అంతర్రాష్ట్ర కిడ్నాప్‌ ముఠా గుట్టురట్టు

Interstate Kidnap Gang Arrest in  Hyderabad - Sakshi

ముగ్గురు చిన్నారులను రక్షించిన చాంద్రాయణగుట్ట పోలీసులు.  

ఏడుగురు నిందితుల అరెస్ట్‌ పరారీలో మరో ఇద్దరు.

చాంద్రాయణగుట్ట: చిన్నారులను కిడ్నాప్‌ చేసి  విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్‌ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. బుధవారం చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్‌ జి.కోటేశ్వర్‌ రావు, బాలాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.సైదులుతో కలిసి వివరాలు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వాకపల్లి గంగాధర్‌ రెడ్డి, వరంగల్‌కు చెందిన పొట్ల జ్యోతి అలియాస్‌ ఫౌజియా, జగద్గిరి గుట్టకు చెందిన జి.ప్రసాద్, అబ్దుల్లా పూర్‌ మెట్‌కు చెందిన సింధు, ఎస్‌.అరుణ, బి.ఎన్‌.రెడ్డికి చెందిన కొర్ర మున్నా, విశాఖపట్టణానికి చెందిన పెద్ది లక్ష్మి, సయ్యదా బీ, కనక రాజు ముఠా ఏర్పడి చిన్నారులను ఎత్తుకెళ్లి ఇతర నగరాల్లో విక్రయిస్తున్నారు.

గత మార్చి 25న మధ్యాహ్నం మహ్మద్‌ నగర్‌కు చెందిన షేక్‌ ఫజల్‌ చిన్న కుమారుడు షేక్‌ సోఫియాన్‌(2.5) ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన ఇన్‌స్పెక్టర్‌ జి.కోటేశ్వర్‌ రావు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా బండ్లగూడలో గంగాధర్‌ రెడ్డి, ఫౌజియాలను అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు వారిచ్చిన సమాచారం ఆధారంగా ఏలూరు, రాజమండ్రి, అమలాపురం ప్రాంతాల్లో దాడులు నిర్వహించి ఏడుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు.
వారు విక్రయించిన బాలుడు సోఫియన్‌తో పాటు బండ్లమొట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కిడ్నాప్‌నకు గురైన పసికందు(ఒక నెల), బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అపహరణకు గురైన షేక్‌ ఖాజాల(2)ను గుర్తించి రక్షించారు. నిందితులను రిమాండ్‌కు తరలించగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి నుంచి రూ.35 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఎస్సైలు కొండల్‌ రావు, కృష్ణయ్య, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

భారీ మొత్తానికి విక్రయం
ఈ ముఠా చిన్నారులను కిడ్నాప్‌ చేసి రూ.లక్షల్లో విక్రయించినట్లు విచారణలో వెల్లడయ్యింది. చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని షేక్‌ సోఫియన్‌ను ఏలూరులో సంతానం లేని రాములుకు రూ.2.8 లక్షలకు విక్రయించగా, బాలాపూర్‌ ఠాణా పరిధిలో కిడ్నాప్‌నకు గురైన షేక్‌ ఖాజాను హనుమంతరావు అనే వ్యక్తికి రూ.3.10 లక్షలకు, బండ్లమొట్టు పీఎస్‌ పరిధిలో కిడ్నాప్‌నకు గురైన పసికందును రాజమండ్రికి చెందిన శిరీషకు రూ.2.5 లక్షలకు విక్రయించినట్లు తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top