
లోతుపాతులు తెలియక నిత్యం పలువురు మృత్యువాత
అత్యుత్సాహంతో కొందరు.. ఆదమరచి మరికొందరు
ఈతలో మెళకువలు తెలుసుకోవడం తప్పనిసరి
కొంచెం దృష్టి పెడితే స్విమ్మింగ్ వల్ల ఎన్నో ఉపయోగాలు
విశాఖపట్నం నాయుడుతోట సమీపంలోని మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌లో ఇటీవల ఇద్దరు యువకులు నీట మునిగి మృతి చెందారు. పెందుర్తికి చెందిన బల్లంకి శేఖర్(18), ఇతని సోదరుడు వాసు, చినముషిడివాడకు చెందిన యాడాడ లక్ష్మణ్‌కుమార్ (18) సరదాగా రిజర్వాయర్ ఒడ్డున కూర్చొని ఉండగా శేఖర్ చెప్పు నీటిలో పడిపోయింది. రిజర్వాయర్ అంచు పట్టుకుని దానిని బయటకు తీసే క్రమంలో నాచు కారణంగా నీటిలో పడిపోయాడు. పైకి, కిందికి మునకలేస్తుండగా ఒడ్డు నుంచి లక్ష్మణ్ కుమార్ చేయి అందించబోయాడు.
అయితే శేఖర్ అమాంతం.. లక్ష్మణ్ చేయిని లాగేయడంతో ఇద్దరూ నీట మునిగి పోయారు. వీరిద్దరికీ ఈత రాదు. ఒడ్డునే ఉన్న వాసు (ఇతనికి ఈత వచ్చు) నీటిలోకి దూకి వారిని రక్షించబోగా.. ఇతన్ని గట్టిగా పట్టేసుకున్నారు. దీంతో ముగ్గురూ నీటిలో మునిగి పోతుండగా ఒడ్డున ఉన్న మరో వ్యక్తి గమనించి నీటిలోకి దూకి.. ఒక్క వాసును మాత్రమే కాపాడగలిగాడు. మొన్నామధ్య అన్నమయ్య జిల్లా రాజంపేటలో ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు, మచిలీపట్నం సమీపంలో నలుగురు విద్యార్థులు ఇలానే మృత్యువాత పడ్డారు.
ఇలాంటి సంఘటనలు ప్రతి రోజూ రాష్ట్రంలో ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. చాలా మంది విద్యార్థులు ఈత రాక, మరికొందరు ఈత వచ్చినా కూడా ఇలాంటి ఘటనల్లో మృతి చెందుతున్నారు. చాలా మందికి ఈత వచ్చినా ‘రెస్క్యూ’ (కాపాడటం) ఎలా చేయాలో తెలియక పోవడం విచారకరం.
» చాలా దేశాల్లో స్విమ్మింగ్, సైక్లింగ్, కుకింగ్.. అనేవి విద్యార్థి దశలోనే మాండటరీ. ప్రతి వ్యక్తికి ఏదో ఒక దశలో ఇవి చాలా ముఖ్యం. ఇవి వస్తేనే ఉన్నత విద్యలో ప్రవేశం ఉంటుంది. మన దేశంలో మాత్రం అంత ముఖ్యం కాదు. ఇవన్నీ ఐచ్ఛికం. కుకింగ్ (వంట చేయడం) ఎంత ఇంపార్టెంటో మొన్న కరోనాలో మనకు బాగా తెలిసొచ్చింది. ఈత అనేది ఎంత ఉపయోగకరమో పైన చెప్పుకున్న ఘటనల్లాంటివి మనకు తారస పడినప్పుడు తెలుస్తుంది.
» చాలా మందికి.. ప్రత్యేకించి యువతకు నీటి గురించి అవగాహన ఉండదు. ఆ.. ఏమవుతుంది అనుకుని నీటిలో దిగేస్తుంటారు. ఫ్రెండ్స్‌తో కలిసి బీచ్‌లకు, నది ఒడ్డుకు పిక్నిక్‌లకు వెళ్లినప్పుడు లోతు గమనించకుండానే ముందుకెళుతూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటుంటారు. మరికొంత మంది స్విమ్మింగ్ పూల్‌లో పట్టుమని 10 మీటర్లు కూడా ఈదలేని విధంగా ఉదరాబదరా ఈత నేర్చుకుని ‘మాకూ ఈత బాగా వచ్చు’ అని భ్రమ పడుతుంటారు.
» పై ఈత (ఫ్రీ స్టైల్), లో ఈత (అండర్ వాటర్), వెనకీత (బ్యాక్ స్ట్రోక్), పక్కీత (సైడ్ స్ట్రోక్), నిలువీత (స్టాండింగ్ పొజిషన్), ఏటీత (బటర్‌ఫ్లై స్ట్రోక్), కప్పీత (బ్రెస్ట్ స్ట్రోక్) అని ఈతలో చాలా రకాలున్నాయి. చాలా మంది ఇవన్నీ నేర్చుకున్నప్పటికీ ఎప్పుడు ఏ ఈత అవసరమో తెలుసుకోరు. నేర్పించే వారు కూడా చెప్పరు.
భారీ పరిమాణంలో నీరు నిల్వ ఉన్న చోట వెనకీత (బ్యాక్ స్ట్రోక్), కొద్దిపాటి ప్రవాహాలకు ఎదురీదాల్సి వచ్చినప్పుడు, సుడిగుండాల్లో చిక్కుకున్నప్పుడు ఏటీత (బటర్‌ఫ్లై స్ట్రోక్), చిన్నపాటి కాలువలు దాటాల్సి వచ్చినప్పుడు పై ఈత (ఫ్రీ స్టైల్), నీటిపైన చెత్తా చెదారాలు, పరిశ్రమల వ్యర్థాలు తేలుతున్నప్పుడు అండర్ వాటర్ ఈత అవసరం. అన్నింటికంటే బ్యాక్ స్ట్రోక్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఎక్కువగా అలుపు రాదు. మధ్య మధ్యలో నీటిపై తేలియాడుతూ రిలాక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎంత దూరమైనా ఇలా నెమ్మదిగా వెనక్కు వెళ్లిపోవచ్చు.
» చాలా మంది యువతకు కొద్దో గొప్పో ఈత వచ్చి కూడా చనిపోవడం చూస్తున్నాం. ఇలాంటి చాలా ఘటనల్లో బయటకు చెప్పలేని నిజం ఏమిటంటే వారు మద్యం మత్తులో ఉండటం. సరదాగా స్నేహితులతో కలిసి పిక్నిక్‌లకు వెళ్లినప్పుడు మందు (లిక్కర్) తాగుతుంటారు. అలా మద్యం మత్తులో నీటిలోకి దిగినప్పుడు ఎంత దూరం లోపలికి పోతున్నారో గమనించరు.
తిరిగి వెనక్కు వచ్చే క్రమంలో ఆయాసం ఎక్కువై.. బాడీ బ్యాలెన్స్ చేసుకోలేక.. ఆలోచించే కెపాసిటీ కోల్పోయి నీట మునిగి చనిపోతున్నారు. అందువల్ల మద్యం తీసుకున్నప్పుడు పొరపాటున కూడా ఈతకు దిగరాదని యువతకు గట్టిగా చెప్పాలి. మన పిల్లలకు మనం నీరంటే భయమన్నా నేర్పాలి. లేదా ఈత అయినా నేర్పించాలి. – సాక్షి స్పెషల్ డెస్క్
రెస్క్యూ చాలా కీలకం
ఇకపోతే చాలా మందికి ఈత బాగా వచ్చినప్పటికీ రెస్క్యూ చేయడం తెలియదు. ఆపదలో ఉన్న వారిని కాపాడబోయి వీరూ మృత్యువాత పడుతుంటారు. ఎందుకంటే నీట మునిగి పోతున్న వారి దగ్గరకు మనం వెళ్లగానే వారు మనల్ని గట్టిగా పట్టేసుకుని ముంచేస్తారు. అందువల్ల ఎవరినైనా కాపాడాలనుకుంటే నేరుగా వారి ముందుకు వెళ్లకూడదు. ఒకవేళ వారు పట్టుకోజూసినా గట్టిగా తోసేసి విదిలించుకోవాలి. వారి వెనక్కు వెళ్లి సంకల కింద ఒక చేయి వేసి పట్టుకోవాలి. అంటే వారి తలను మన భుజం వద్ద పెట్టుకోవాలి.
అప్పుడు వారికి శ్వాస తీసుకోవడానికి వీలవ్వడంతో మనకు సహకరిస్తారు. మరో చేత్తో నెమ్మదిగా రివర్స్ స్ట్రోక్‌లో ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకోవాలి. అనంతరం ప్రథమ చికిత్స చేయాలి. ఈతలో మరింత ప్రొఫెషనల్‌గా తయారవ్వడం కోసం రాష్ట్రీయ లైఫ్ సేవింగ్ సొసైటీ శిక్షణ ఇస్తోంది. మరిన్ని వివరాలకు ‘లైఫ్ సేవింగ్ ఇండియా డాట్ ఆర్గ్’ వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చు.
కొత్త ప్రాంతాల్లో జాగ్రత్తలు తప్పనిసరి
చాలా మందికి అంతో ఇంతో ఈత వచ్చినా కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు ప్రమాదాలబారిన పడుతుంటారు. ప్రధానంగా పరిసరాలు, లోతు గమనించకుండా డైవ్ చేస్తుంటారు. ఇది సరికాదు. తొలుత నీటిలోకి దూకే ముందు ఎంత లోతులో ఉందో అంచనా వేయాలి. సుడిగుండాలున్నాయేమో గమనించాలి. కింద బురద మట్టి, పదునైన రాళ్లు ఏమైనా ఉన్నాయా అని కూడా పరిశీలించాలి.
ఇవన్నీ తెలుసుకోకుండా అమాంతం దూకేయడం సరికాదు. స్విమ్మింగ్ పూల్‌లో ఈదినట్లు అన్నిచోట్లా సాధ్యం కాదు. ఇంకో విషయం.. ‘నాకు ఈత బాగా వచ్చు.. మీకు ఏమీ కాదు.. నేనున్నాగా.. మీరు దిగండి..’ అంటూ కొంత మంది పిక్నిక్‌లకు వెళ్లినప్పుడు స్నేహితులను బలవంతం చేస్తుంటారు.
తీరా లోపలకు దిగి.. కొంత దూరం వెళ్లాక బురదలో కాళ్లు ఇరుక్కుపోతే.. లేక కింద గుంత లోతుగా ఉంటే రెస్క్యూ చేయడం చాలా కష్టం. అందుకే అన్నీ గమనించాలి. ఈత గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అందరికీ చాలా అవసరం. ప్రత్యేకించి ఎన్నో అనారోగ్యాలకు చక్కటి మందు. ఒత్తిడిని సహజంగా తగ్గిస్తుంది. భారీ వర్క్ అవుట్స్ చేయలేని, జాగింగ్, వాకింగ్‌కు వెళ్లలేని వారికి అత్యద్భుతమైన ఎక్సర్‌సైజ్ స్విమ్మింగ్. – కీర్తన సుందరమూర్తి, స్విమ్మింగ్ కోచ్, విజయవాడ