‘జార్ఖండ్‌ మూక దాడి’ వ్యక్తి మృతి | jharkhand mob attacks on man dead | Sakshi
Sakshi News home page

‘జార్ఖండ్‌ మూక దాడి’ వ్యక్తి మృతి

Jun 25 2019 4:16 AM | Updated on Jun 25 2019 5:11 AM

jharkhand mob attacks on man dead - Sakshi

తబ్రేజ్‌ను కట్టేసి కొడుతున్న దృశ్యం

సెరైకేలా–ఖర్సావన్‌(జార్ఖండ్‌): మోటార్‌ సైకిల్‌ దొంగతనం చేశాడన్న అనుమానంతో జార్ఖండ్‌లో జనసమూహం చేతిలో తీవ్రంగా దెబ్బలు తిన్న యువకుడు మృతి చెందాడు. తీవ్రగాయాల పాలైన తబ్రేజ్‌ అన్సారీ (24) నాలుగు రోజుల తర్వాత మృతి చెందాడని పోలీసులు తెలిపారు. జంషెడ్‌పూర్‌లోని టాటా మెయిన్‌ ఆస్పత్రిలో ఈనెల 22న తబ్రేజ్‌ మృతి చెందినట్లు ధ్రువీకరించారని, అతని మృతిపై దర్యాప్తుకు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. ‘ఈ ఘటనపై సిట్‌ను ఏర్పాటు చేశాం’అని ఎస్పీ కార్తీక్‌ పేర్కొన్నారు.  తబ్రేజ్‌ను జై శ్రీరామ్‌ అని మతపరమైన నినాదాన్ని ఇవ్వమనడంపైనా కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు పప్పు మండల్‌ అనే వ్యక్తిని అరెస్టు చేశామని, దీనిపై విచారణ జరుపుతున్నామన్నారు.

అలాగే ఈ ఘటనకు సంబంధించి తబ్రేజ్‌ భార్య షాయిస్తా పర్వీన్‌ పలువురి పేర్లతో ఫిర్యాదు ఇచ్చారని తెలిపారు. గత మంగళవారం జంషెడ్‌పూర్‌ నుంచి ఇక్కడి గ్రామానికి తన ఇద్దరు స్నేహితులతో కలిసి వస్తున్న తబ్రేజ్‌ అన్సారీ అనే ముస్లిం యువకుడిని సెరైకేలా–ఖర్సావన్‌ జిల్లా ధట్కిడీ గ్రామస్తులు మోటార్‌ సైకిల్‌ దొంగతనం చేశారంటూ అడ్డుకున్నారు. ఈ ఘటనలో మిగతా ఇద్దరు తప్పించుకోగా, తబ్రేజ్‌ గ్రామస్తులకు పట్టుబడ్డాడు. అనంతరం తబ్రేజ్‌ను స్తంభానికి కట్టేసి కర్రలతో ఆ రాత్రంతా కొట్టారు. అలాగే జై శ్రీరామ్, జై హనుమాన్‌ అంటూ నినాదాలివ్వాలని బలవంతం చేశారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతన్ని బుధవారం గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు తబ్రేజ్‌పై దొంగతనం అభియోగాలపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement