క్షుద్ర పూజల పేరుతో ఘరానా మోసం

gold jewellery robbery with worship occult - Sakshi

88 గ్రాముల బంగారు నగలతో ఉడాయించిన ఘనుడు

పోలీసులను ఆశ్రయించిన బాధితులు

బద్వేలు అర్బన్‌: క్షుద్రపూజల పేరుతో మాయమాటలు చెప్పి మహిళ వద్ద నుంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి 88 గ్రాముల బంగారు నగలతో ఉడాయించిన సంఘటన మంగళవారం బద్వేలు పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పట్టణంలోని రూపరాంపేటలో నివసించే కుందేటి శ్రీనివాసులు, మల్లీశ్వరీల ఇంటికి మంగళవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి, మీ ఇంటికి అరిష్టం పట్టిందని,అందుకే ఇంటి యజమాని అనారోగ్యంతో ఉంటున్నాడని, శాంతి పూజలు చేయాలని నమ్మబలికించాడు. అయితే ఎప్పటి నుంచో శ్రీనివాసులు అనారోగ్యంతోనే ఉండటంతో నిజమేనని నమ్మి అతనితో పూజలు చేయించుకునేందుకు సిద్ధమయ్యారు.

ఈక్రమంలో కొద్ది సేపు పూజలు నిర్వహించి ఇంట్లో ఉన్న బంగారు నగలను కూడా పూజలో ఉంచి శుద్ధి చేయాలని చెప్పడంతో ఆమె తన వద్ద ఉన్న 88 గ్రాముల నల్లపూసలదండ, సరుడు, 3 ఉంగరాలు, చైను అతని చేతికి ఇవ్వగా వాటిని మూట కట్టి బియ్యంలో ఉంచాడు. తిరిగి సాయంత్రం తెరిచి చూడాలని, అంత వరుకు పూజ గదిలో ఉంచాలని చెప్పి  పూజకు గాను రూ.2వేలు తీసుకుని వెళ్లిపోయాడు. సాయంత్రం భార్యాభర్తలు ఇద్దరు పూజ గదిలోని మూటను విప్పి చూడగా అందులో నగలు లేవు. తాము మోసపోయినట్లు గుర్తించిన వారు అర్బన్‌ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఎస్‌ఐ చలపతి సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top