కార్మిక శాఖలో వసూల్‌ రాజా

Labour Officer Caught On Video Accepting Bribe In Suryapet District - Sakshi

కాసులిస్తేనే పని..!

ఫైలు కదలాలంటే చేయి తడపాల్సిందే

లంచం తీసుకుంటుండగా రికార్డ్‌ చేసిన వీడియో హల్‌చల్‌

సాక్షి, దురాజ్‌పల్లి (సూర్యాపేట): లంచం అడిగితే అధికారిని నిలదీయండి అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పదే పదే చెప్తున్నా అధికారుల తీరు మారడం లేదు. లంచం మహమ్మారి ఏదో ఒకే శాఖకు పరిమితం కాకుండా అన్నీ శాఖలకు అంటుకుంది. జిల్లా కార్మిక శాఖలో పైసలిస్తేనే ఫైలు కదులుతుందని గతంలో వెల్లువెత్తిన ఆరోపణలు నేడు నిజమని తేలింది. కార్మికశాఖ డివిజన్‌ అధికారి ఓ మహిళ నుంచి రూ.500 లంచంగా తీసుకుని ఇవేం సరిపోతాయని అడుగుతున్న వీడియో సామాజిక మాద్యమాల్లో ప్రస్తుతం హల్‌చల్‌ చేస్తోంది.

కార్మిక శాఖలో సభ్యత్వం తీసుకుంటే..
18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండి భవన నిర్మాణ రంగం లేదా ఇతర రంగాల్లో కార్మికులుగా పనిచేస్తూ రూ.110 బ్యాంకుల్లో చెల్లించి కార్మిక శాఖలో సభ్యత్వ నమోదు చేసుకున్న కార్మికుడికి ప్రమాదం, డెలివరీ, వివాహ కానుకలకు ప్రభుత్వం ఆర్థికసాయం అందించే పథకం అమలులో ఉంది. కార్మిక శాఖలో నమోదైన కార్మికుడు ప్రమాదంలో మరణిస్తే రూ.6లక్షలు, శాశ్వత అంగవైకల్యానికి రూ.5లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి రూ.4లక్షలు ఆర్థిక సహాయం అందనుంది. అదే విధంగా మహిళా కార్మికురాలు లేదా కార్మికుడికి కుమార్తెల వివాహాలకు వివాహ కానుకగా రూ.60వేలు ప్రసూతి సహాయంగా రూ.30వేల చొప్పున రెండు కాన్పులకు అందనున్నాయి.

డబ్బులివ్వకుంటే కదలని ఫైలు !
జిల్లా కార్మికశాఖలో పైసలేనిదే ఫైలు కదలడం లేదని బహిరంగంగానే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా పెన్‌పహాడ్‌ మండల మహ్మదాపురం గ్రామానికి చెందిన ఒక మహిళ నుంచి కార్మిక శాఖ డివిజన్‌ అధికారి లంచం తీసుకున్నట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. కార్మిక శాఖలో సభ్యత్వం కలిగి ఉన్న  తన భర్త ఇటీవల మరణించాడని ప్రభుత్వం నుంచి అందే ఆర్థికసాయాన్ని ఇప్పించాలని దరఖాస్తు చేసుకోగా విచారణకు వెళ్లిన అధికారి కార్యాలయంలో తనను సంప్రదించాలని తెలిపినట్లు సమాచారం.

కార్యాలయానికి వచ్చిన ఆమె నుంచి ఆన్‌లైన్‌ పేరుతో డబ్బులు ఇవ్వాలని అధికారి స్వయంగా అడిగినట్లు వీడియోలో తెలుస్తోంది. ఆమె రూ.500 ఇచ్చి నేను పేదరాలినని ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేనని అధికారి వద్ద మొరపెట్టుకుంది. ఇవేం సరిపోతాయని అధికారి స్వయంగా అన్నట్లు వీడియోలో తెలుస్తోంది. ఈ విషయంపై సదరు గ్రామానికి చెందిన ఎంపీటీసీ అధికారి లంచం తీసుకుంటున్న వీడియోను జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌కు  సైతం పంపినట్లు సమాచారం. కార్మికశాఖ అధికారి లంచాలకు కక్కుర్తి పడి గ్రామాల్లోకి వెళ్లి పరిశీలన పేరుతో లబ్ధిదారులను వేధిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. 

ఎవరి నుంచి లంచం తీసుకోలేదు
లేబర్‌ కార్డు ఉన్న లబ్ధిదారుల్లో ఎవరి నుంచి నేను లంచం తీసుకోలేదు. ప్రభుత్వం మార్చిన నిబంధనల మేరకు లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచవలసి ఉన్నందున ఆన్‌లైన్‌ ఖర్చుల నిమిత్తం మాత్రమే డబ్బులు తీసుకున్నాను. కావాలనే కొందరు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. 
– వాల్యానాయక్, కార్మికశాఖ డివిజన్‌ అధికారి

ఉన్నతాధికారులకు నివేదించాం 
కార్మిక శాఖ డివిజన్‌ అధికారిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్‌ నల్లగొండ, జాయింట్‌ కమిషనర్‌ హైదరాబాద్‌ వారికి చర్యల నిమిత్తం నివేదికలు అందించాం. విచారించి ఆరోపణలు రుజువైతే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 
– శివశంకర్, సహాయ కమిషనర్‌, సూర్యాపేట 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top