మరణించే వరకూ జైలే | Lifer for three in sensational Naga Vaishnavi Murder case | Sakshi
Sakshi News home page

మరణించే వరకూ జైలే

Jun 15 2018 2:43 AM | Updated on Jun 15 2018 7:42 AM

Lifer for three in sensational Naga Vaishnavi Murder case - Sakshi

జీవితఖైదు పడిన ఏ1, ఏ2, ఏ3 నిందితులు మోర్ల శ్రీనివాసరావు, యంపరాల జగదీశ్, పంది వెంకటరావు, నాగవైష్ణవి(ఫైల్‌)

విజయవాడ లీగల్‌: ఎనిమిదిన్నరేళ్ల క్రితం రాష్ట్రంలో సంచలనం కలిగించిన చిన్నారి పలగాని నాగవైష్ణవి (10) కిడ్నాప్, హత్య కేసులో ముగ్గురు నిందితులకు విజయవాడ సెషన్స్‌ న్యాయస్థానం జీవిత కాల (మరణించే వరకు) జైలు శిక్ష విధించింది. ఈ కేసులో మోర్ల శ్రీనివాసరావు, యంపరాల జగదీష్, పంది వెంకట్రావు అలియాస్‌ కృష్ణను కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఐపీసీ సెక్షన్లు 302, 364, 307, 201, 392, 120బి రెడ్‌ విత్‌ 34 ప్రకారం వీరికి బతికి ఉన్నంతకాలం జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి ఎం.బబిత గురువారం తీర్పు వెలువరించారు. దీనికి తోడు శ్రీనివాసరావు, యంపరాల జగదీష్‌లకు రూ.4,500 చొప్పున, పంది వెంకట్రావుకు రూ.4వేలు జరిమానా కూడా విధించారు.  

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలన కేసు: నాగవైష్ణవి, కారు డ్రైవర్‌ లక్ష్మణరావు హత్య ఎనిమిదిన్నరేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం కలిగించింది. విజయవాడకు చెందిన పలగాని ప్రభాకర్‌రావు మొదటి భార్య పలగాని వెంకటేశ్వరమ్మ, రెండో భార్య నర్మదాదేవి మధ్య విభేదాలు ఉండేవి. ఆయన తన రెండో భార్య నర్మదాదేవి, ఆమె కుమార్తె అయిన నాగవైష్ణవి పేరుతో రూ.కోట్ల ఆస్తులు కొనుగోలు చేయడంతో మొదటి భార్య వెంకటేశ్వరమ్మ విభేదించారు. తన అక్కకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని వెంకటేశ్వరమ్మ సోదరుడు పంది వెంకట్రావు బావ పలగాని ప్రభాకరరావుపై కక్ష పెంచుకున్నారు. ఆయన కుమార్తె నాగవైష్ణవిని హత్య చేసి కక్ష తీర్చుకోవాలని మోర్ల శ్రీనివాసరావు, యంపరాల జగదీష్‌లతో రూ.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. నాగవైష్ణవి(10ఏళ్లు), ఆమె సోదరుడు సాయి తేజేష్‌ గౌడ్‌లను వారి కుటుంబ డ్రైవర్‌ లక్ష్మణరావు 2010 జనవరి 30న ఉదయం 8 గంటలకు విజయవాడ న్యూ అయోధ్యనగర్‌లోని స్వగృహం నుంచి కారు (ఏపీ 03ఆర్‌ 2223)లో పాఠశాలకు తీసుకెళుతుండగా సత్యనారాయణపురం రైల్వే కాలనీ సమీపంలో మోర్ల శ్రీనివాసరావు రాయి విసిరి కారు అద్దం పగలగొట్టాడు. డ్రైవర్‌ లక్ష్మణరావు దిగి చూస్తుండగా మోర్ల శ్రీనివాసరావు, జగదీష్‌ కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఇది గమనించిన నాగవైష్ణవి సోదరుడు సాయితేజేష్‌గౌడ్‌ కారు నుంచి దూకి పారిపోయాడు. నాగవైష్ణవిని శ్రీనివాసరావు, జగదీష్‌ కిడ్నాప్‌ చేశారు.

