
సాక్షి, హైదరాబాద్: ఓ ప్రైవేట్ పాఠశాలలో నాలుగున్నర ఏళ్ల చిన్నారి అత్యాచారానికి గురైన ఘటనపై హైకోర్టు స్పందించింది. అభంశుభం తెలియని చిన్నారిని పాఠశాల శానిటేషన్ సూపర్‌వైజర్ అత్యాచారం చేశాడని, సదరు స్కూల్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా ఆదేశాలివ్వాలన్న కేసులో హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇలాంటి స్కూళ్ల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరం ఉందని న్యాయ మూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి అభిప్రాయ పడ్డారు.
గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అజాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చిన్నారిపై పాఠశాలలో పనిచేసే శానిటేషన్ సూపర్‌వైజర్ అత్యాచారం చేశాడని, ఈ పాఠశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరుతూ మిర్ యూసఫ్ అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. శుక్రవారం దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. ప్రతివాదులై న స్కూల్ చైర్మన్, ప్రిన్సిపాల్, కరస్పాండెంట్, రాష్ట్ర విద్యా శాఖ ము ఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యా శాఖ కమిషనర్లకు నోటీసులు జారీ చేశారు. అనం తరం విచారణను సోమవారానికి వాయిదా వేశారు.