మైనర్‌ దొంగ.. మేజర్‌గా చిక్కాడు

Man Arrested in Robbery Case Hyderabad - Sakshi

2003లో సంతోష్‌నగర్‌లో 30 తులాల ఆభరణాల చోరీ  

ఆనాడు సొత్తు దొంగిలించిన ఆల్తాఫ్‌ మైనర్‌

ఆపై మరికొన్ని కేసుల్లోనూ కటకటాల్లోకి..  

అయినా బయట పడని తొలి చోరీ వ్యవహారం

16 ఏళ్ల తర్వాత పట్టించిన ‘పాపిల్లన్‌ సాఫ్ట్‌వేర్‌’

సాక్షి, సిటీబ్యూరో: అతడి పేరు అల్తాఫ్‌.. చిన్ననాటి నుంచే నేరబాట పట్టాడు. అతడు మైనర్‌గా ఉండగా సంతోష్‌నగర్‌ పరిధిలో తొలి నేరం చేశాడు. తర్వాత అనేక కేసుల్లో అరెస్టయ్యాడు. అయినప్పటికీ తన తొలి నేరం విషయం బయటపెట్టలేదు. ప్రస్తుతం 26 ఏళ్ల వయసున్న ఇతగాడిని ‘పాపిల్లన్‌’ సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా పోలీసులు నాటి కేసులో నిందితుడిగా గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వలపన్ని పట్టుకున్నట్లు అదనపు డీసీపీ ఎస్‌.చైతన్యకుమార్‌ సోమవారం వెల్లడించారు. ఇదే సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ ఈ ఏడాది ఏప్రిల్‌లో 18 ఏళ్ల క్రితం మైలార్‌దేవ్‌పల్లిలో జరిగిన హత్య కేసును కొలిక్కితెచ్చిన విషయం విదితమే. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు 16 ఏళ్ల కిందటి చోరీ కేసును ఛేదించారు. బాలాపూర్‌ పరిధి ఎర్రకుంటలోని జామ్‌జామ్‌ కాలనీకి చెందిన షేక్‌ సర్దార్‌కు ఎనిమిది మంది సంతానం. వీరిలో ఒకడైన అల్తాఫ్‌కు చదువుపై ఆసక్తి లేక స్నేహితులతో కలిసి తిరగడం అలవాటు చేసుకున్నాడు. ఇతగాడు మైనర్‌గా ఉండగానే అనేక వ్యసనాలకు బానిసయ్యాడు. వాటికి అవసరమైన డబ్బు కోసం చోరీల బాటపట్టాడు. అలా 2003లో తొలిసారిగా సంతోష్‌నగర్‌ పరిధిలోని ఓ ఇంట్లో ఉన్న 30 తులాల బంగారం అపహరించుకుపోయాడు. దీన్ని కొందరు రిసీవర్లకు విక్రయించగా వచ్చిన డబ్బుతో జల్సా చేశాడు. దీని తర్వాత దాదాపు 14 నేరాలు చేసిన ఇతగాడు ఆయా కేసుల్లో పోలీసులకు చిక్కాడు. అయినప్పటికీ తాను సంతోష్‌నగర్‌లో చేసిన నేరం సంగతి బయటపెట్టలేదు.. పోలీసులూ పసిగట్టలేదు. దాదాపు 16 ఏళ్ల పాటు మరుగున పడిపోయిన ఈ కేసు ‘పాపిల్లన్‌’ సాయంతో సోమవారం కొలిక్కి వచ్చింది.  

ఒకప్పుడు ఘటనా స్థలాల్ని సందర్శించిన పోలీసులు అక్కడ నుంచి సేకరించిన అనుమానితుడి వేలిముద్రలను మాన్యువల్‌గా పరీక్షించారు. అయితే, అవి పాత నేరస్తుల డేటాబేస్‌లో ఉన్న వాటితో సరిపోకపోవడంతో అల్తాఫ్‌ తాత్కాలికంగా తప్పించుకోగా.. 30 తులాల బంగారం చోరీకి సంబంధించిన కేసు పెండింగ్‌లో పడిపోయింది. నగర పోలీసు విభాగం కొన్నాళ్ల క్రితం ‘పాపిల్లన్‌’ అనే ఆటోమేటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ ఐడెంటిఫికేషన్‌ సాఫ్ట్‌వేర్‌ను సమకూర్చుకుంది. దీనికితోడు ఇప్పటి వరకు అరెస్టు అయిన, వాంటెడ్‌గా ఉన్న పాత నేరగాళ్లతో పాటు వివిధ నేర స్థలాల్లో దొరికిన వేలిముద్రలను డిజిటలైజ్‌ చేశారు. నగర పోలీసులు వాటన్నింటినీ ఓ సర్వర్‌లో నిక్షిప్తం చేశారు. ఈ డేటాబేస్‌ను సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానించడంతో పాటు అందులో సెర్చ్‌ ఆప్షన్‌ చేర్చి సిబ్బందికి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సాఫ్ట్‌వేర్‌ వివిధ సందర్భాలు, సమయాల్లో నేర స్థలాల్లో దొరికిన వేలిముద్రలను పాత నేరగాళ్లకు చెందిన వాటితో సరిచూసి తక్షణం రిజల్ట్‌ వస్తోంది. ఇలా ఈ సాఫ్ట్‌వేర్‌ అల్తాఫ్‌ 16 ఏళ్ల క్రితం చేసిన కేసును తవ్వి చూపించి చోరీ వ్యవహారం బయటపెట్టింది. దీంతో సౌత్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.మధుమోహన్‌ రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు కేఎన్‌ ప్రసాద్‌వర్మ, ఎన్‌.శ్రీశైలం, వి.నరేందర్, మహ్మద్‌ తర్ఖుద్దీన్‌తో కూడిన బృందం అల్తాఫ్‌ కోసం గాలించింది. సోమవారం పట్టుకుని ఏడు తులాల చోరీ సొత్తు స్వాధీనం చేసుకుంది. నిందితుడిని తదుపరి చర్యల నిమిత్తం సంతోష్‌నగర్‌ పోలీసులు అప్పగించింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top