నడిరోడ్డుపై బిత్తిరి వేషాలు.. వార్నింగ్‌

Hyderabad Police Warned Dare Series Pranksters - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రాంక్‌ వీడియోల పేరిట నడిరోడ్లపై హల్‌ చల్‌ చేస్తున్న ఇద్దరు యువకులకు నగర పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ‘డేర్‌ సిరీస్‌’ పేరిట వినయ్‌ కుయ్యా, డేర్‌స్టార్‌ గోపాల్‌ అనే ఇద్దరు యువకులు గత కొంత కాలంగా వీడియోలు చేస్తుస్తున్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ నేపథ్యంలో వాళ్ల చేష్టలపై ఫిర్యాదులు అందటంతో చర్యలు తీసుకునేందుకు నగర పోలీసులు సిద్ధమయ్యారు.

బిజీ సమయాల్లో ట్రాఫిక్‌లోకి చేరి నడిరోడ్లపై పడుకోవటం.. తినటం, కార్లపైకి ఎక్కి హల్‌ చల్‌ చేయటం.. వీటితోపాటు పలు సరదా వీడియోలను షూట్‌ చేసి వినయ్‌ తన యూట్యూబ్‌ అకౌంట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నాడు. అయితే వాళ్ల బిత్తిరి చర్యలతో ప్రయాణికులకు విఘాతం కలిగించటమే కాకుండా.. ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నారని కొందరు వాహనదారులు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అంతేకాదు వీళ్ల వ్యవహారాన్ని పలువురు మంత్రి కేటీఆర్‌ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు వారికి హెచ్చరికలు జారీ చేశారు. ‘ఈ విషయంపై ఫిర్యాదు అందిన మాట వాస్తవం. పరిశీలించి చర్యలు తీసుకుంటాం’ అని ట్రాఫిక్‌ సెల్‌ అధికారి రాజా వెంకట్‌రెడ్డి తెలిపారు. 

సినిమాల్లో చేస్తే తప్పులేదా?...
‘నేనో క్రియేటివ్‌ డైరెక్టర్‌ని. ఇలాంటి వీడియోలు షూట్‌ చేయటమే నా పని. ఎవరికీ ఇబ్బందులు కలగకుండానే వీడియోలు చేస్తున్నాం. ప్రమాదాలు జరిగిన దాఖలాలు కూడా లేవు. తాగుబోతులు, బిచ్చగాళ్లు న్యూసెన్స్‌ క్రియేట్‌ చేస్తే వాళ్లను పట్టించుకోకుండా.. మమల్ని అడ్డుకుంటామనటం సరైంది కాదు. సినిమాల్లో హీరోలు చొక్కాలు విప్పటం, పరుష పదజాలం వాడినప్పుడు.. మేం చేసే వీడియోలకు అభ్యంతరం ఏంటి? పైగా అవెర్‌నెస్‌కు సంబంధించిన వీడియోలే మేం ఎక్కువగా షూట్‌ చేశాం. వాటికి మంచి స్పందన కూడా లభించింది’ అని వినయ్‌ చెబుతున్నాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top