 
													జాతీయ స్థాయి ఈత పోటీల్లో లక్ష్మారెడ్డి ప్రతిభ
ఎనిమిది పదుల వయసులో ఎంతో చలాకీగా ఈత కొడుతూ అందరినీ అబ్బురపరుస్తున్నాడు. అంతేకాదు పదుల సంఖ్యలో పతకాలు సొంతం చేసుకున్నాడు. జాతీయ స్థాయి ఈత పోటీల్లో తన ప్రతిభను చాటుతున్నాడు నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన లక్ష్మారెడ్డి. వ్యాయామం చేయడానికి కూడా బద్దకించే అనేక మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. – కూకట్‌పల్లి
నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్ –6లో నివాసముండే కే.లక్ష్మారెడ్డి(79) జాయతీ స్థాయి ఈత పోటీల్లో సత్తా చాటుతున్నాడు. ఎనిమిది పదుల వయసులోనూ ఇటీవల (అక్టోబర్–11,12) ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన జాతీయ స్థాయి ఈత పోటీల్లో 25, 50 మీటర్ల కేటగిరీలో రెండు ప్రథమ బహుమతులు సొంతం చేసుకున్నాడు. అక్కడితో ఆగలేదు.. అదే పోటీల్లో 50, 100 మీటర్ల ఈత పోటీల్లోనూ రెండు ద్వితీయ పతకాలు, మిడ్లే పోటీలో ప్రథమ బహుమతి, రిలే పోటీల్లో ద్వితీయ బహుమతి సాధించి వివిధ కేటగిరీల్లో ఒకే సారి ఏకంగా ఆరు పతకాలు కైవసం చేసుకున్నాడు.
65వ ఏట నుంచి.. 
లక్ష్మారెడ్డి తన 65వ ఏట నుంచి ఈత పోటీల్లో పాల్గొంటున్నారు. సికింద్రాబాద్, నాందేడ్, కర్నూలు, కూకట్‌పల్లిలో నిర్వహించిన వివిధ కేటగిరిలో ఇప్పటికి 21 పతకాలను సాధించి, ఉత్తమ ప్రతిభను కనబరుస్తూ యువతకు, తన తోటి వయసు వారికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 
ఆరోగ్యానికి నిత్యం సాధన.. 
ప్రతి రోజూ స్థానికంగా ఉండే స్విమ్మింగ్ పూల్‌లో ఈత ప్రాక్టీస్ చేస్తుంటారు. ముగ్గురు పిల్లలు ఉద్యోగాల రీత్యా ఒకరు విదేశాల్లో, మిగిలిన వారు బెంగళూరులో ఉంటున్నారు. భార్యతో పాటు కేపీహెచ్‌బీలో ఉంటూ స్థానికంగా అనేక సంక్షేమ కార్యక్రమాల్లోనూ భాగస్వామ్యం అవుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. చుట్టుపక్కల ఆసక్తి కలిగిన పిల్లలకు కూడా ఈత నేర్పిస్తుంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం వ్యాయామాలు గానీ, లేదా ఈత గానీ సాధన చేయాలని సూచిస్తున్నారు. లక్ష్మా రెడ్డి స్వస్థలం కృష్ణాజిల్లా, పెద ఓగిరాల. తన విజయాల గురించి చెబుతూ మిత్రుల ప్రోత్సాహంతోనే తాను ఈ పోటీల్లో పాల్గొంటున్నానని వివరించారు.
ఇదీ చదవండి: స్వరోవ్స్కి ఈవెంట్‌లో రష్మిక్ స్టైలిష్ లుక్ : ఎంగేజ్‌మెంట్ రింగ్ స్పెషల్!
 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
