
కడపలోని టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డి ఇంటి వద్ద ఐటీ అధికారులు, పోలీసుల బృందం
కడప అర్బన్ : తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి (వాసు) ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు కొనసాగాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు దాదాపు 30 గంటలపాటు సోదాలు నిర్వహించారు. కడపలోని ద్వారకానగర్‌లోని ఆయన ఇంటితో పాటు, హైదరాబాద్‌లో రెండు చోట్ల, విజయవాడ, బెంగుళూరు, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్‌లలో కూడా కాంట్రాక్ట్ పనుల క్రమంలో పన్నులు ఎగవేశారనీ దాడులు చేసినట్లు తెలిసింది. దాడుల సందర్భంగా సీఆర్íపీఎఫ్ గట్టి బందోబస్తు నిర్వహించింది. కడపలో వాసు ఇంటిలో జరిగిన సోదాల సమయంలో ఆయన తల్లి హేమలత ఉన్నారు. వచ్చిన అధికారుల తనిఖీలకు తమ వంతు సహకరించామని వాసు కుటుంబ సభ్యులు తెలిపారు. ఐటీ అధికారులు తనిఖీచేసి పలు కీలకపత్రాలు, బంగారు ఆభరణాలు, నగదును సీజ్ చేశారు. వాటిని తమ వెంట తీసుకుని వెళ్లారు. దాడులకు సంబంధించిన వివరాలేవీ అధికారులు వెల్లడించలేదు.