చినతల్లే చిదిమేసింది..!!

Kakinada Girl Kidnap Mysterery - Sakshi

తానే హతమార్చానని అంగీకరించిన దీప్తిశ్రీ సవతితల్లి

తన కుమారుడిని భర్త నిర్లక్ష్యం చేస్తాడన్న అనుమానంతోనే ఘాతుకం

మృతదేహాన్ని మూటగట్టి ఉప్పుటేరులో పడేసిన వైనం

కిలకిలమని నవ్వుతూ నట్టింట పరుగులు తీసే ఆ చిన్నారి లేలేత పాదాలకున్న మువ్వల పట్టీలు ఘల్లుమంటూ సవ్వడి చేస్తే.. ఆ తండ్రి మది ఆనందంతో మురిసిపోయేది. తన జీవితంలో కొండంత సంతోషాన్ని పంచుతున్న ఆ కుమార్తెను తనకు బహుమతిగా ఇచ్చిన భార్య కన్నుమూస్తే.. ఆ పసిబిడ్డ ఆలనాపాలనా చూడడం కష్టమవుతుందన్న ఉద్దేశంతో అతడు రెండో వివాహం చేసుకున్నాడు. తన బిడ్డకు తల్లి లేని లోటును సవతితల్లి తీరుస్తుందని నమ్మాడు. తనకో కుమారుడు కలిగిన తరువాత.. ఆమెలో అనుమాన బీజాలు నాటుకున్నాయి. మొదటి భార్యకు పుట్టిన కుమార్తెను ప్రాణాధికంగా ప్రేమిస్తున్న తన భర్త.. తన కుమారుడికి అన్యాయం చేస్తాడేమోనని సందేహించింది. ఆ అనుమానమే పెనుభూతమవడంతో.. చివరికి తన సవతి కుమార్తెను కడతేర్చింది. కాకినాడ జగన్నాథపురం పాఠశాల వద్ద గత శుక్రవారం ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీ ఐసానిని అపహరించి.. గొంతుకు తువ్వాలు బిగించి, తానే హతమార్చినట్టు ఆమె సవతి తల్లి శాంతికుమారి పోలీసుల విచారణలో వెల్లడించింది. అనంతరం ఆ మృతదేహాన్ని గోనెసంచిలో మూటకట్టి ఇంద్రపాలెం వంతెన వద్ద ఉప్పుటేరులో పడేసినట్టు చెప్పింది. దీప్తిశ్రీ మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు.


పగడాలపేటలో నాన్నమ్మ ఇంటి వద్ద విషాదంలో బంధువులు 

ఏడేళ్ల బాలిక సూరాడ దీప్తిశ్రీ ఐసాని కిడ్నాప్‌తో కలవరపడిన కాకినాడవాసులు ఆ బాలిక హత్యకు గురైందని తెలియడంతో ఆదివారం తల్లడిల్లిపోయారు. సొంత కుమారుడి కంటే మొదటి భార్య కుమార్తెనే భర్త ప్రేమగా చూస్తున్నాడన్న కక్షతో.. రెండో భార్య.. చిన్నారిని కర్కశంగా హత్య చేసి ఉప్పుటేరులో పారేసింది. తొలుత తనకేమీ తెలియదని బుకాయించిన ఆమె.. ఆధారాలు దొరికిపోవడంతో.. పోలీసుల ఇంటరాగేషన్‌లో.. దీప్తిశ్రీని హత్య చేసినట్టు ఒప్పుకుంది. సవతి తల్లి దురాగతం పగడాలపేట వాసులను ఆవేదనకు గురిచేసింది. బాలిక మృతదేహం కోసం పోలీసులు గాలిస్తుంటే.. ఆమె నాన్నమ్మ, బంధువులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని నిరీక్షిస్తున్నారు.  

సాక్షి, కాకినాడ క్రైం: అపహరణనకు గురైన బాలిక సూరాడ దీప్తిశ్రీ ఐసాని (7)ని ఆమె సవతి తల్లి హత్య చేసి ఉప్పుటేరు కాలువలో మూటకట్టి పడేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. జగన్నాథపురం వాటర్‌ ట్యాంక్‌ వద్ద ఉన్న నేతాజీ మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోన్న చిన్నారిని ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం కిడ్నాప్‌.. నగరంలో కలకలం సృష్టించిన విషయం పాఠకులకు విదితమే. ఆ బాలిక తండ్రి సూరాడ సత్యశ్యామ్‌ కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారి అదృశ్యమైన వెంటనే పోలీసులు ఆమె సవతి తల్లి శాంతికుమారిని అదుపులోకి తీసుకున్నారు. ముందు తనకు ఏమీ తెలియదని పోలీసుల వద్ద బుకాయించింది. చిన్నారి చదువుతున్న పాఠశాలకు తీసుకెళ్లి విద్యార్థులకు ఆమెను పోలీసులు చూపించారు. దీప్తిశ్రీని ఆమె తీసుకెళ్లిందని, మమ్మీతో వెళుతున్నట్టు స్నేహితులకు చెప్పి వెళ్లిందని విద్యార్థులు పోలీసులకు తెలిపారు.


