బ్యాంకులో అక్రమాల బాగోతం

Irregularities In Canara Bank - Sakshi

పుట్టపాక కెనరా బ్యాంకులో రూ.86 లక్షలు స్వాహా

ఇక్కడ పనిచేసిన మేనేజరే సూత్రధారి

సంస్థాన్‌ నారాయణపురం : మండలంలోని పుట్ట పాక కెనరా బ్యాంకులో అక్రమాల బాగోతం బట్ట బయలైంది. గ్రామంలో 2011లో ప్రారంభమైన బ్యాంకులో ఇక్కడ మేనేజర్‌గా పనిచేసిన చంద్రకళ రూ.86 లక్షల అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. వివరాల ప్రకారం.. చంద్రకళ పుట్టపాకలో మేనేజర్‌గా 15–07–2013న బాధ్యతలు చేపట్టి, 24–01–2017 వరకు పని చేశారు. ఆ కాలంలో సుమారు 1100 మందికి కొత్త ఖాతాలు ఇచ్చారు.

అందులో 67 ఖాతాలును ఆమే సృష్టించారు. అవసరమైన ద్రువీకరణ పత్రాలను హైదరాబాద్‌కు చెందిన సురేష్‌ సాయంతో తయారు చేయిం చారు. సురేష్‌ కొంతమంది కార్డులు, ఫొటోలు, చిరునామాలు, ఇతర వివరాలుతో సంబంధం లేకుండా పుట్టపాక చిరునామాలు సృష్టించి, ఐడెంటి కార్డులు తయారు చేశారు. ఆ ఐడెంటితో సబంధంలేని వ్యక్తులకు ఆమె ఖాతాలు ఇచ్చింది. వారికి రూ.4లక్షల నుంచి రూ.94 వేల వరకు రుణాలు ఇచ్చింది.

67 ఖాతాలకు రూ.75లక్షల 87వేలు రుణాలు మంజూరు చేసింది. ఇందులో ఎక్కువగా చేనేత కార్మికుల రుణాలు కాగా, కొన్ని ఇతర రుణాలు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా పి.భద్యాకు కారు రుణంగా రూ.4లక్షలు, కిరణ్‌కుమార్‌కు రూ.2లక్షలు, ఫిరజ్‌ఖాన్‌కు రూ.96 వేలు, నారాయణకు రూ.94 వేలు.. ఇలా రూ.75 లక్షల 87వేల వరకు రుణాలు మంజురు చేసింది.

ఈ ఖాతాలకు సబంధించిన ఏటీఎంలు, చెక్కుబుక్‌లను ఇచ్చి.. మేనేజర్‌ చంద్రకళ కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇవే కాకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాడావల్సిన రూ.10,83,682 లను కూడా వాడుకున్నట్లు ఆరోపణలున్నాయి. మొత్తం రూ.86,70,682 కాజేసింది. అప్పట్లో రుణాలు రికవరీ చేయాలని అధికారులు ఒత్తిడి చేయడంతో రూ.11లక్షలు రికవరీ చేసినట్లుగా ఆమే చెలించింది. 

మేనేజర్‌ మారడంలో వెలుగులోకి..

అమె బదిలీపై వెళ్లడంతో కొత్తగా వచ్చిన మేనేజర్లు రుణాల రికవరీకి వెళ్లినప్పుడు రుణాల పొందిన వ్యక్తులు పుట్టపాకలో లేకపోవడంతో అనుమానాలు బలపడ్డాయి. దీంతో బ్యాంకు ఉన్నతాధికారులు ఇతర బ్యాంకులకు చెందిన ఇద్దరు బ్రాంచి మేనేజర్‌లు, అప్పటి బ్యాంకు మేనేజర్‌ శ్రీనివాస్‌ బ్యాంకు పరంగా విచారించి.. కాజేసిన మొత్తాన్ని గుర్తించారు. ఈ మేరకు మేనేజర్‌ శ్రీనివాస్‌ 17 జనవరి 2018న సంస్థాన్‌ నారాయణపురం పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ చేసి సెక్షన్‌ 402, 406, 468, 471 కింద కేసు నమెదు చేశారు. 

కేసు విషయంలో.. సీఐపై వేటు..

