కట్టుకున్నోడే కడతేర్చాడు | Sakshi
Sakshi News home page

కట్టుకున్నోడే కడతేర్చాడు

Published Wed, May 2 2018 12:29 PM

Husband Killed Wife - Sakshi

పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నవాడే భార్య పాలిట యముడయ్యాడు. ఏడాది కూడా తిరగకుండానే ఆమెకు మరణశాసనం రాశాడు. తల్లిదండ్రులతో కలిసి కట్నం కోసం వేధించడమే కాకుండా.. ఆమె ప్రవర్తనపై అనుమానం పెంచుకుని అతి దారుణంగా కొట్టి చంపాడు. తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలోకి చేరుకున్న తర్వాత.. అమానవీయంగా ఆమెను తీసుకెళ్లి పొలంలో పడేశాడు. గ్రామస్తులు గుర్తించి కసాయి భర్తపై అనుమానం వ్యక్తం చేయడంతో చివరికి ఆ కిరాతకుడు పోలీసులకు లొంగిపోయాడు.    

మహేశ్వరం : మండల పరిధిలోని నాగారం గ్రామం పడమటి తండాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మహేశ్వరం సీఐ సునీల్‌ తెలిపిన వివరాల ప్రకారం... శంషాబాద్‌ మండల గొల్లపల్లి గ్రామానికి చెందిన ఐశ్వర్య(23).. మ హేశ్వరం మండలం నాగారం గ్రామ పంచాయతీకి అనుబంధంగా ఉన్న పడమటి తండాకు చెందిన కాట్రావత్‌ విఠల్‌ నాయక్‌లు భార్యాభర్తలు. (ఐశ్వర్య కుటుంబం మహారాష్ట్రకు చెందిన వారు. గతంలో గొల్లపల్లికి వలస వచ్చారు.)

2017 సంవత్సరంలో వీరిద్దరూ ప్రేమించి సిద్దుల గుట్ట ఆలయంలో పెద్దలను ఎదిరించి కులాంతర వివాహం చేసుకున్నారు. విఠల్‌ నాయక్‌ ఆటో డ్రైవర్‌గా, లారీపైన కార్మికుడిగా పని చేస్తుండేవాడు. వీరు వివాహం చేసు కోవడం విఠల్‌ నాయక్‌ తల్లిదండ్రులు, బంధువులకు ఇష్టం లేదు. పెళ్లైనప్పటి నుంచి ఇంట్లో అత్తమామలు, బంధువులు వంటలు, రొట్టెలు సరిగా చేయడం రాదని, కులం తప్పి తమ కొడుకుని వివాహం చేసుకున్నావని సూటిపోటి మాటలతో ఐశ్వర్యను వేధించేవారు.

కట్నకానుకలు తీసుకురాలేదని భర్త విఠల్‌ నాయక్‌ సహా అత్తమామ, బంధువులు నిత్యం ఇబ్బందులకు గురి చేసి కొట్టేవారు. గతంలో రెండుసార్లు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించి కట్నం గురించి ఇబ్బందులు పెట్టవద్దని విఠల్‌నాయక్‌ కుటుంబ సభ్యులను మందలించారు. అయినా వరకట్నం తీసుకురావాలని ఇబ్బందులకు గురిచేయడంతో ఐశ్వర్య బంధువులతో కలిసి శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో వరకట్న వేధింపుల చట్టం, హత్యాయత్నం కింద కేసు నమోదు చేసింది.

దాంతోపాటు విఠల్‌నాయక్‌ భార్యపై అనుమానం పెంచుకొని నిత్యం కొట్టేవాడు. ఇంట్లో లేకపోతే అనుమానం వ్యక్తం చేసి సూటిపోటి మాటలతో వేధించేవాడు. భార్యను ఎలాగైనా మట్టుబెట్టి వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం రాత్రి భర్త విఠల్‌ నాయక్‌.. ఆమెను కర్రలతో విపరీతంగా కొట్టి అపస్మారక స్థితిలోకి వెళ్లగానే మెడపిసికి హత్య చేసి తన పొలంలో మృతదేహాన్ని పడేశాడు.

ఉదయం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఉదయం పొలానికి వెళ్లే రైతులు ఐశ్వర్య మృతదేహాన్ని గమనించి స్థానిక సర్పంచ్‌ కుండె వెంకటేష్‌కు సమాచారం అందించారు. పోలీసులు సం ఘటన స్థలానికి మృతదేహాన్ని పరిశీలించగా శరీరంపై దెబ్బలు, కళ్లలోంచి రక్తం కారుతుండటం గమనించారు. సమాచారం అందుకున్న మృతురాలి తల్లి, తమ్ముడు, సర్పంచ్‌ సిద్దులు, గ్రామ పెద్దలు సంఘటన స్థలానికి చేరుకుని.. ఐశ్వర్యను ఆమె భర్త విఠల్‌ నాయక్, అత్తమామలు కొట్టి చంపారని  వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలిస్తుండగా గొల్లపల్లి గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు అడ్డగించి.. మృతురాలి అత్తమామ, బంధువులను పంచాయతీ కార్యాలయం వద్దకు పిలవాలని కోరారు. ఐశ్వర్య కుటుంబాన్ని ఆదుకుంటామని హమీ ఇచ్చే వరకు కదలనివ్వమని అడ్డు తగిలారు. అప్పటికే విఠల్‌ నాయక్‌ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఇంట్లో నుండి పరారయ్యారు.

పోలీసులు, నాగారం గ్రామస్తులు కలుగజేసుకొని మృతురాలి కుటుంబ సభ్యులకు న్యాయం చేయిస్తామని హమీ ఇవ్వడంతో మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఐశ్వర్య తల్లి, తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై హఫీజ్‌ తెలిపారు.  

Advertisement
Advertisement