నేడు పోలీస్‌ కస్టడీకి ‘మోకా’ నిందితులు

Machilipatnam Police Take Custody in YSRCP Leader Murder Case - Sakshi

మూడు రోజుల పాటు విచారణ

కుట్ర వెనుక దాగి ఉన్న వాస్తవాలు వెలుగు చూసే అవకాశం

సాక్షి, మచిలీపట్నం: వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకుడు, మచిలీపట్నం మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మోకా భాస్కరరావు హత్య కేసు దర్యాప్తులో బందరు పోలీస్‌లు వేగం పెంచారు. ఇప్పటికే ఈ కేసులో ఓ మైనర్‌తో సహా ఎనిమిది మందిని అరెస్ట్‌ చేశారు. నిందితులిచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు ఈ హత్యలో కుట్రదారునిగా పేర్కొంటూ మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను తుని వద్ద అరెస్ట్‌ చేయడం సంచలనం రేపింది. కొల్లుతో సహా నిందితులందరినీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చగా 14 రోజుల పాటు రిమాండ్‌ విధించారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 6న మచిలీపట్నం సబ్‌ జైలు నుంచి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు. కాగా ఈ కేసు దర్యాప్తులో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

నేడు మచిలీపట్నం కోర్టుకు ఏ–1, ఏ–2 నిందితులు
ఇందుకోసం ఈ కేసులో ఏ–1గా ఉన్న చింతా నాంచారయ్య (చిన్న), ఏ–2గా ఉన్న చింతా నాంచారయ్య (పులి)లను మూడు రోజుల పోలీస్‌ కస్టడీ కోరుతూ జిల్లా కోర్టులో ఆర్‌ పేట పోలీసులు పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన కోర్టు పోలీసుల అభ్యర్థనపై సానుకూలంగా స్పందించింది. మూడు రోజుల కస్టడీ ఇచ్చేందుకు కోర్టు అంగీకరించడంతో రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న చింతా చిన్న, చింతా పులిలను శనివారం మచిలీçపట్నం తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం హత్య ఘటనలో చింతా నాంచారయ్య (పులి) పాల్గొనగా, హత్యానంతరం అతడిని తన బులెట్‌పై ఎక్కించుకుని చిన్న పరారైనట్లు వీడియో పుటేజ్‌ ఆధారంగా ప్రాథమిక విచారణలో పోలీసులు నిర్ధారణకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసులో కీలకమైన ఈ ఇరువుర్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశాలు లేకపోలేదని పోలీసులు భావిస్తున్నారు. కస్టడీకి తీసుకుంటున్న నిందితులిద్దర్ని రానున్న మూడు రోజులూ వివిధ కోణాల్లో విచారించనున్నారు.

లోతుగా విచారణ
మోకా హత్యకు ఎప్పటి నుంచి పథక రచన చేశారు? ఎన్నిసార్లు  భేటీ అయ్యారు? ఎక్కడ భేటీ అయ్యారు? ఆ భేటీలో మాజీ మంత్రి కొల్లు ఎన్నిసార్లు పాల్గొన్నారు. హత్య విషయంలో ఎలాంటి సూచనలు చేశారు. అనంతరం ఆయనకు ఏ విధంగా సమాచారం చేరవేశారు. ఇప్పటి వరకు అరెస్ట్‌ చేసిన వారితో పాటు ఇంకా ఎవరెవరు సహకరించారు. ఈ హత్య విషయంలో ఆర్థిక లావాదేవీలు ఏ మేరకు జరిగాయి. ఎంత చేతులు మారాయి? ఇలా వివిధ కోణాల్లో నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు లోతుగా విచారించనున్నారు. వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేయనున్నారు.

సయ్యద్‌ ఖాజాను విచారించిన పోలీసులు
ఇదిలా ఉండగా హత్యకు సరిగ్గా పదిహేను రోజుల క్రితం టీడీపీ కార్యాలయంలో నిందితుడు చిన్నాతో కలిసి ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న మాజీ కౌన్సిలర్‌ సయ్యద్‌ ఖాజాను కూడా శుక్రవారం ఆర్‌ పేట పోలీసులు విచారించారు. హత్య జరిగిన తర్వాత పరారీలో ఉన్న ఖాజా అరెస్ట్‌ల పర్వం పూర్తి కాగానే నగరానికి చేరుకున్నారు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకుని విచారించారు. ‘ఒళ్లు దగ్గర పెట్టుకోండి..పిచ్చిపిచ్చిగా మాట్లాడకండి..ఒక్కొక్కడికి తాట తీస్తాం. మోకా బాచీ (మోకా భాస్కరరావు)..!నీకు కరెక్ట్‌ మొగుడు మ్ఙాచింతా చిన్న యే..ఇక్కడే ఉన్నాడు కంగారు పడకు..నీ సంగతి చూస్తాడు..గుర్తించుకో’అంటూ ఆ ప్రెస్‌మీట్‌లో ఖాజా చేసిన వ్యాఖ్యల వెనుక కుట్ర కోణం దాగి ఉందని అనుమానంతో పోలీసులు ఖాజాను సుమారు ఐదు గంటల పాటు విచారించారు. తనకే పాపం తెలియదని, రాజకీయంగా విమర్శలు చేసేనే తప్ప ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు స్టేషన్‌కు రావాల్సి ఉంటుంది. నగరం విడిచి వెల్లేందుకు వీల్లేదని షరతు విధిస్తూ ఆయన్ని పంపారు.

3 రోజుల పోలీస్‌ కస్టడీకి  తీసుకుంటున్నాం
మోకా హత్య కేసులో కీలక నిందితులైన చిన్నా, పులిలను మూడు రోజుల పాటు పోలీస్‌ కస్టడీకి తీసుకుంటున్నాం. కోర్టు అనుమతితో శనివారం మచిలీపట్నం తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. వీరిని విచారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నాం.– ఎం.రవీంద్రనాథ్‌బాబు, జిల్లా ఎస్పీ

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top