ఈ కేసు విచారణ చేపట్టాల్సిందిగా మార్చిలో నూతనంగా చౌటుప్పల్‌ రూరల్‌ సీఐగా బాధ్యతలు చేపట్టిన ఆకుల సతీష్‌కు ఇచ్చారు. కేసు విచా రించిన అయన ఈ నెల 20న చంద్రకళ, సహకరించిన సురేష్‌ను రిమాండ్‌ చేయాల్సి ఉండగా.. సురేష్‌ను మాత్రమే రిమాండ్‌ చేశారు

సీఐ సతీష్‌ తన నుంచి లంచం డిమాండ్‌ చేస్తున్నాడని ఇటీవ ల మేనేజర్‌ చంద్రకళ రాచకొండ సీపీకి ఫిర్యాదు చేసింది. కేసు విచారించిన సీపీ సీఐపై సస్పెన్షన్‌ వే టు వేశారు. దీంతో ఆమె అక్రమాలు బయటకొ చ్చాయి. ఈ విషయమై ప్రస్తుత బ్యాంకు మేనేజర్‌ సంజయ్‌కుమార్‌ను వివరణ కోరాగా.. తాను రెం డు రోజుల క్రితమే మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టానని.. నాకు ఏమీ తెలియదని సమాధానం చెప్పారు.

రుణమాఫీ అవుతుందనే..

చేనేత రుణాలు మాఫీ చేస్తామని మంత్రి కేటీఆర్‌ ప్రకటనతో.. అక్రమ రుణాల మంజూరీకి బీజం పడిందిని పలువురు అనుమానలు వ్యక్తం చేస్తున్నారు. మేనేజర్‌గా చంద్రకళ లేని వ్యక్తులకు ఇచ్చిన రుణాలు అన్ని చేనేత రుణాలు ఉన్నాయి. చేనేత రుణాలు మాఫీ అయితే.. కాజేసిన మొత్తానికి ఇబ్బందులు ఉండవనే ఆమె పెద్ద పన్నాగం పన్నిట్లుగా అనుమానలు వ్యక్తమవుతున్నాయి.

చౌటుప్పల్‌ రూరల్‌ సీఐ సస్పెన్షన్‌

చౌటుప్పల్‌ : చౌటుప్పల్‌ రూరల్‌ సీఐ ఆకుల సతీష్‌ సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఈ మేరకు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.  యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలో సీసీఎస్‌ సీఐగా పనిచేస్తున్న ఆయన మార్చి 25న బదిలీపై ఇక్కడికి వచ్చారు. స్థానిక బంగారిగడ్డ కాలనీలో గురుకుల పాఠశాల పక్కన ఇటీవల సీఐ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. సంస్థాన్‌నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలోని కెనరా బ్యాంకులో జరిగిన అవినీతికి సంబంధించి బ్యాంకు మేనేజర్‌ వద్ద లంచం డిమాండ్‌ చేసినట్లు తేలింది.

అందులో భాగంగా ముందుగా కొంత నగదు సైతం తీసుకున్నాడు. మిగతా డబ్బు కోసం వేధిస్తుండగా మేనేజర్‌ చంద్రకళ వారం క్రితం రాచకొండ పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ముందుగా హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో ఉన్న హెడ్‌క్వార్టర్‌కు అటాచ్‌ చేశారు. విచారణలో వాస్తవమేనని తేలడంతో సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సదరు బ్యాంకు మేనేజర్‌ వద్దపెద్ద మొత్తంలో లంచం డిమాండ్‌ చేయడంతో పాటు  తన కార్యాలయానికి వచ్చిన ఆమెపై సీఐ దురుసుగా, అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం.

ఈ మేరకు గురువారం రాచకొండ పోలీస్‌ కమీషనర్‌ మహేష్‌ భగవత్‌ విలేకరులతో మాట్లాడుతూ తన వద్ద లంచం డిమాండ్‌ చేసినట్లు బ్యాంకు మేనేజర్‌ చంద్రకళ తమకు ఫిర్యాదు చేసిందని తెలిపారు.  విచారణ నిర్వహించగా వాస్తవమని తేలడంతో సస్పెండ్‌ చేశామన్నారు. ప్రస్తుతం శాఖా పరమైన విచారణ చేపట్టాల్సి ఉందన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top