జిత్తులమారి కాంతయ్య! | Kanthaiah Crimes Reveals Hyderabad Police | Sakshi
Sakshi News home page

జిత్తులమారి కాంతయ్య!

Feb 5 2019 10:34 AM | Updated on Apr 3 2019 5:51 PM

Kanthaiah Crimes Reveals Hyderabad Police - Sakshi

ఉప్పల్‌ పోలీసులు అరెస్టు చేసిన కాంతయ్య గ్యాంగ్‌ (ఫైల్‌)

సాక్షి, సిటీబ్యూరో: నిజామాబాద్‌ జిల్లాలో పుట్టి పెరిగాడు... బతుకుదెరువు కోసం ముంబై చేరి అటునుంచి హైదరాబాద్‌ వచ్చి స్థిరపడ్డాడు... 2007లో మోసాలు చేయడం ప్రారంభించి ఇప్పటి వరకు కొనసాగిస్తున్నాడు... మొత్తం తొమ్మిది బోగస్‌ సంస్థలను ఏర్పాటు చేసి రూ.కోట్లలో దండుకున్నాడు... పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఇళ్లు, సిమ్‌ కార్డులు, బ్యాంక్‌ ఖాతాలను సైతం మారుస్తుంటాడు... ఇంతటి ఘరానా మోసగాడైన జిన్నా కాంతయ్య అలియాస్‌ శ్రీకాంత్‌ పల్లీ నుంచి నూనె తీసే మిషన్ల పేరుతో మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ (ఎంఎల్‌ఎం) దందాకు శ్రీకారం చుట్టి గత వారం ఉప్పల్‌ పోలీసులకు చిక్కాడు. కాంతయ్య చేసిన మోసాలు, అక్రమ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 

ముంబై మీదుగా నగరానికి...
నిజామాబాద్‌ జిల్లా, మోర్తాడు మండలం సుంకేటు గ్రామానికి చెందిన జిన్నా శ్రీకాంత్‌కు కాంతయ్య, కాంతి, విశ్వకాంత్‌ తదితర మారుపేర్లూ ఉన్నాయి. అక్కడి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఇంటర్మీడియట్‌ చదువుతూ మధ్యలోనే మానేశాడు. బతుకుతెరువు కోసం రూ.1200 చేతపట్టుకుని ముంబై చేరాడు. కొన్ని సంస్థల్లో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా, మార్కెటింగ్‌ రీసెర్చ్‌ ఇన్వెస్టిగేటర్‌గా పని చేశాడు. అరకొర జీతంతో అక్కడ బతకడం కష్టం కావడంతో హైదరాబాద్‌కు మకాం మార్చాడు. ఆఫ్‌సెట్‌/స్క్రీన్‌ ప్రింటింగ్‌ సంస్థను ఏర్పాటు చేసి పదేళ్ల పాటు నిర్వహించాడు. ఇదీ లాభసాటిగా లేదని భావించిన శ్రీకాంత్‌ తన సంస్థలో ముద్రితమవుతున్న ఆకర్షణీయమైన కరపత్రాలు, వాల్‌పోస్టర్లను చూసి తానూ అలాంటి వాటినే వినియోగించుకుని మోసాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. 

ఏ ‘సీజన్‌’కు మోసం...
ఈ ఘరానా మోసగాడు ఆ సందర్భంలో డిమాండ్‌ ఉన్న వ్యవహారాన్ని తీసుకుని దాని ఆధారంగా మోసానికి తెరలేపేవాడు. వీటిని ప్రచారం చేయడం కోసం కరపత్రాలు, వాల్‌పోస్టర్లు, ఇతర ప్రకటనలు వినియోగించుకునేవాడు. 2007లో రియల్‌ ఎస్టేట్‌బూమ్‌ జోరుగా ఉన్న సమయంలో మహాలైఫ్‌ ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. తమ సంస్థలో సభ్యులుగా చేరి నెలకు రూ.13,600 చొప్పున రెండేళ్ల పాటు చెల్లిస్తే... 150 గజాల స్థలం, రెండు గ్రాముల బంగారంతో పాటు కట్టిన సొమ్ముకు రెట్టింపు ఇస్తామంటూ ప్రచారం చేశాడు. ఈ పేరుతో దాదాపు 3 వేల మంది నుంచి రూ.5 కోట్ల వరకు వసూలు చేశాడు. కొంతకాలానికి బోర్డు తిప్పేసిన శ్రీకాంత్‌ తన సంస్థ పేరును మహాలైఫ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌గా మార్చి మరికొన్ని వ్యవహారాలు సాగించాడు. దీనిపై 2007లోనే సిటీ సీసీఎస్‌లో కేసు నమోదు కావడంతో న్యాయస్థానం నుంచి ముందస్తు బెయిల్‌ పొందాడు. 

