అడవిలో వేట..

Hunters Killing Wild Animals In Warangal Forest Area - Sakshi

వన్యప్రాణులపై వేటగాళ్ల వేటు

సాక్షి, వరంగల్‌ రూరల్‌ : జిల్లాలో వన్యప్రాణుల వేట నిత్య కృత్యంగా మారుతోంది. చట్టాలు ఎన్ని వచ్చినా అడవి జంతువులు, పక్షులకు రక్షణ లేకుండా పోయింది.  దట్టమైన అడవుల్లో ఉచ్చులు పెట్టి వేటగాళ్లు హతమారుస్తున్నారు.. ఎండలు మండుతున్నందున వన్య ప్రాణులు నీటికోసం అల్లాడుతూ కిలో మీటర్ల కొద్ది దురం వెళ్లి నీటి దప్పికను తీర్చుకుంటున్నాయి. ఇదే అదనుగా చేసుకుని వేటగాళ్లు వాటిని వెంటాడి మట్టుబెడుతున్నారు. జిల్లాలోని ఖానాపురం మండలం బండమీది మామిడి తండాలో బుధవారం రెండు కొండ గొర్రెల తలలు లభించాయి. ఈ నెల 28న శాయంపేట మండలం చలివాగు ప్రాజెక్ట్‌ దగ్గర విషపు గుళికలు చల్లి వలస పక్షులను చంపారు. వరుస ఘటనలు జరగడంతో ఫారెస్ట్‌ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

రెండు కొండ గొర్రెల తలలు లభ్యం
ఖానాపురం మండలం బండమీది మామిడితండాలో రెండు కొండ గొర్రెల తలలు గడ్డి వాములో లభించాయి. బుధవారం సమాచారం అటవీశాఖ అధికారులకు తెలియగానే వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. రెండు తలలను స్వాధీనం చేసుకున్నారు. ఓ ఇంటి సమీపంలో ఉన్న గడ్డి వాములో ఉండడంతో ఆ ఇంటి యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కత్తులు, మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అటవీ శాఖ అధికారులు పోలీసుల సహకారంతో విచారణకొనసాగిస్తున్నారు. వేటగాళ్లు ముఠాగా ఏర్పడి వీటిని చంపినట్లు సమాచారం.

వలస పక్షులకు విషపు గుళికలు
జిల్లాలోని శాయంపేట మండలం పత్తిపాక గ్రామ శివారు చలివాగు ప్రాజెక్టు పరివాహక ప్రాంతానికి ప్రతీ సంవత్సరం వేల పక్షులు ఇతర ప్రాంతాల నుంచి వలస వస్తున్నాయి. ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉండడం, నాచు, చేపలు ఆహారంగా దొరకడంతో పక్షులు ఆవాస ప్రాంతంగా మార్చుకున్నాయి. విసిలింగ్‌ డక్స్‌ , టఫ్టడ్‌ డక్స్‌ ,కూమ్బ్‌ డక్స్‌ , కామన్‌ పింటైల్‌ లాంటి అనేకరకాల పక్షులు సీజనల్‌గా కనిపిస్తుంటాయి.

ఇదే అదనుగా భావించి పిట్టలు పట్టేవాళ్లు, వేటగాళ్లు వాటిని వెంటాడి వేటాడి చంపుతున్నారు. విషపు గులికలు చెరువులోని తామెర ఆకులపై చల్లుతున్నారు. మృతిచెందిన పక్షులను వేటగాళ్లు సేకరించి ఒక్కో పక్షిని రూ 100 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. మంసం ప్రియులు ఇతర ప్రాంతాల పక్షులు కావడంతో ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. ఇది వ్యాపారంగా మారిపోయిందని అక్కడి స్థానికులు తెలుపుతున్నారు. ఇటీవల వరుసగా పక్షులు చనిపోతుండడంతో అటవీ శాఖ అధికారులు విచారణ చేపడుతున్నారు. పక్షుల కళేబరాలను సేకరించి ఎలా చనిపోయాయో తెలుసుకునేందుకు హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపినట్లు తెలిసింది.

విచారణ చేస్తున్నాం
ఖానాపురం మండలంలో రెండు కొండ గొర్రెలను చంపిన ఘటనపై విచారణ కొనసాగిస్తున్నాం. ఒకరిని అదుపులోకి తీసుకున్నాం. చలివాగు ప్రాజెక్ట్‌ వద్ద వలస పక్షులను విషపు గుళికల ద్వారా చంపేస్తున్నారని తెలిసింది. దానిపై కూడా విచారణ చేస్తున్నాం. వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్‌ 9 ప్రకారం వన్యప్రాణులను, పక్షులను వేటాడి చంపితే వెంటాడి చంపిన నేరం. జరిమానాతో పాటు జైలు శిక్షను విధిస్తారు.
 –పురుషోత్తం, జిల్లా అటవీ శాఖ అధికారి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top