భార్యను వేధించిన కేసులో భర్త అరెస్టు

Man Arrested In Harassment Case - Sakshi

శ్రీకాకుళం రూరల్‌ : భార్యను వేధించిన కేసులో భర్తను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం రూరల్‌ మండలం కనుగులవానిపేటకు చెందిన సుజాతపై భర్త నగేష్‌ చేసిన అకృత్యాలపై ‘భర్తే.. మానవమృగం’ శీర్షికన ఇటీవల ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై వరుస కథనాలు రావడం, బాధితురాలు సుజాత తరఫున పలువురు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, అధికారులు నిలబడటంతో పోలీసులు స్పందించారు. సుజాత భర్త నగేష్, అత్త సరోజిని, ఆడపడుచు మాలతీపై మంగళవారం కేసులు నమోదయ్యాయి. దర్యాప్తు అనంతరం నగేష్‌పై గృహహింస, అదనపు కట్నం, బలవంతపు హత్యాయత్నం, అంగవైకల్యం తదితర సెక్షన్‌లు కింద కేసు నమోదు చేసి 15 రోజులు రిమాండ్‌కు తరలించినట్లు రూరల్‌ ఎస్‌ఐ చిన్నంనాయుడు బుధవారం తెలిపారు.

సుజాతకు దిక్కెవరు..!

సుజాత పరిస్థితి తెలుకొని అందరూ జాలిగా చూస్తున్నారు తప్ప ఏ ఒక్కరూ ఆదుకోవడానికి ముందుకు రావడం లేదు. కనీసం ఆశ్రయం ఇచ్చేందుకు స్వచ్ఛంద సంస్థలు గానీ, మహిళా సంఘాలు ముందుకు రాకపోవడంతో ఆమె పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సుమారు నాలుగు నుంచి ఆరు నెలలు పాటు బెడ్‌ రెస్ట్‌ ఉండాలని, మలమూత్ర విసర్జన బెడ్‌మీదే జరగాలని వైద్యులు చెప్పినప్పటికీ ఆ దిశగా సేవలందించే వారు ఎవరున్నారంటూ ఆమె కన్నీటిపర్యంతమవుతోంది.

ఇతరులపై ఆధారపడడం కంటే ఆస్పత్రిలోనే ఉంటే కాస్తయిన వైద్యం అందుతోందని ఆమె అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే  జెమ్స్‌ వైద్యులు డిశ్చార్జ్‌ ఇస్తామని,  మరో నాలుగు రోజలు పోతే  కుట్లు విప్పుతామని చెప్పారు. ఈ పరిస్థితిలో బయటకు వెళ్తే తిరిగి రాలేనని, ఆ నాలుగు రోజులు ఇక్కడ ఉంటానని, అప్పుడే కుట్లు విప్పాలని వైద్యులను వేడుకున్నట్లు తెలిసింది. కాగా, సుజాత భవిష్యత్‌లో కాలు బాగైనప్పటికీ కొంతమేరకు అంగవైకల్యం వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top