ఆర్గానిక్‌ అంటూ మరో అంకం...
ఆర్గానిక్‌ ఉత్పత్తులపై జోరుగా ప్రచారం సాగుతున్న సమయంలో గ్రీన్‌గోల్డ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. తమ ఉత్పత్తులను రాష్ట్ర వ్యాప్తంగా మార్కెటింగ్‌ చేయడానికి డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు కావాలంటూ ప్రచారం చేసుకుని ఆకర్షితులైన వారి నుంచి డిపాజిట్ల పేరుతో అందినకాడికి దండుకున్నాడు. దీనిపైనా కేసు నమోదు కావడంతో కొందరితో రాజీ కుదుర్చుకున్నాడు. ఆపై ప్లాస్టిక్‌పై నిషేధం ప్రకటన వచ్చిన తరవాత పేపర్‌ బ్యాగ్స్‌ తయారీ యంత్రాల పేరుతో జిన్నా ట్రేడింగ్‌ కంపెనీ పేరుతో మరో మోసానికి తెరలేపాడు. మార్కెట్‌లో రూ.300 ఖరీదు చేసే యంత్రాలను తయారు చేయించి వీటిని అంటగట్టి రూ.12,500 నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేశాడు. దీనిపై గత ఏడాది సీసీఎస్‌లో కేసు నమోదైంది. ఇతడిపై బోయిన్‌పల్లి, వరంగల్‌లోని కాకతీయ యూనివర్శిటీ పోలీసు స్టేషన్లలోనూ కేసులు ఉన్నాయి. 2009లో నమోదైన కేసులో బెయిల్‌ పొంది కోర్టుకు హాజరుకాకపోవడంతో నాన్‌–బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. తాజాగా ఉప్పల్‌ కేంద్రంగా గ్రీన్‌ గోల్డ్‌ బయోటెక్‌ సంస్థను ఏర్పాటు చేసి పల్లీ నుంచి నూనె తీసే మిషన్ల పేరుతో ఎంఎల్‌ఎం దందా చేపట్టి రూ.5 కోట్ల వరకు దండుకున్నాడు. 

మకాం మారుస్తూ ముప్పుతిప్పలు...
శ్రీకాంత్‌ గతంలో మహాలైఫ్‌ హోమ్స్, మహాలైఫ్‌ పబ్లికేషన్స్, మహాలైఫ్‌ క్లినిక్, మహాలైఫ్‌ మీడియా ఇంక్, మహాలైఫ్‌ ఇన్నో మార్కెట్స్‌ ఇంక్, మహాలైఫ్‌ హోమ్స్‌ (రియల్‌ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్స్‌) సంస్థల ముసుగులోనూ మోసాలు చేశాడు. మొత్తమ్మీద దాదాపు 5 వేల మంది నుంచి రూ.కోట్లలో దండుకున్నాడు. 2013లో ఓ దశలో ఇతడి కోసం పోలీసుల వేట ముమ్మరం చేయడంతో   వారికి చిక్కకుండా ఉండేందుకు 20 ఇళ్లు, 28 బ్యాంక్‌ ఖాతాలు, 30 సిమ్‌కార్డులు, ఆరు పాన్‌కార్డులు మార్చాడు. అయినా అప్పట్లో తీవ్రంగా గాలించిన పోలీసులు శ్రీకాంత్‌తో పాటు అతడికి సహకరించిన ఇద్దరు భార్యలు మిత, అహల్య, మరోనిందితుడు వెంకటరెడ్డిలను అరెస్టు చేశారు. ఆ విచారణ నేపథ్యంలోనే శ్రీకాంత్‌ తప్పుడు వివరాలతో పాస్‌పోర్ట్, పాన్‌కార్డులు తదితరాలు పొందినట్లువెల్లడైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement