
హత్యకు గురైన అనిల్ (ఫైల్), నిందితుడు శివబసవేగౌడ
రామనగర (దొడ్డబళ్లాపురం): డిసెంబరు 4న బెంగళూరు దక్షిణ తాలూకా ఉత్తరి గ్రామ శివారులోని శ్మశానంలో హత్యకు గురైన బెంగళూరు బనశంకరి మహీంద్రా కోటక్ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ అనిల్ కేసులో కగ్గలిపుర పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కనకపుర తాలూకా కచువనహళ్లికి చెందిన శివబసవేగౌడ (26)హత్య కేసులో పట్టుబడ్డ నిందితుడు. బెంగళూరు బనశంకరిలోని మహీంద్రా కోటక్ బ్యాంక్‌లో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్న అనిల్ (26 )కగ్గలీపురకు చెందినవాడు. ఇదే నెల 3న అనిల్ కనబడకుండా పోవడంతో కుటుంబ సభ్యులు బనశంకరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 4న కగ్గలీపుర వద్ద అనిల్ శవమై కనిపించాడు. కగ్గలీపుర పోలీసులు అనిల్ కాల్‌లిస్ట్ ఆధారంగా శివబసవేగౌడను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేపట్టగా పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి. అనిల్‌తో వివాహం నిశ్చయమైన యువతిని నిందితుడు శివబసవేగౌడ ప్రేమిస్తున్నాడు.
వివాహాన్ని ఎలాగయినా ఆపాలని నిందితుడు అనిల్‌ను హత్య చేయడానికి పథకం వేశాడు. యువతి వద్ద అనిల్ మొబైల్ నెంబరు తీసుకుని అనిల్‌తో స్నేహం పెంచుకున్నాడు. డిసెంబరు 3న అనిల్ కగ్గలీపురకు వెళ్తున్నాడని యువతి ద్వారా తెలుసుకున్న నిందితుడు అనిల్‌కు ఫోన్ చేసి సాయంత్రం ఒక చోట భోజనం చేద్దామని పిలిచాడు. శివబసవేగౌడ ఆహ్వానం మేరకు అనిల్ వెళ్లాడు. ఒక రెస్టారెంట్‌లో భోజనం చేసిన ఇద్దరూ రాత్రి తిరిగి ఇళ్లకు బైక్‌పై బయలుదేరారు. మార్గం మధ్యలో మూత్ర విసర్జకు నిలిపాడు శివబసవేగౌడ. ఇదే సమయంలో అనిల్ కూడా మూత్ర విసర్జన చేస్తుండగా పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు వెంట తెచ్చుకున్న వైర్‌తో కనెక్షన్ తీసుకుని అనిల్‌కు కరెంట్ షాకిచ్చి హత్య చేశాడు. ఈ విషయంలో నిందితుడు పక్కాగా స్కెచ్ వేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. చివరగా కరెంట్ షాకిచ్చి చంపాలని నిర్ణయించుకున్నాక చాలాసార్లు ట్రాన్స్‌ఫార్మర్‌కు వైర్ ఎలా కనెక్ట్ చేయాలి అని రిహార్సల్స్ వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అన్నీ కరెక్టుగా ఆచరించిన శివబసవేగౌడ మొబైల్ కాల్ లిస్ట్‌లో దొరికిపోయాడు.