సూర్యాపేట జిల్లా: తొమ్మిది పదుల వయస్సు దాటినా నవ యువకుడిలా జీవనం సాగిస్తున్నాడు ఆ వృద్ధుడు. అరవై ఏళ్లు దాటితేనే కాళ్ల నొప్పులతో బాధపడుతూ అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి కొందరిది. అలాంటిది 91 ఏళ్ల వయస్సులోనూ స్వతహాగా తన పనులు తాను చేసుకుంటూనే సైకిల్ తొక్కుతూ వీధివీధి తిరుగుతూ కూరగాయలు అమ్ముతూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు తేజావత్ గనియా. చిలుకూరు మండలం సీత్లాతండాకు చెందిన తేజావత్ గనియాకు ఏడుగురు సంతానం (నలుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు). తనకున్న రెండెకరాల భూమిలో వరితోపాటు కూరగాయలు, ఆకుకూరలు సాగుచేస్తూ వాటిని అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాడు. ఈయన పిల్లలందరూ వివిధ ఉద్యోగాల్లో సిర్థరపడగా ఇందులో ఒకరైన బావసింగ్ ఇటీవలే హెచ్‌ఎంగా రిటైర్ అయ్యారు.
రోజూ 20 కిలోమీటర్లు సైకిల్‌పై తిరుగుతూ..
90 ఏళ్ల వయస్సు దాటినా, పిల్లలు ప్రయోజకులైనా గనియా మాత్రం నేటికీ కూరగాయలు అమ్మే వృత్తిని మాత్రం వదులుకోలేదు. ప్రతిరోజూ ఉదయం 5 గంటల కల్లా లేవడం సుమారుగా 20 కిలోమీటర్ల మేర సైకిల్‌పై తిరుగుతూ కూరగాయలు అమ్ముతున్నాడు. తన పొలంలో కూరగాయలు పండని సమయంలో కోదాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూరగాయలను కొనితెచ్చి గ్రామాల్లో తిరుగుతూ అమ్మడం ఆయన దినచర్య. నేటికీ బీపీ, ఘగర్ లాంటివి లేకుండా వృద్ధాప్యంలోనూ ఒకరిపై ఆధారపడకుండా తన భార్యతో కలిసి జీవిస్తూ చేతనైనా పనిచేసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు గనియా. ఇటీవల అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా సూర్యాపేట కలెక్టరేట్‌లో గనియాను జిల్లా కలెక్టర్ ఘనంగా సన్మానించారు.
పనిచేయడం వల్లే ఆరోగ్యంగా ఉన్నా
నిత్యం నా పనులు నేను చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉన్నాను. ఇప్పటి వరకు బీపీ, షుగర్ లాంటివి లేవు. రోజూ సైకిల్ తొక్కుతున్నా ఎలాంటి కాళ్ల నొప్పులు లేవు. ఎన్నో ఏళ్ల నుంచి సైకిల్‌పైనే కూరగాయలు అమ్మతున్నాను. ఇప్పటికీ ఆ వృత్తిని వదులుకోలేకపోతున్నా.
– తేజావత్ గనియా, సీత్లాతండా, చిలుకూరు మండలం


