అపార్ట్‌మెంట్‌ పైనుంచి దూకి ఆత్మహత్య

Girl Suicide by jumping off the apartment - Sakshi

విద్యార్థిని మృతిపై అనుమానాలు  

హైదరాబాద్‌: అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఓ విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. సికింద్రాబాద్‌ ఈస్ట్‌ మారేడుపల్లికి చెందిన సుబ్రహ్మణ్యం కుమార్తె ఎస్‌.హర్షిత (21) హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదువుతోంది. గురువారం 11.30కి నల్లగండ్లలోని హిమసాయి అపార్ట్‌మెంట్‌కు వచ్చింది. అపార్ట్‌మెంట్‌లోని 1401 ఫ్లాట్‌కు వెళ్తున్నట్టు సెక్యూరిటీ రిజిస్టర్‌లో రాసింది. 12.30 గంటల సమయంలో అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి అక్కడికక్కడే మృతి చెందింది. అక్కడివారు అందించిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు.

అపార్ట్‌మెంట్‌ వాసులను హర్షిత గురించి ప్రశ్నించగా తమకెవరికీ తెలియదని జవాబు చెప్పారు. దీంతో పోలీసులు తనిఖీలు చేయగా.. 14వ అంతస్తులో ఆమె బ్యాగ్‌ లభించింది. అందులో బుక్స్, టిఫిన్, వాటర్‌ బాటిల్‌తో పాటు సెల్‌ఫోన్‌ లభించాయి. అందులో ఉన్న వివరాలను చూసి మృతురాలు హర్షితగా గుర్తించారు. సెల్‌ఫోన్‌లో ఉన్న నంబర్‌ ద్వారా తండ్రి సుబ్రహ్మణ్యంకు ఫోన్‌ చేసినా సమాధానం రాకపోవడంతో హెచ్‌సీయూ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాం«ధీ ఆస్పత్రికి తరలించారు.  

వివిధ కోణాల్లో పోలీసుల దర్యాప్తు
ఈస్ట్‌ మారేడుపల్లిలోఉండే హర్షిత తల్లి అనురాధ భర్తకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదువుతున్న హర్షిత.. యూనివర్సిటీ నుంచి వెళ్లి నల్లగండ్లలోని హిమసాయి అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో ఇదే అపార్ట్‌మెంట్‌కు ఎప్పుడైనా వచ్చిందా...? అక్కడ తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా...? ఆత్మహత్య చేసుకోవడంతో వారు తమకు సంబంధం లేనట్లు వ్యవహరించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

యూనివర్సిటీలోని సౌత్‌ క్యాంపస్‌ నుంచి చూస్తే హిమసాయి అపార్ట్‌మెంట్‌ ఎత్తుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే అపార్ట్‌మెంట్‌ను ఎంచుకుందా అనే అభిప్రాయం కలుగుతోంది. అపార్ట్‌మెంట్‌లోని బోర్డులో చూసి నంబర్‌ చెప్పి మరో ఫ్లాట్‌లోకి వెళ్లి పై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఆత్మహత్య కోసమే అపార్ట్‌మెంట్‌ను ఎంచుకుందా..? సెమిస్టర్‌లో ఫెయిల్‌ కావడంతోనే మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తల్లి అనురాధ తన కూతురు బాగా చదువుతుందని ఒక సబ్జెక్ట్‌లో ఫెయిల్‌ అయినట్టు పోలీసులకు తెలిపింది. అపార్ట్‌మెంట్‌ పైన ఉన్నప్పుడే తల్లికి ఫోన్‌ చేయగా ఆమె లిఫ్ట్‌ చేయలేదని, దీంతో బాయ్‌ అని తల్లికి మెసేజ్‌ పెట్టి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top