పెళ్లైన మరుసటి రోజే ఓ ప్రేమజంట.. | Lovers Commits Suicide In Krishna | Sakshi
Sakshi News home page

పెళ్లైన మరుసటి రోజే ప్రేమజంట ఆత్మహత్య

Jun 23 2019 10:54 AM | Updated on Jun 23 2019 5:11 PM

Lovers Commits Suicide In Krishna - Sakshi

స్నేహం ప్రేమగా మారింది.. ఒకరికొకరం అనుకున్నారు.. కలిసి జీవిద్దామని కలలు కన్నారు..

సాక్షి, జంగారెడ్డిగూడెం (పశ్చిమ గోదావరి): చదువుకున్న రోజుల్లో ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది.. ఒకరికొకరం అనుకున్నారు.. కలిసి జీవిద్దామని కలలు కన్నారు.. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో కలిసి చనిపోదామని నిర్ణయించుకున్నారు.. ఒకరోజు ముందు దైవ సన్నిధిలో గడిపారు.. మరుసటి రోజు గుళికలు తిని మృత్యుఒడిలోకి చేరిపోయారు.. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపారు.. జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెంలో చోటుచేసుకున్న హృదయ విదారక ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి..

జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెంలోని  వైట్‌హౌస్‌ అనే లాడ్జీలో ప్రేమజంట గుళికలు తిని శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో నాగంపల్లి శేఖర్‌ (20) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా తెల్లం పోసమ్మ అనే యువతి జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. బుట్టాయగూడెం మండలం నూతిరామన్నపాలెంకు చెందిన నాగంపల్లి శేఖర్‌ (20), పోలవరం మండలం సరిపల్లికుంటకు చెందిన తెల్లం పోసమ్మ కొనేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 2017లో కొయ్యలగూడెం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో శేఖర్, పోసమ్మ ఇంటర్‌ చదువుతున్న రోజుల్లో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అప్పటినుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు.

ఈనేపథ్యంలో శుక్రవారం శేఖర్, పోసమ్మ జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి క్షేత్రాన్ని దర్శించుకున్నారు. వీరిద్దరూ మద్దిక్షేత్రంలో దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో పెట్టడంతో వీటి ఆధారంగా వీరు వివాహం చేసుకున్నట్టు తెలుస్తోంది. మద్దిక్షేత్రంలో గడిపిన వీరిద్దరూ గుర్వాయిగూడెంలోని వైట్‌హౌస్‌ అనే లాడ్జీలో గది అద్దెకు తీసుకున్నారు. శనివారం ఉదయం పోసమ్మ వాంతులు చేసుకోవడాన్ని లాడ్జీలో పనిచేసే వాళ్లు, స్థానికులు గమనించారు. అప్పటికే గదిలో ఉన్న శేఖర్‌ గుళికలు తిని మృతిచెందాడు.

అపస్మారక స్థితిలో ఉన్న పోసమ్మను స్థానికులు జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. గతంలో కొయ్యలగూడెం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన మిస్సింగ్‌ కేసుకు సంబంధించి శేఖర్‌పై కేసు నమోదైంది. లక్కవరం ఎస్సై పరిమి రమేష్‌ కేసు దర్యాప్తు చేశారు. వీరిద్దరి వివాహానికి పెద్దల అంగీకారం లేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు ఎస్సై చెప్పారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement