లారీ దొంగలూన్నారు జాగ్రతా..!

Lorry Theft  Gang Arrested Khammam - Sakshi

పాల్వంచ: లారీ ఓనర్‌లు, డ్రైవర్‌లు మీ లారీలను జర జాగ్రత్తగా చూసుకోండి.. ఆదమరచి ఉంటే అంతే సంగతులు.. పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచలో లారీ దొంగలు సంచరిస్తున్నారు.. పార్కింగ్‌ చేసి ఉంచిన లారీలను, డీజిల్‌ను చోరీ చేసేందుకు కొన్ని రోజులుగా విఫలయత్నం చేస్తున్నారు. వారం రోజుల్లో మూడు చోట్ల లారీలను చోరీ చేసేందుకు ప్రయత్నించడం ఇందుకు బలం చేకూరుస్తుంది.  కేటీపీఎస్, నవభారత్‌ కర్మాగారాలు ఉన్న నేపథ్యంలో లారీల ద్వారా ముడిసరుకు తోలకాలు, యాష్‌ ట్యాంకర్లు నిత్యం తిరుగుతుంటాయి. ఇవి ఇక్కడికి వచ్చిన తర్వాత గంటల కొద్ది వెయిటింగ్‌లో ఉంటాయి. ఈ క్రమంలో లారీ డ్రైవర్లు లారీలను వదిలి బయటకు వెళుతుంటారు.

డ్యూటీలు దిగి మళ్లీ వస్తుంటారు. కొన్ని సమయాల్లో ఆదమరిచి నిద్రిస్తుంటారు. వారి సీరియల్‌ వచ్చేసరికి లారీల వద్దకు చేరుకుంటుంటారు. ఇదే అదును చేసుకుని కొందరు లారీలను చోరీ చేసేందుకు యత్నిస్తున్నారు. అంతేగాక లారీలకు చెందిన బ్యాటరీలు, డీజిల్‌ దొంగతనాలకు పాల్పడుతున్న సంఘటనలు నిత్యకృత్యంగా మారాయి. ఈ తరహా దొంగతనాల పట్ల లారీ యజమానులు కలవరం చెందుతున్నారు. గతంలో ఎక్కడో ఆంధ్ర ప్రాంతం నెల్లూరు కేంద్రంగా దొంగతనాలు జరిగేవని, ఇప్పుడు లారీలను ఎక్కడ నిలిపి వెళ్లాలన్నా భయ మేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల్లో వరస సంఘటనలు జరగడంతో పోలీసులు సైతం అవాక్కవుతున్నారు. వీటిపై నిఘాను తీవ్ర తరం చేశారు.

 ఈనెల 15వ తేదీన నవభారత్‌ గేటు వద్ద లోడ్‌ కోసం టిప్పర్‌ను ఉంచారు. సీరియల్‌ వచ్చేసరికి లేటవుతుందని డ్రైవర్‌ డ్యూటీ దిగిపోయాడు. లారీ ఇంజన్‌ తాళాలు వేయకుండా బయటి డోర్‌ తాళాలు మాత్రమే వేసి వెళ్లినట్లు సమాచారం. లారీ కనిపించక పోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుర్తు తెలియని వ్యక్తులు లక్ష్మీదేవిపల్లి పరిధిలోని బొమ్మనపల్లి సమీపంలో సుమారు 25 కిలోమీటర్లు తీసుకెళ్లి రోడ్డు పక్కన పెట్టి పరారయ్యారు. లారీలోని డీజిల్, జాకీలు, జాకీ రాడ్లు, బ్యాటరీలు చోరీ చేశారు. టైర్లు తీసేసేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. లారీ దొరకడంతో యజమాని, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

 16వ తేదీ మార్కెట్‌ ఏరియాలో కూరగాయల లోడ్‌ కోసం వచ్చిన లారీలో ఉన్న డీజిల్‌ను దొంగలు చోరీ చేశారు. లారీ స్టార్ట్‌ చేసేందుకు ప్రయత్నించినట్లు స్థానికులు తెలిపారు. 
 ఈనెల 18వ తేదీన కేటీపీఎస్‌ ఓఅండ్‌ఎం కర్మాగారం వద్ద యాష్‌(బూడిద) కోసం పాల్వంచకు చెందిన ఎం.శ్రీనివాసరెడ్డి  ట్యాంకర్‌ (లారీ) తీసుకెళ్లి అక్కడ వెయిటింగ్‌లో ఉంచాడు. రాత్రి 9.30 గంటల సమయంలో ఎవరూ లేనిది గమనించి ఓ దొంగ లారీని స్టార్ట్‌ చేసి బయటకు తీసుకొచ్చాడు. అంతలో గుర్తించి లారీ డ్రైవర్లు వెంట పడ్డారు. ఇది గమనించిన దొంగ లారీని రన్నింగ్‌లోనే ఉంచి దూకి పరారయ్యాడు.   అల్లూరిసెంటర్‌ వద్ద ఓ కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టి లారీ ఆగింది. సీసీ కెమెరాల్లో పరిశీలించగా వ్యక్తి ముఖం సరిగా కనిపించక పోవడం గమనార్హం.

 ఇటీవల మల్లయ్య అనే వ్యక్తి టిప్పర్‌ కొనుగోలు చేశాడు. బీసీఎం రోడ్‌లో బజాజ్‌ షోరూం పక్కన ఉన్న లారీ మెకానిక్‌ షెడ్‌లో ఉంచగా టిప్పర్‌ బ్యాటరీలు, ఇతర వస్తువులు చోరీకి గురయ్యాయి. ఇప్పటికైనా పోలీసులు ఈ వరుస ఘటనలపై దృష్టి సారించాలని పలువురు లారీ డ్రైవర్లు కోరుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top