అమ్మానాన్నా.. క్షమించండి

gurukul school student commit to suicide  - Sakshi

విషం తాగి గురుకుల విద్యార్థిని ఆత్మహత్య

అనుమానాలకు దారితీస్తున్న సూసైడ్‌ నోట్‌

తన బిడ్డది హత్యని ఆరోపిస్తున్న తల్లిదండ్రులు

ఆ చిట్టి తల్లికి ఎంతటి కష్టం వచ్చిందో.. ఎంతగా మథన పడిందో.. తెలియదు. అమ్మా.. నాన్నా నన్ను ఇంతకాలం సాకారు. నేను ఇలా చేస్తున్నందుకు క్షమించండి.. నాన్నా నాకు చదువంటే చాలా ఇష్టం.. కానీ.. చదవకుండానే చనిపోతున్నాను. అని సూసైడ్‌ నోట్‌ రాసి ఓ విద్యార్థిని విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన బుధవారం వాల్మీకిపురం ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో జరిగింది. రెండు నెలల్లో పదో తరగతి పరీక్షలు రాయాల్సిన కుమార్తె బలవన్మరణం చెందడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.

మదనపల్లె క్రైం/వాల్మీకిపురం: అమ్మా.. నాన్నా .. క్షమించండి.. నాకు చదువంటే చాలా ఇష్టం. కానీ.. చదవకుండానే నేను చని పోతున్నా అని సూసైడ్‌ నోట్‌ రాసి వాల్మీకిపురం ప్రభుత్వ బాలి కల గురుకుల పాఠశాలలో బుధవారం ఓ విద్యార్థిని విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఉపాధ్యాయుల వేధింపులవల్లే బలవన్మరణానికి పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు.. తొట్టంబేడు మండలం పిల్లమేడుకు చెందిన మెరిమి వెంకటసుబ్బయ్య కుమార్తె సుమలత(15) వాల్మీకిపురంలోని ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. సంక్రాంతి సెలవుల్లో ఇంటికి వెళ్లిన ఆమెను అన్న సురేష్‌ మంగళవారం పాఠశాలలో వదిలి వెళ్లాడు. అదే రోజు అర్ధరాత్రి ఆమె నాలుగు పేజీల సూసైడ్‌ నోట్‌ రాసి విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను తోటి విద్యార్థులు గుర్తించి టీచర్లకు సమాచారం ఇచ్చారు. సిబ్బంది బాలికను కారులో వాల్మీకిపురం ఆస్పత్రికి, అక్కడి నుంచి మదనపల్లె ఆస్పత్రికి తరలించారు.

చికిత్స చేయని ప్రైవేట్‌ డాక్టర్లు
మదనపల్లె ప్రభుత్వాస్పత్రిలో వెంటిలేటర్‌ సౌకర్యం లేకపోవడంతో డాక్టర్లు తిరుపతికి రెఫర్‌చేశారు. సిబ్బంది స్థానికంగా ఉన్న ప్రైవేట్‌ ఆస్పత్రులకు తీసుకెళ్లారు. విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉందని పేర్కొంటూ డాక్టర్లు ఆస్పత్రుల్లో చేర్చుకోలేదు. దీంతో తిరిగి ప్రభుత్వాస్పత్రికే తలించారు. అక్కడ సుమలత బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో మరణించింది. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్‌ కన్యాకుమారి ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ స్కూళ్ల జిల్లా కోఆర్డినేటర్‌ రవీంద్రనాథ్‌కు, మృతురాలి తల్లిదండ్రులకు, వాల్మీకిపురం పోలీసులకు చేరవేశారు.

ఉపాధ్యాయుల వేధింపులతోనే..
తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమె చావు కు ఉపాధ్యాయులే కారణమని తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమలత మృతిపై న్యాయ విచారణకు డిమాండ్‌చేశారు.

సూసైడ్‌ నోట్‌పై అనుమానాలు
విద్యార్థిని సుమలత రాసినట్టు చెబుతున్న సూసైడ్‌ నోట్‌లోని అక్షరాల్లో వ్యత్యాసం ఉండడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని వాల్మీకిపురం ఎస్‌ఐ వెంకటేష్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top