ముంబై: 20 మంది పిల్లల్ని కిడ్నాప్ చేసిన నిందితుణ్ని పోలీసులు కాల్చి చంపారు. గురువారం ముంబైలోని పోవై ప్రాంతంలో 20 మంది పిల్లలను బంధించిన నిందితుడు రోహిత్ ఆర్యపై పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో రోహిత్ ఆర్య చికిత్స పొందుతూ మరణించాడు.
తాను నిర్మించనున్న సినిమా,డైలీ సీరియల్స్,వెబ్ సిరీస్‌లో బాల నటీనటులు కావాలంటూ కిడ్నాపర్ రోహిత్ ఆర్య ఓ యాడ్ ఇచ్చాడు. ఆ యాడ్ చూసిన 100 మందికి పైగా పిల్లలు మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఉన్న ప్రముఖ నివాస ప్రాంతం ‘పోవై’ ఆర్‌ఏ స్టూడియోకు తరలివచ్చారు. ఆడిషన్స్ ఇచ్చేందుకు వచ్చిన 100 మంది పిల్లలో 20మంది పిల్లల్ని కిడ్నాప్ చేశాడు. వీరి వయస్సు 15 ఏళ్ల లోపే ఉంటుంది.
అయితే, గురువారం మధ్యాహ్నం 1:45 గంటల ప్రాంతంలో పిల్లలు కిడ్నాప్‌కు గురైనట్లు ‘పోవై’ ప్రాంత పోలీసులకు సమాచారం అందింది. అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పిల్లల్ని రక్షించేందుకు పోలీసులు కిడ్నాపర్ రోహిత్ ఆర్యతో చర్చలు జరిపేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. పిల్లల్ని విడుదల చేసేందుకు రోహిత్ అంగీకరించలేదు. పైగా పిల్లల ప్రాణాలు తీస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో బాత్రూం ద్వారా పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఆ సమయంలో నిందితుడు పోలీసులపై కాల్పులు జరిపారు.
ఈ కాల్పులకు ముందు పిల్లలు కిడ్నాప్‌కు గురైన ‘పోవై’ స్టూడియోలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పిల్లల్ని బంధించిన కిడ్నాపర్ ఓ వీడియోను విడుదల చేశాడు. ఆ వీడియోలో కిడ్నాపర్ రోహిత్ ఆర్య మాట్లాడుతూ.. ‘నావి మామూలు డిమాండ్లే. నేను కొంతమందిని ప్రశ్నించాలని అనుకుంటున్నాను. వాళ్ల నుంచి నాకు జవాబు కావాలి. నేను ముందుగా సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. కానీ ప్లాన్ మార్చి పిల్లల్ని కిడ్నాప్ చేశా. ఈ వీడియో చూసిన తర్వాత పిల్లల్ని రక్షించాలని పోలీసులు ఏదైనా ప్రయోగం చేస్తే ఈ ప్రదేశాన్ని తగలబెడతా. డబ్బును ఆశించడం లేదు. అలాగని ఉగ్రవాదిని కూడా కాదు’ అంటూ బెదిరింపులకు దిగాడు.
అప్రమత్తమైన పోలీసులు రోహిత్ చెర నుంచి పిల్లల్ని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. పిల్లల్ని కాపాడి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రోహిత్ ఆర్య ఎవరు? పిల్లల్ని ఎందుకు కిడ్నాప్ చేశాడు? ఆయన మానసిక స్థితి ఎలా ఉంది? అన్న కోణం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
VIDEO | Mumbai: Police rescue over 20 children who were held hostage inside a flat in Powai area. The suspect, who identified himself as Rohit Arya has been arrested, as per the officials.
(Source: Third Party) pic.twitter.com/EsQRqDuISi— Press Trust of India (@PTI_News) October 30, 2025


