గ్రామీణ దంపతుల వద్ద బంగారం అపహరణ

Gold Robbery From Village Couple In Prakasam - Sakshi

పోలీసులను ఆశ్రయించిన బాధితులు

ప్రకాశం, చీరాల రూరల్‌: పండుగ రోజుల్లో దుకాణాల వద్ద జనం కిటకిటలాడిపోతుండగా దొంగలు మాత్రం తమ పని తాము ఎంచక్కా చేసుకుపోతున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద కాచుకుని కూర్చొంటున్న దొంగలు ఎవరెవరు ఏయే ఊర్ల నుంచి వస్తున్నారు. వారు ఎక్కడికి వెళ్తున్నారు.. ఏవేమి వస్తువులు కొనుగోలు చేస్తున్నారు.. పథకాలు రచిస్తూ తిరుగుతున్న దొంగలు అందినకాడికి దోచుకెళ్తున్నారు. నూతన వస్త్రాలు, బంగారం, వెండి, పచారీలు సామాన్లు వంటి వస్తువులు కొనుగోలు చేసేందుకు ముఖ్యంగా పల్లె వాసులు చీరాల పట్టణానికి పది రోజులుగా విపరీతంగా చేరుకుంటున్నారు. ఇదే అదనుగా భావించిన దొంగలు సందట్లో సడేమియాలా తమపని సులువుగా కానిస్తున్నారు. దొంగల బారిన పడిన పల్లె వాసులు బావురుమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇటువంటి ఘటన పట్టణంలో శనివారం వెలుగుచూసింది. బాధితుల కథనం ప్రకారం.. చినగంజాం మండలం చింతగుంపల్లె గ్రామానికి చెందిన బెజ్జం ప్రభుదాసు, రాణి దంపతులు బట్టలు, వెండి, బంగారు వస్తువులు కొనుగోలు చేసేందుకు శనివారం మధ్యాహ్నం చీరాల వచ్చారు.

ఈ క్రమంలో వారిరువురు మార్కెట్‌ సెంటర్లో ఆటో దిగి నేరుగా మార్కెట్‌ సమీపంలోని ఓ జ్యూయలరీ దుకాణంలోకి వెళ్లి పది వేలు విలువ చేసే రెండు జతల కాళ్ల పట్టీలు, జత కమ్మలు కొనుగోలు చేశారు. అనంతరం వారిరువురు కూరగాయల మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేసి ఎంజీసీ మార్కెట్‌ సెంటర్‌ వద్ద రోడ్డు పక్కగా నిలిపిన గాజుల బండిపై గాజులు కొనుగోలు చేశారు. డబ్బులు ఇచ్చేందుకు కర్రల సంచీ వైపు చూడగా బ్లేడుతో గుర్తు తెలియని దొంగలు సంచీని కోసి ఉండటం గమనించారు. అలానే సంచీలోని వెండి, బంగారు వస్తువులు కూడా కనిపించకపోవడంతో అపహరణకు గురయ్యాయని గుర్తించిన బాధితులు లబోదిబోమంటూ ఒన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ పుటేజీలతో దొంగలను పోలీసులు పట్టుకుని ప్రజలకు మేమున్నామంటూ భరోసా ఇస్తారో లేదో వేచి చూడాల్సిందే మరి. ఇటువంటి సంఘటనలు నిత్యం పట్టణంలో జరుగుతున్నాయి. పోలీసు స్టేషన్‌కు వెళ్తే న్యాయం జరగకపోగా పోలీసులు యక్ష ప్రశ్నలు వేసి వేధింపులకు గురిచేస్తారనే భయంతో బాధితులు తమకు కేసులు ఎందుకులే అనుకుని ఉసూరుమంటూ ఇంటిదారిన పట్టే వారి సంఖ్యే ఎక్కువగా ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top