మత్తులో కల్తీ చిచ్చు!

Liquor Adulterated In Prakasam - Sakshi

నకిలీ మద్యంతో అక్రమార్జన

ఎక్కువ రేటు మద్యం సీసాలో తక్కువ రేటు మద్యం మిక్సింగ్‌

మద్యం మత్తుకు రెండు నెలల్లో ఇద్దరు మృతి

మాముళ్ల మత్తులో స్థానిక ఎక్సైజ్‌ అధికారులు

టాస్క్‌ఫోర్స్‌ దాడులతో కనిగిరిలో గుట్టు రట్టు

కనిగిరి: కల్తీ మద్యం మందుబాబుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. దీనికి కనిగిరి వేదికగా మారింది. ఇటీవల జరిగిన వరుస మరణాలు.. మంగళవారం టాస్క్‌ ఫోర్స్‌ దాడుల్లో దొరికిన కల్తీ మద్యం బాటిళ్లతో అక్రమార్కుల గుట్టు రట్టయింది. కనిగిరిలో నకిలీ మద్యంపై గత కొంతకాలంగా పుకార్లు హోరెత్తుతున్నాయి. దీనిపై స్థానిక ఎక్సైజ్‌ అధికారులను పలుమార్లు ప్రశ్నిస్తే అలాంటిదేమీ లేదని కల్తీ జరిగే ప్రసక్తే లేదంటూ బుకాయించారు. ఈ నేపథ్యంలో కనిగిరిలో మద్యం వ్యాపారుల అక్రమాలపై స్టేట్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ అధికారులకు పక్కా సమాచారం అందింది. ఎక్సైజ్‌ శాఖ స్టేట్‌ డైరక్టర్‌ కె. వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు విజయవాడ ఎక్సైజ్‌ ఎస్సై సుబ్బిరెడ్డి, రామకృష్ణ టీం కనిగిరిలో దాడులు నిర్వహించి రెండు షాపుల్లో 175 క్వార్టర్‌ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

ఏకకాలంలో దాడులు..
పక్కా సమాచారంతో విజయవాడ ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ టీం సభ్యులు కనిగిరిలో మకాం వేశారు. మండంలోని అడ్డరోడ్డు వద్దగల నందిని వైన్స్, హాజీస్‌ పురం వద్ద గల కళ్యాణి వైన్స్‌పై ఏకకాలంలో మంగళవారం రాత్రి దాడులు నిర్వహించారు. నందిని వైన్స్‌లో విక్రయదారుడు రమణారెడ్డి అప్పుడే బ్రాండ్‌ మిక్సింగ్‌ (కల్తీ)చేసి అమ్మకానికి ఉంచిన 144 క్వార్టర్‌ బాటిళ్లను పట్టుకొని అదుపులోకి తీసుకుని విచారించారు. అదే సమయంలో హజీస్‌పురం కల్యాణి వైన్స్‌లో దాడులు చేయగా నౌకర్‌ నామ శివరాములు షాపులో కల్తీ మద్యం బాటిళ్లు విక్రయిస్తుండటంతో టాస్క్‌ ఫోర్స్‌ టీం దాడులు చేసి పట్టుకున్నారు. ఇతని వద్ద నుంచి 32 క్వార్టర్‌ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.

మిక్సింగ్‌ ఇలా..
ఆఫీసర్‌ ఛాయిస్‌ బ్రాండ్‌ రూ. 100 కాగా, హెచ్‌డీ బ్రాండ్‌ రూ. 50 వరకు ఉంటుంది. అయితే అక్రమార్జనే ధ్యేయంగా మద్యం వ్యాపారులు బ్రాండ్‌ మిక్సింగ్‌కు పాల్పడుతున్నారు. ఖాళీ ఓసీ (ఆఫీసర్‌ ఛాయిస్‌) మద్యం బాటిళ్లలో హెచ్‌డీ మద్యం నింపుతారు. అంటే రూ. 50 ఖరీదైన మద్యం సీసాకు అక్రమంగా రూ. 100 వసూలు చేస్తున్నారు. మద్యం ప్రియులకు అనుమానం రాకుండా హెచ్‌డీ బాటిళ్లపై ఉండే హెచ్‌ఈఎల్‌సీల్‌ను అతికిస్తారు. దీంతో మద్యం మిక్సింగ్‌ జరిగిన బాటిల్‌గా ఎవరూ గుర్తించలేరు.  బాటిల్‌ అంతా ఓసీగా ఉంటుంది. మూతలపై మాత్రం హెచ్‌డీ బ్రాండ్‌కు సంబంధించిన సీల్‌ ఉంటుంది. కేవలం ఎక్సైజ్‌ శాఖ వారి అధునాత పరికరాలతో ప్రత్యేక యాప్‌ కోడ్‌తో మాత్రే వాటిని గుర్తించడానికే వీలయ్యే పరిస్థితి నెలకొనడంతో అక్రమార్కులు రెచ్చిపొతున్నారు.

ఆ ముగ్గురు?
కల్తీ మద్యం వ్యాపారంలో ముగ్గురు వ్యాపారులు ప్రధాన పాత్రధారులుగా ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా కల్తీ మద్యం పట్టుబడిన షాపుల్లోని నిందులను పోలీసులు విచారించగా చెందిన ఓ యువ మద్యం వ్యాపారి పేరును వెల్లడించినట్లు తెలిసింది. తమ పాత్ర ఏమీ లేదని యువ వ్యాపారి ఆధ్వర్యంలో తంతు జరిగిన తర్వాతే తాము అమ్మకాలు జరుపుతున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ టీం విచారణలో వారు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. యువ వ్యాపారి భాగస్వామ్యంతో ఉన్న వైన్‌ షాపుల టాస్క్‌ ఫోర్స్‌ టీం ప్రత్యేక దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది.

10 వేల కేసుల్లో 5వేల కేసులు హెడీనే..
కనిగిరి ఎక్సైజ్‌ పరిధిలో 28 షాపుల్లో నెలకు 10వేల కేసులు (సుమారు రూ. 4కోట్లు) మేర వివిధ రకాల బ్రాండ్‌లు ( ఓసీ, ఐవీ, తదితరాలు) కొనుగోలు జరుగుతుంటే.. ఒక్క హెడీ బ్రాండే సుమారు 5వేల కేసులు అంటే సుమారు రూ. 1.50 కోట్ల కొనుగోలు జరుగుతున్నట్లు నివేదికలున్నాయి. అధికారులు మాత్రం తక్కువ రేటు మద్యం కాబట్టి లేబర్‌ ఎక్కువగా హెచ్‌డీ బ్రాండ్‌ను తాగుతున్నట్లు వెల్లడిస్తున్నా... అసలు తతంగం ఇదని తాజా దాడుల్లో బహిర్గతమైంది.

రెండు నెలల్లో ఇద్దరు మృతి
మద్యం మత్తులో గడిచిన రెండు నెలల్లో సుమారు 6 మంది వరకు చనిపోగా అందులో వెలుగులోకి వచ్చింది ఇద్దరి మరణాలే.  గత నెలలో లాడేసాహెబ్‌ వీధికి చెందిన బాష(40) పూటుగా మద్యం తాగి షాపు సమీపంలోనే  చనిపోయాడు. తాజాగా కోటి కూడా మద్యం మత్తులో అపస్మారక స్థితికి చేరి షాపు సమీపంలోనే చనిపోవడంతో బంధువులు ఆందోళన చేశారు. మద్యం మరణాల వెనుక కల్తీ విక్రయాలే కారణం అన్న ప్రచారం జరుగుతోంది. గత రెండేళ్లలో కనిగిరిలో మాత్రమే ఇలాంటి కేసులు దొరికాయని  చెబుతున్నారు. జిల్లా స్థాయి ఎక్సైజ్‌ అధికారులు కనిగిరి పై ప్రత్యేక నిఘా పెట్టి విస్తృత దాడులు నిర్వహిస్తే మరిన్ని కల్తీ విక్రయాల కేసులు దొరికే అవకాశం లేక పోలేదు.

మద్యం వ్యాపారుల అరెస్ట్‌
కనిగిరి:  పట్టణంలోని రెండు మద్యషాపుల్లో కల్తీ చేసిన (బ్రాండ్‌ మిక్సింగ్‌)175 క్వార్టర్‌ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు విజయవాడ టాస్క్‌ ఫోర్స్‌ టీం అధికారులు పి. సుబిరెడ్డి, రామకృష్ణ తెలిపారు. కనిగిరి ఎక్సైజ్‌ సీఐతో కలిసి బుధవారం విలేకర్లతో మాట్లాడారు. మండలంలోని అడ్డరోడ్డులో గల నందిని వైన్స్‌లో సుమారు 144 మద్యం క్వార్టర్‌ ఓసీ బాటిళ్లు, హజీస్‌పురంలోని కల్యాణి వైన్స్‌లో 32 మద్యం క్వార్టర్‌ ఓసీ బాటిళ్లు స్వాధినం చేసుకున్నట్లు వెల్లడించారు. రూ. 50 విలువ చేసే మద్యం హెచ్‌డీ బ్రాండ్‌ క్వార్టర్‌ బాటిళ్లను ఊడదీసి.. అదే లిక్కర్‌ను రూ. 100 విలువ చేసే ఓసీ బ్రాండ్‌లోకి మార్చి మూతలకు హెచ్‌డీ బ్రాండ్‌ సీల్స్‌ అతికించి అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు. షాపులైసెన్స్‌పై కొనగోలు చేసిన ఓసీ క్వార్టర్‌ బాటిళ్ల సంఖ్య కంటే నిల్వలు అధికంగా ఉన్నాయన్నారు,  బ్రాండ్‌ మిక్సింగ్‌ చేసి ఓసీ ఖాళీ బాటిళ్లలో హెచ్‌డీ బ్రాండ్‌ లిక్కర్‌ను నింపారని తెలిపారు. షాపుల్లో ఖాళీ ఓసీ, హెచ్‌డీ క్వార్టర్‌ ఖాళీ బాటిళ్లు, కుయ్యనులు, బాటిల్‌ మూతలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రెండు షాపుల్లో కల్తీ విక్రయాలకు కారకులైన ఆరు మందిపై సెక్షన్‌ 34ఏ, 36, 37, బ్రాండ్‌ మిక్సింగ్‌కేసులు నమోదైనట్లు తెలిపారు. ప్రస్తుతం రమణారెడ్డి, శివరాములును అరెస్ట్‌ చేశామని, లైసెన్స్‌ దారులు, నౌకర్‌ నామాలు వై . మాలకొండారెడ్డి, సుధాకర్‌రెడ్డి, వెంకటరెడ్డి, రామయ్యలను త్వరలో అదుపులోకి తీసుకుంటామన్నారు. ఆ రెండు షాపులు సీజ్‌ చేయనున్నట్లు తెలిపారు. మార్కాపురం ఈఎస్‌ రావిపాటి హనుమంతరావు, ఏఈఎస్‌ చంద్రశేఖరరెడ్డి, సీఐ వెంకట్రావ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top