నాగవైష్ణవిని తీసుకుని కారులో సీతానగరం చేరుకున్నారు. కారులోనే గొంతునులిమి హత్య చేశారు. మృతదేహాన్ని గుంటూరులోని ఆటోనగర్‌లోగల మసీదు రోడ్డులో ఉన్న మోర్ల శ్రీనివాసరావుకు చెందిన శారద ఇండస్ట్రీస్‌ (ఎం/ఎస్‌ ఏఎస్‌ ఆటో లింక్స్‌)కు తరలించారు. రాత్రి 11 గంటలకు ఎలక్ట్రికల్‌ బ్రాయిలర్‌లో వేసి కాల్చేశారు. ఆ మర్నాడు ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాచ్‌మెన్‌ బూడిదగా మారిని నాగవైష్ణవి మృతదేహాన్ని చూసి కంగారుతో పారిపోయాడు. అప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కారు డ్రైవర్‌ లక్ష్మణరావు హత్య, నాగవైష్ణవి కిడ్నాప్‌ కలకలం రేపింది. తన కుమార్తె నాగవైష్ణవి మరణించిందన్న వార్త విన్న తండ్రి పలగాని ప్రభాకర్‌రావు గుండెపోటుతో మృతి చెందాడు. బాలిక చెవికి ఉన్న డైమండ్‌ రింగ్‌ను పోలీసులు తమ దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాలతో గుర్తించారు. కేసు విచారించిన సత్యనారాయణపురం పోలీసులు పంది వెంకట్రావ్‌ అలియాస్‌ కృష్ణ, మోర్ల శ్రీనివాసరావు, యంపరాల జగదీష్, పంది వెంకట్రావులపై ఐపీసీసెక్షన్లు 302, 307, 364, 201, 427, 379, 120బీ, రెడ్‌విత్‌ 34, ప్రకారం  చార్జిషీటు దాఖలు చేశారు. 8 ఏళ్ల విచారణ అనంతరం న్యాయస్థానం వారు ముగ్గురిని దోషులుగా నిర్ధారిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసు తీర్పు వెలువరించిన నేపధ్యంలో పోలీసులు కోర్టు ప్రాంగణంలో మోహరించారు. చిన్నారి నాగవైష్ణవి కేసు ఎనిమిది సంవత్సరాలు పైబడి విచారణ జరిగినప్పటికీ న్యాయం జరిగిందని ఈ కేసులో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎస్‌.బ్రహ్మానందరెడ్డి అన్నారు.  

గుండెలను పిండి చేసిన విషాదం 
నాగవైష్ణవి హత్య, తదనంతర పరిణామాలు ఆద్యంతం గుండెలు పిండే విషాదామే. ఈ ఉదంతంలో నలుగురు తల్లడిల్లి చనిపోయారు. తన ఉపాధి చూపిన యజమాని పిల్లలను కాపాడేందుకు యత్నించిన కారుడ్రైవర్‌ లక్ష్మణరావు దారుణ హత్యకు గురయ్యాడు. అల్లారుముద్దుగా చూసుకున్న తన కుమార్తెను దారుణంగా చంపారన్న విషయం తెలియడంతోనే పలగాని ప్రభాకర్‌ కుప్పకూలిపోయారు. తీవ్ర గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి చెందారు. ఇక వైష్ణవి తల్లి నర్మదాదేవి పడిన కష్టం గుండెలు పిండేస్తుంది. కన్నకూతుర్ని, కట్టుకున్న భర్తను కోల్పోయి న్యాయం కోసం పోలీసు అధికారులు, కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగి, తిరిగి విసిగి తీవ్ర నిరాశకు గురైంది. ఈ కేసులో తీర్పు ఎంతకూ రాకపోవటతో రెండేళ్ల కిందట మనోవ్యధతో అనారోగ్యానికి గురై చనిపోయారు. కోర్టులో న్యాయం కోసం ఎదురుచూస్తూ ఎనిమిది నెలల కిందట ప్రభాకర్‌ సోదరుడు వైష్ణవి బాబాయి పలగాని సుధాకర్‌ కూడా ఇదే వ్యధతో చనిపోయారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement