విజయవాడలో కిడ్నాప్‌.. దాడి

Kidnap attack in Vijayawada

డబ్బు వ్యవహారమే కారణం

ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు  

విజయవాడ: డబ్బు కోసం ఇద్దరు వ్యక్తులను కిడ్నాప్‌ చేసిన నిందితులను విజయవాడ పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు. బుధవారం రాత్రి విజయవాడలోని సింగ్‌నగర్‌ ఆంధ్రప్రభ కాలనీ వద్ద బైక్‌పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులను ఇన్నోవాలో వచ్చిన ఎనిమిది మంది కొట్టి బలవంతంగా వాహనంలో తీసుకెళ్లారు. వారిని గుంటూరు జిల్లా చిలకలూరిపేట తీసుకెళ్లి ఇనుపరాడ్లతో చితకబాదారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్ల చెర నుంచి ఆ ఇద్దరిని రక్షించారు. ఈ కేసుకు సంబంధించి గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సౌత్‌ జోన్‌ ఇన్‌చార్జి ఏసీపీ పి.వి.నాయుడు వివరాలను వెల్లడించారు. చిలకలూరిపేటకు చెందిన నరసింహారావు అనే వ్యక్తి ఏడాది కిందట లోహంతో చేసిన దేవుని విగ్రహం కొనుగోలు నిమిత్తం బెంగళూరులో ఉన్న ఒక వ్యక్తికి రూ.65 లక్షల నగదు ఇచ్చారు. నరసింహారావుకు పరిచయం ఉన్న విజయవాడ అరండల్‌పేటకు చెందిన కరీం సయ్యద్‌ బాజీ కూడా అటువంటి విగ్రహం కోసం అదేవ్యక్తికి కొంత నగదు ముట్టజెప్పారు. ఈ క్రమంలో ఏడెనిమిది నెలల కిందట నరసింహారావు చనిపోయారు. ఆయన కుమారుడు శిరమ కళ్యాణ్‌బాబు తన తండ్రి నుంచి రూ.65లక్షలను కరీం సయ్యద్‌ బాజీ కాజేశాడనే అనుమానంతో డబ్బు చెల్లించమని తీవ్ర ఒత్తిడి చేశారు. తనకు ఆ డబ్బు గురించి తెలియదని, తాను కూడా బెంగళూరు వ్యక్తికి డబ్బు ముట్టజెప్పి మోసపోయినట్లు చెప్పినా వినిపించుకోలేదు.  

పథకం ప్రకారమే కిడ్నాప్‌...
ఈ క్రమంలో బాజీని కిడ్నాప్‌ చేసి డబ్బు వసూలు చేయాలని నిర్ణయించుకున్న కల్యాణ్‌బాబు పథకం ప్రకారం బుధవారం రాత్రి 9.30 గంటలకు బైక్‌పై వెళుతున్న బాజీతో పాటు అతని స్నేహితుడు మస్తాన్‌ను కూడా కిడ్నాప్‌ చేశారు. దీన్ని గమనించిన స్థానికులు 100కు సమాచారం ఇవ్వడంతో సింగ్‌నగర్‌ పోలీసులు రంగప్రవేశం చేసి ఇన్నోవా నెంబర్‌ తెలుసుకుని సీసీ కెమెరాల ద్వారా నిందితులను వెంబడించారు. ఈ క్రమంలో 28వ తేదీ తెల్లవాజామున 3గంటల సమయంలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన చిలకలూరిపేటకు చెందిన శిరమ కల్యాణ్‌బాబు, అతని సోదరుడు నాగశ్రీను, బాబాయి సూర్యదేవర నరసింహారావు, మార్కాపురానికి చెందిన రాచకొండ ప్రసాద్, నెక్కల రాజశేఖర్‌ (కల్యాణ్‌బాబు స్నేహితులు), గడతోటి నాగమల్లేశ్వరరావు (కారు డ్రైవర్‌)లను అరెస్టు చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. కాగా కేసులో గుంటూరు జిల్లాకు చెందిన ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌కు సంబంధం ఉందని తెలుస్తోంది.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top