కాపాడబోయి మృత్యువు ఒడిలోకి

Man And Boy Died While Swimming In kadapa - Sakshi

సాక్షి, కొండాపురం(కడప) : నీరు చూడగానే వారిలో ఉత్సాహం పెల్లుబికింది. సరాదాగా ఈత కొడదామని దిగారు. అందులో ఓ వ్యక్తి మునిగిపోతుండటాన్ని చూసి మరొక వ్యక్తి రక్షించాడు. కాస్సేపటికే మరొకరిని కాపాడే యత్నంలో తానూ ప్రాణాలు కోల్పోయాడో వ్యక్తి. చిత్రావతిలో ఈతకు దిగిన ఇద్దరు మరణించిన సంఘటన కుటుంబ సభ్యులకు శోకాన్ని మిగిల్చింది. వివరాలివి.  మండలంలోని యనమలచింతల గ్రామంలో పీర్లపండుగ జరుగుతోంది. ఈ సందర్భంగా  గ్రామానికి చెందిన కట్టుబడి హాజివలి ఇంటికి మంగళవారం బం ధువులు వచ్చారు. వీరు అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలోని చాగల్లు గ్రామానికి చెందినవారు. వీరిలో  అన్వర్‌వలి(14), షేక్‌. బాబావలి(26) ఉన్నారు. బాబావలి తాడిపత్రిలోని ఎస్‌జెకే స్టీల్‌ ప్లాంట్‌లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతనికి భార్యతో పాటు మూడు నెలల పాప ఉంది.  అన్వర్‌ వలి తాడిపత్రిలోని ఒక ప్రైవేట్‌ పాఠశాలలో  8వ తరగతి చదువుతున్నాడు. చిత్రావతిలో నీరు చేరిందనే సంగతి తెలుసుకుని మధ్యాహ్నం 12 గంటల సమయంలో వీరిద్దరూ మరో ముగ్గురితో కలిసి సరదాగా ఈతకు వెళ్లారు. ఆలయం దగ్గర నదిలోకి దిగారు. ఇందులో దస్తగిరి అనే వ్యక్తి నీటిలో మునిగిపోతుండగా షేక్‌ బాబాలివలి గుర్తిం చాడు.

వెంటనే స్పందించి కాపాడి బయటకు తీసుకువచ్చాడు. ఇంతలోనే అన్వర్‌వలి అనే బాలుడు కూడా మునిగిపోతూ కేకలు వేశాడు. అతడ్ని కూడా రక్షించాలని బాబావలి వెంటనే నీటిలో దూకాడు. అన్వర్‌వలిని నీటి నుంచి రక్షించి తీసుకువస్తూ పూడికలో చిక్కుకున్నాడు. దీంతో ముందుకు కదలలేకపోయాడు. అన్వర్‌వలి..బాబావలి నీటిలో మునిగిపోయారు. వెంటనే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారు అందించిన సమాచారం మేరకు కొందరు చేరుకుని రక్షించడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. అతిథులుగా వచ్చి విగతజీవులైన వీరిద్దరి మృతదేహాలను చూసి స్థానికులు చలించిపోయారు. గ్రామంలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తాళ్లప్రొద్దుటూరు ఎస్‌ఐ రాజారెడ్డి చేరుకున్నారు.  ప్రమాద వివరాలను సేకరించారు. మృతదేహాలను  పోస్టుమార్టం కోసం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్‌ సుధీర్‌రెడ్డి విషయం తెలుసుకుని వెంటనే హాజివలి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతదేహాలకు నివాళులర్పించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top