దీప్తిశ్రీని తీసుకు వెళుతున్న పినతల్లి

సీసీ కెమెరాల్లో చిన్నారిని సవతి తల్లే తీసుకువెళ్లినట్టు రికార్డు అయిందని, అయితే ముఖానికి ముసుగు వేసుకోవడం వల్ల పోలీసులు వెంటనే నిర్ధారించ లేకపోయారు. పోలీసులు తమదైన శైలిలో ఇంటరాగేషన్‌ చేయడం, పాఠశాల విద్యార్థులు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడంతో.. పాఠశాల నుంచి దీప్తిశ్రీని తీసుకువెళ్లి తానే హత్య చేశానని సవతి తల్లి ఒప్పుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. పాఠశాల నుంచి నేరుగా సంజయ్‌నగర్‌లోని ఆమె ఇంటికి తీసుకెళ్లి పాప వెనక్కి తిరిగి ఉన్న సమయంలో మెడలో తువ్వాలు వేసి బిగించి చంపేసినట్లు అంగీకరించినట్టు చెబుతున్నారు. పాపను చంపేసిన తరువాత గోనె సంచిలో కట్టేసి సంజయ్‌నగర్‌ నుంచి బైక్‌పై ఇంద్రపాలెం బ్రిడ్జి వద్దకు వచ్చి ఉప్పుటేరులో పడవేసినట్లు పోలీసుల విచారణలో సవతి తల్లి వివరించినట్లు తెలుస్తోంది.


ఉప్పుటేరులో దీప్తిశ్రీ మృతదేహం కోసం గాలింపు చేపట్టిన పోలీసులు
 
పోలీసుల గాలింపు చర్యలు 
దీంతో బాలిక మృతదేహం కోసం పోలీసులు ఉప్పుటేరు, సామర్లకోట–ఇంద్రపాలెం పంట కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. కాకినాడ డీఎస్పీలు కరణం కుమార్, భీమారావు పర్యవేక్షణలో కాకినాడ రూరల్‌ సీఐ ఆకుల మురళీకృష్ణ, ఒన్‌టౌన్‌ సీఐ రామ్మోహన్‌రెడ్డి ప్రత్యేక పడవలపై కాలువలో గాలించారు. మృతదేహం కోసం గాలిస్తున్నామని, ఆ తరువాత అన్ని వివరాలు వెల్లడిస్తామని సీఐ రామ్మోహన్‌రెడ్డి అన్నారు.
 

పగడాలపేటలో విషాదం  
దీప్తిశ్రీ హత్య గురైనట్టు పోలీసులు నిర్ధారణకు రావడంతో పగడాల పేటలో విషాదఛాయలు అలముకున్నాయి. రోజూ అందరినీ ఆప్యాయంగా పలకరించే దీప్తిశ్రీ ఇకలేదని తెలియడంతో ఆమె నాన్నమ్మ సూరాడ బేబీతో పాటు బంధువులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఎంతో చలాకీగా ఉండేదని, మంచిగా చదువుకుంటానని అందరితో చెప్పేదని నాన్నమ్మ ఇంటి పరిసరాల వారు కంటనీరు పెట్టారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో నానమ్మ ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు. కోడలు చనిపోయిన తరువాత పెళ్లి చేసుకుంటానని తన కుమారుడు చెబితే.. ఈ సంబంధం వద్దని చెప్పామని, వినకుండా శాంతికుమారిని పెళ్లి చేసుకున్నాడని నాన్నమ్మ విలపిస్తూ చెప్పింది ఇప్పుడు బంగారం లాంటి మనుమరాలిని చంపేసిందని ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది.

కేసు దర్యాప్తు ముమ్మరం  
దీప్తిశ్రీ ఐసాని కిడ్నాప్‌నకు కుటుంబ కలహాలే కారణమని కాకినాడ డీఎస్పీ కరణం కుమార్‌ తెలి పారు. ఆదివారం రాత్రి వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో సీఐ రామ్మోహన్‌ రెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కుటుంబ సభ్యులను విచారిస్తున్నామని,  సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఇంద్రపాలెం వంతెన వద్ద మృతదేహం ఉందని సమాచారం రావడంతో అక్కడ తనిఖీ చేశామని డీఎస్పీ తెలిపారు.

కొడుకును నిర్లక్ష్యం చేస్తారని..  
దీప్తిశ్రీ తల్లి చనిపోవడంతో తండ్రి శ్యామ్‌కుమార్‌ సంజయ్‌నగర్‌కు చెందిన శాంతికుమారిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి 13 నెలల బాబు ఉన్నాడు. దీప్తిశ్రీపైనే తండ్రి ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడని భావించిన సవతి తల్లి.. ఆమెను ఇబ్బందులకు గురి చేస్తుండేది. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఆ చిన్నారి ఈ బాధలను తనలోనే దాచుకుంది. బాలిక వంటిపై కాల్చిన గుర్తు ఉండడంతో తండ్రి నిలదీయడంతో తల్లి పెడుతున్న చిత్రహింసలు బయటపడ్డాయి. దీంతో బాలికను అతడి చిన్నమ్మ ఇంటి వద్ద ఉంచి జగన్నాథపురంలోని నేతాజీ పాఠశాలలో చదివిస్తున్నాడు. సంజయ్‌నగర్‌ నుంచి చిన్నమ్మ ఇంటికి వెళ్లి రోజూ పాపను స్కూల్‌కి దింపి వస్తున్నాడు. దీంతో చిన్నారిపై సవతి తల్లి కక్ష పెంచుకుంది. తన బాబుని నిర్లక్ష్యం చేస్తాడన్న అనుమానంతో ఆమెను చంపేస్తే ఇబ్బంది ఉండదని భావించి దీప్తిశ్రీని చంపేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top