అల్లుడు ఖతం

Honor Killing in Hassan District Karnataka - Sakshi

హాసన్‌ జిల్లాలో పరువు హత్య   

చెల్లెలి వరుసయ్యే యువతితో ప్రేమ పెళ్లి  

పగతో యువతి తండ్రి ఘాతుకం

కర్ణాటక, బనశంకరి: రాష్ట్రంలో పరువు హత్య కలకలం సృష్టించింది. ఓ మామ అల్లున్ని దారుణంగా హత్య చేయించినట్లు వెల్లడైంది. హాసన్‌ జిల్లా హొళెనరసీపుర హేమావతి నదిలో లభించిన మృతదేహం మిస్టరీ వీడింది. ఈ హత్య కేసును ఛేదించిన హాసన్‌ పోలీసులు 6 మందిని ఆదివారం అరెస్ట్‌ చేశారు. హాసన్‌కు చెందిన మంజునాథ్‌ అనే యువకుడు, అదే గ్రామానికి చెందిన దేవరాజ్‌ కుమార్తెను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ వరుసకు అన్నా చెల్లెలు కావడంతో ఈ పెళ్లిని యువతి తండ్రి దేవరాజ్‌ తీవ్రంగా వ్యతిరేకించాడు. దీంతో యువకుడు, యువ తి ఇంటి నుంచిపారిపోయి మూడుముళ్లు వేసుకుని మండ్యలో కాపురం పెట్టారు. సెప్టెంబరు 9వ తేదీన వివాహం కాగా నవంబరు 9న సాయంత్రం మంజునాథ్‌ అదృశ్యమయ్యాడు. భర్త కనిపించకపోవడంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

విచారణలో కుట్ర బట్టబయలు  
ఇటీవల హొళెనరసిపుర సమీపంలోని హేమావతి కాలువలో మృతదేహం లభించడంతో  హాసన్‌ పోలీసులు ఆరా తీయగా అది మిస్సయిన మంజునాథ్‌గా గుర్తించారు. మృతదేహంపై ఉన్న గుర్తును బట్టి కత్తులతో పొడిచి హత్య చేసినట్లు తేల్చారు. అన్న వరుసయ్యే వ్యక్తితో కూతురి పెళ్లి జరగడం దేవరాజ్‌ తట్టుకోలేకపోయాడు. సమాజంలో తలెత్తుకుని తిరగడం ఎలాగంటూ ఆగ్రహావేశానికి గురై, ఏకంగా మంజునాథ్‌ హత్యకు కుట్ర చేశాడు. అల్లున్ని చంపడం కోసం రూ.5 లక్షలు సుపారిని ఓ హంతక ముఠాకు అందించి హత్య చేయించినట్లు  పోలీసుల విచారణలో తెలిసింది. నిందితులైన దేవరాజ్తో పాటు యోగేశ్, మంజు, చెలువ, నందన్, సంజయ్‌ అనేవారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top