సాక్షి, ఘట్‌కేసర్: ఘట్‌కేసర్ పీఎస్ పరిధిలో ఓ ప్రైవేటు కళాశాలలో బీస్సీ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని గురువారం ఆత్మహత్యాయత్నం చేసింది. కళాశాల యాజమాన్యం, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రానికి చెందిన మల్లి పూజిత పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో ఉంటూ ఘట్‌కేసర్ మున్సిపాలిటీ అవుషాపూర్ నీలిమా నర్సింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతోంది.
ఆమెకు జ్వరంగా ఉండడంతో స్నేహితులతో కలిసి ఆటోలో కళాశాలకు వచ్చి మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు. చాలాసేపు ఫోన్‌లో మాట్లాడిన అనంతరం మూడో అంతస్తు రెయిలింగ్‌పై ఫోన్ పెట్టి కిందికి దూకింది. గమనించిన స్నేహితులు కళాశాల సిబ్బందితో కలిసి జోడిమెట్లలోని నీలిమా ఆస్పత్రికి వైద్యం కోసం తరలించారు. పోలీసులకు సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పరిసరాలు పరిశీలించారు. విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఆమె స్నేహి తులను అడిగి తెలుసుకున్నారు.
జర్వం రావడంతో మాత్ర వేసుకొని కళాశాలకు ఆటోలో వచ్చిందని వారు తెలిపారు. పూజిత తన ఫోన్ స్టేటస్‌లో బుధవారం సాయంత్రం ‘ద ఎండ్’ అని పెట్టుకుందని పోలీసులు తెలిపారు. ఆమె ఆరోగ్యం విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పూజిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పూజిత ఆత్మహత్యా యత్నానికి ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఫోన్‌లో ఎవరితో మాట్లాడింది, మరేదైనా కారణం ఉందా? కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


