అనుమానంతోనే అంతం చేశారు!

He was killed by suspicion on his wife - Sakshi

సుశ్రుత, రమేష్‌ వివాహం అతని తల్లిదండ్రులకు ఇష్టంలేదు 

భార్యపై అనుమానంతోనే హత్య చేశాడు 

ఇన్‌చార్జి డీసీపీ దివ్యచరణ్‌రావు, ఇన్‌చార్జి ఏసీపీ శివకుమార్‌ వెల్లడి

ఘట్‌కేసర్‌: సుశ్రుత, రమేష్‌ల వివాహం రమేష్‌ తల్లిదండ్రులకు ఇష్టం లేదని, భార్య గర్భిణి అయిందన్న అనుమానంతోనే హత్య చేశాడని మల్కాజ్‌గిరి ఇన్‌చార్జి డీసీపీ దివ్యచరణ్‌ రావు, ఇన్‌చార్జి ఏసీపీ శివకుమార్‌ సోమవారం స్పష్టం చేశారు. సుశ్రుత, నాలుగు నెలల కుమారుడి హత్య వివరాలను ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌లో మీడియాకు వెల్లడించారు. సుశ్రుత గూడూరులో రమేష్‌ ఇంటి సమీపంలో అద్దెకున్నప్పటి నుంచి ప్రేమలో పడ్డారు. సుశ్రుత దళితురాలుకాగా, రమేష్‌ పద్మశాలి కులానికి చెందినవాడు. కులాంతర వివాహానికి వీరి పెద్దలు ఒప్పుకోకపోవడంతో పలుమార్లు తగాదాలు జరిగాయి. 2015 నవంబర్‌లో ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా తల్లి దగ్గర ఉంటున్న సుశ్రుతపై రమేష్‌కు గర్భిణి అయిందన్న అనుమానం వచ్చింది. దీంతో కలిసుందామని చెప్పి ఆమె సోదరుడి సాయంతో ఘట్‌కేసర్‌కు రప్పించాడు. ఘట్‌కేసర్‌ ఓఆర్‌ఆర్‌ సమీపంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

అనంతరం నిద్రమాత్రలు మింగే అలవాటున్న సుశ్రుత తనో మాత్ర మింగి కుమారుడికో మాత్రను పాలల్లో కలిపి తాగించింది. వాళ్లు నిద్రమత్తులోకి వెళ్లగానే ద్విచక్ర వాహనంపై కొండాపూర్‌ ప్రభాకర్‌ ఎన్‌క్లేవ్‌కు తరలించాడు. రోడ్డుపైనున్న బంక్‌లో పెట్రోల్‌ కొని సుశ్రుత, కుమారుడిని దహనం చేశాడు. హత్య తర్వాత పాలకుర్తి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన రమేష్‌ను ఘట్‌కేసర్‌ పోలీసులు అదుపులోకి తీసుకొని సోమవారం రిమాండ్‌కు తరలించారు. జంట హత్యలపై రమేష్‌ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల పాత్ర... పరువు హత్యా? అనేది పూర్తి విచారణలో తేలుతుందని వివరించారు. ఘట్‌కేసర్‌ సీసీ రఘువీర్‌రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement
Back to Top