నా భర్త ఆత్మహత్యకు కులాంతర వివాహమే కారణం

Husband Suicide For inter Caste marriage Reason - Sakshi

అందరూ అంటరానివారిగా చూశారు

ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి

పోలీసులకు మృతుడు మధు భార్య ఫిర్యాదు

చిత్తూరు, రొంపిచెర్ల: తన భర్త ఆత్మహత్యకు కులాంతర వివాహమే కారణమని మృతుని భార్య వెంకటరత్నమ్మ బోరున విలపించారు. ఆమె శనివారం మాట్లాడుతూ మధు తిరుపతిలో డిగ్రీ చదివే సమయంలో తాను కూడా అక్కడే చదువుకుంటున్నానని చెప్పింది. తనను ప్రేమిస్తున్నానని వెంట పడుతుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని పేర్కొంది.  పోలీసులు ఎదుట మధు పెళ్లి చేసుకుంటానని చెప్పాడని వివరించింది. అందుకు మధు తల్లిదండ్రులు ఒప్పుకోలేదని తెలిపింది. వారిని ఎదిరించి కులాంతర వివాహం చేసుకున్నామని పేర్కొంది. మొదట్లో గ్రామంలో అందరూ తమను అంటరానివారిగా చూసేవారిని వాపోయింది. పీలేరులో కాపురం పెట్టామని చెప్పింది.

స్వగ్రామానికి వస్తే కోళ్లఫారం పెట్టిస్తామని అత్తామామలు చెప్పడంతో వచ్చామని తెలిపింది. కోళ్లఫారంలో వచ్చిన ఆదాయాన్ని అత్తింటి వారే తీసుకునే వారని, దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోయింది. 15 రోజుల క్రితం తన బిడ్డకు అనారోగ్యంగా ఉంటే తల్లి సాయంతో చికిత్సలు తీసుకోవాలని పుట్టింటికి వెళ్లానని తెలిపింది. ఈ నెల 27న తన భర్త పోన్‌ చేశాడని, బిడ్డ వైద్యం కోసం డబ్బులు అవసరం అవుతాయని చెప్పానని పేర్కొంది. తన దగ్గర డబ్బు లేదని, నీవు ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని తిరిగి రావాలని చెప్పాడని తెలిపింది. శనివారం సాయంత్రం ఎస్‌ఐ ప్రసాద్‌ తనకు ఫోన్‌ చేసి మధు ఆత్మహత్య చేసుకున్నాడని తెలియజేశారని కన్నీరుమున్నీరైంది. కులాంతర వివాహం చేసుకున్నాడని తల్లిదండ్రులు చిన్నచూపు చూడడంతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు తమకు ఎవరు దిక్కని బోరున విలపించింది. బా«ధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top