ఐస్‌క్రీమ్, కారా కేంద్రాలపై  కొరడా

Ice Cream Center Seized - Sakshi

హుస్నాబాద్‌లో అనుమతులు లేకుండా ఐస్‌క్రీమ్, కారా తయారీ

ఐస్‌క్రీమ్‌ కంపెనీని సీజ్‌ చేసిన అధికారులు

హుస్నాబాద్‌ : హుస్నాబాద్‌ పట్టణంలోని గీతా ఐస్‌క్రీమ్‌ తయారీ కంపెనీ, కార ఇతరాత్ర తినుబండారాలు తయారు చేస్తున్న రాణి కార కేంద్రంపై మంగళవారం ఫుడ్‌ సేఫ్టీ జిల్లా అధికారి రవీందర్‌రావు, ఏసీపీ మహేందర్, సీఐ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఏక కాలంలో దాడులు నిర్వహించారు. ఈ తనీఖీల్లో ప్రజలకు హానీ కలిగించే ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తున్నట్లుగా తేటతెల్లం కాగా, ఎలాంటి అనుమతులు లేకుండా కంపెనీని నిర్వహిస్తున్నారని అధికారులు స్పష్టం చేశారు.

ఐస్‌క్రీమ్‌లలో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా తయారు చేస్తూ ప్రజలు, ముఖ్యంగా పిల్లలకు హాని కలిగించే విధంగా ఐస్‌క్రీంలు తయారు చేస్తున్నారు. ఐస్‌క్రీమ్‌లో వాటర్‌ శాతం తక్కువగా కలుపుతూ మోతాదుకు మించి వివిధ కెమికల్స్‌ను కలుపుతూ యథేచ్చగా ఐస్‌క్రీమ్‌ కంపెనీని నిర్వహిస్తున్నారని తెలిపారు. అలాగే పిల్లలను ఆకర్షించే విధంగా పెద్ద పెద్ద కంపెనీల పేర్లు గల లేబుల్స్‌  అతికిస్తున్నారని అన్నారు.

ఏంత పెద్ద కంపెనీ ఐస్‌క్రీమ్‌ అయినా మూడు నెలల కంటే ఎక్కువగా నిలువ ఉంచవద్దని, అలాంటిది లేబుల్స్‌ పై ఏడాది కాలం ఎక్స్‌పైర్‌ తేదీని ముద్రించి అమ్ముతున్నారని స్పష్టం చేశారు. ఐస్‌క్రీమ్‌లను భద్రపరిచే ఫ్రిడ్జ్‌ల కండిషన్‌ బాగా లేవని, తయారీ కేంద్రమంతా అపరిశుభ్రతకు నిలయంగా మారిందన్నారు. ఐస్‌క్రీమ్‌ తయారీ కోసం వాడే నీటిలో ఫంగస్‌ వంటి క్రిములున్నాయని తెలిపారు.

ఎక్స్‌పైర్‌ అయిన ఐస్‌క్రీం తినడం వల్ల పిల్లల నోటిలో పొక్కులు పొడవడం, దురద, మోషన్స్, క్యాన్సర్‌ వచ్చే అవకాశముంటుందని ఫుడ్‌ సేప్టీ అధికారి రవీందర్‌రావు తెలిపారు. నాసిరకం కెమికల్స్, పాలు, పాల పౌడర్‌ అంతా కలుషితమైన పదార్థాలతో ఐస్‌క్రీమ్‌లను తయారు చేస్తున్నట్లుగా నిర్ధారించారు. 

 ఐస్‌ క్రీం తయారీ కంపెనీకి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవని అధికారులు నిర్ధారించారు. దీంతో ఐస్‌క్రీం కేంద్రాన్ని సీజ్‌ చేస్తున్నట్లు ఫుడ్‌ సేఫ్టీ జిల్లా అధికారి రవీందర్‌రావు తెలిపారు. కంపెనీలో తయారు చేసే వివిధ రకాల ఐస్‌క్రీమ్‌లను టెస్టింగ్‌ కోసం శాంపిల్‌ సేకరించామన్నారు. ల్యాబ్‌లో పరీక్షలు చేసిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని రవీందర్‌రావు తెలిపారు. 

అనుమతి లేని కారా కేంద్రం...

హుస్నాబాద్‌ పట్టణంలోని ముదిరాజ్‌ కాలనీలోని కార, ఇతర తినుబండారాల తయారీ కేంద్రాన్ని అధికారులు పరిశీలించారు. ఇక్కడి నుంచే వివిధ మండలాలు, పట్టణంలో ఉన్న కిరాణ దుకాణాలకు కార, ఇతర పిండి పదార్ధాలు తయారు చేసి విక్రయిస్తారు. ఈ కేంద్రాన్ని పరిశీలించి, శనగపింగి, మైద పిండి, వంట నూనే ఇతరాత్ర వస్తువులను పరిశీలించారు. దాదాపు 30 మంది వరకు వర్కర్లు పని చేస్తున్నారు.

కేంద్రం నిర్వాహణ కోసం తీసుకున్న ట్రేడ్‌ లైసెన్స్‌ 5 నెలల క్రితమే ల్యాప్స్‌ అయిపోయిందని, రెన్యువల్‌ చేసుకోకుండా ఈ కేంద్రాన్ని నడిపిస్తున్నారని అధికారులు తెలిపారు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న కేంద్రంపై జేసీకి నివేదికను అందించి, తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే నాసిరకం ఐస్‌క్రీమ్‌లను తయారు చేస్తున్న కంపెనీ నిర్వాహకుడిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని ఏసీపీ మహేందర్, సీఐ శ్రీనివాస్‌జీ తెలిపారు. వీరి వెంట ఎస్‌ఐ సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top