బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ ప్రమాదం.. కేసు నమోదు

Hyderabad Biodiversity Flyover Accident : Police Register Case - Sakshi

సాక్షి హైదరాబాద్‌ : గచ్చిబౌలి బయోడైవర్సిటీ ప్లైఓవర్‌ జంక్షన్‌లో రోడ్డు ప్రమాదానికి కారణమైన కల్వకుంట కృష్ణ మిలాన్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంలో ఒకరి మృతికి కారణమయ్యారంటూ అభియోగాలు మోపారు. అంతేకాకుండా ఓవర్‌ స్పీడ్‌గా నడిపినందుకు అతనిపై ట్రాఫిక్‌ పోలీసులు వెయ్యిరూపాయల జరిమానా విధించారు. కల్వకుంట కృష్ణ మిలాన్‌ రావు ఎంపవర్‌ ల్యాబ్‌ అండ్‌ ఏఆర్‌ గేమ్స్‌ సంస్థ ఫౌండర్‌. అతనికి ఈ మధ్య నిశ్చితార్థం జరిగినట్టు తెలుస్తోంది.
చదవండి: ఫ్లై ఓవర్ ప్రమాదం‌: ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు

గచ్చిబౌలి బయోడైవర్సిటీ ప్లైఓవర్‌ జంక్షన్‌లో శనివారం మధ్యాహ్నం ఓ కారు 105 కిలోమీటర్ల వేగంతో బయల్దేరిన నిమిషంలోపే అదుపు తప్పింది. ఫ్లైఓవర్‌ మీదుగా.. 19 మీటర్ల ఎత్తు నుంచి గాల్లో ఎగురుతూ కింద రోడ్డుపై పడి.. చెట్టును బలంగా ఢీకొట్టింది. ఆ చెట్టు కింద కుమార్తెతో కలిసి బస్సు కోసం వేచి చూస్తున్న మహిళపై పడింది. ఈ ఘటనలో శరీర భాగాలు ఛిద్రమై.. మహిళ మృత్యువాత పడింది. చెట్టు కూకటివేళ్లతో సహా నేలకూలింది. నలుగురు గాయపడ్డారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 86, ప్లాట్‌ నంబర్‌ 530లో నివాసం ఉండే కల్వకుంట్ల కృష్ణ మిలాన్‌ రావు (27) శనివారం మధ్యాహ్నం రాయదుర్గం వైపు నుంచి వోక్స్‌ వ్యాగన్‌ పోలో కారు (టీఎస్‌09 ఈడబ్ల్యూ 5665)లో బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ పై నుంచి మైండ్‌స్పేస్‌ వైపు బయల్దేరారు. ఈ ఫ్లైఓవర్‌పై 40 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సి ఉండగా, ఆ సమయంలో కారు 105 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. అతి వేగంగా వెళ్తూ ఫ్లైఓవర్‌ మలుపు వద్ద ఒక్కసారిగా అదుపుతప్పింది.
చదవండి: బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం

1.04 నిమిషాల సమయంలో కారు ఫ్లైఓవర్‌ మీదుగా 19 మీటర్ల పై నుంచి.. కింద రోడ్డుపై  ఉన్న నిసాన్‌ షోరూం ఎదుట పడింది. ఆపై పల్టీలు కొడుతూ చెట్టును ఢీకొట్టింది. ఆ ధాటికి చెట్టు కింద బస్సు కోసం వేచి చూస్తున్న పసల సత్యవేణి (56) తల, ఛాతీ భాగం ఛిద్రమై అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. ఆమె కాలేయంతో పాటు శరీర భాగాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడటంతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. కారు బలంగా ఢీకొట్టడంతో చెట్టు కూకటివేళ్లతో సహా పడిపోయింది. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు సమీపంలోని కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కారు నడుపుతున్న కల్వకుంట్ల కృష్ణ మిలాన్‌ రావు.. కారులోని ఎయిర్‌ బెలూన్లు తెరచుకోవడంతో గాయాలతో బయటపడ్డారు. ఆయన తలకు, చెవికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కుర్బా (23).. ఛాతీకి తీవ్ర గాయాలవడంతో పక్కటెముకలు విరిగిపోయాయి. అనంతపురానికి చెందిన ఈమె ఆరు నెలల క్రితం నగరానికి వచ్చి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. పీపుల్‌ టెక్‌ కంపెనీలో ఇంటర్వ్యూకు వెళ్లేందుకు ఆటో కోసం వేచి చూస్తూ ప్రమాదంలో గాయపడ్డారు. ఆమెకు ఆర్థోపెడిక్‌ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రయాణికులను ఎక్కించుకునేందుకు చెట్టు కింద వేచి చూస్తున్న ఆటో డ్రైవర్‌ ముడావత్‌ బాలూ నాయక్‌ (38) ఎడమ కాలి పాదం పూర్తిగా దెబ్బతింది.   మృతురాలి కుమార్తె ప్రణీత స్వల్పంగా గాయపడ్డారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top