూబ్‌ బాషా, ట్రైనీ డీఎస్పీ మల్లంపాటి శ్రావణి, బందరు రూరల్‌ సీఐ ఎన్‌.కొండయ్య, పెడన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గాయపడిన ఖాజానీని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడికి ఇద్దరు పిల్లలు కాగా ఒకరికి వివాహం అయింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top